ఇంకెప్పుడు కట్టిస్తరు!
తాండూరు: ‘సకల సౌకర్యాలతో ఇళ్లు కట్టిస్తామన్నరు. అందులో పార్కు, షాపింగ్ కాంప్లెక్స్, రోడ్లు, పాఠశాల, తాగునీరు, విద్యుత్.. అంటూ అరచేతిలో వైకుంఠం చూపించారు. నాలుగేళ్ల క్రితం డబ్బులు కట్టించుకున్నరు. ఇప్పటివరకు అతీగతీ లేదు. ఇక మేం ఆగలేం. కట్టిన డబ్బులను వడ్డీతోసహా తిరిగివ్వండి.. లేకుంటే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తాం’ తాండూరులో రాజీవ్ స్వగృహ (ఆర్‌ఎస్‌జీ) జీఎం మారయ్య, ఏజీఎం బసయ్యలను లబ్ధిదారులు నిలదీసిన తీరిది.
2010లో తాండూరులో రాజీవ్ స్వగృహ కింద ప్రభుత్వం ఇళ్లు కట్టించేందుకు కొందరి నుంచి ఇంటికి అయ్యే మొత్తంలో 25శాతం నిధులను సేకరించింది. పెద్దఎత్తున ప్రాజెక్టు నిర్వహించాలని భావించినా కేవలం 29 మందే దరఖాస్తు చేసుకున్నారు.
అయితే వారి నుంచి డబ్బులు తీసుకున్న అధికారులు..
ఏడాదిన్నరలో ఇళ్లు పూర్తిచేస్తామని అప్పట్లో చెప్పారు. కానీ నిర్మాణాలు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ విషయంపై లబ్ధిదారులు ఎన్నాళ్లుగానో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. శుక్రవారం రాజీవ్ స్వగృహ తాండూరు ప్రాజెక్టు జనరల్ మేనేజర్ మారయ్య, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బసయ్యలు పట్టణ శివారులోని ఆర్‌ఎస్‌జీ వద్దకు వచ్చారు. విషయం తెలుసుకుని లబ్ధిదారులు అక్కడకు చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు.
‘ఇళ్లు వద్దు.. ఏమీ వద్దు.. మా పైసలు మాకు వడ్డీతో సహా ఇచ్చేయండి’ అంటూ నిలదీశారు.
నాలుగేళ్లుగా తిరుగుతున్నా పనుల్లో ఎందుకు పురోగతిలేదని లబ్ధిదారులు బిచ్చప్ప, కిరణ్‌కుమార్, వెంకటేశం, శ్యాంరావు, శంకరమ్మ, సుజాత, మాణెప్ప తదితరులు జీఎం, ఏజీఎంలను ప్రశ్నించారు. మేమంతా చిరుద్యోగులమని, అప్పుచేసి డబ్బు తెచ్చి కట్టామని, ఓ వైపు వడ్డీలు పెరుగుతుంటే.. మరో వైపు అద్దె ఇళ్లలో ఉండాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌తో సమస్య వచ్చిందని, మూడు నెలల్లో నిర్మాణాలు పూర్తిచేసి ఇళ్లు అప్పగిస్తామని జీఎం సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. మీ మాటలతో విసుగు చెందామని, ఇక నమ్మేది లేదంటూ లబ్ధిదారులు మండిపడ్డారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో చివరకు శాంతించారు.
మూడు నెలల్లో అప్పగిస్తాం: కాంట్రాక్టర్ మధ్యలో పనులు ఆపేసి వెళ్లిపోయారు. అదే మాట్లాడుతున్నాం. 201 ఎకరాలకు గాను 15 ఎకరాల్లో లేఅవుట్ చేశాం. ఇందులో 29 మందికి ఇళ్లు నిర్మించాల్సి ఉంది. క్లాసిక్(రూ.24లక్షలు)-1, ఇంట్రిన్సిక్ (రూ.19లక్షలు)-1, బేసిక్ (రూ.11.30లక్షలు)-16, సివిక్ (రూ.7.10లక్షలు)-11 ఇళ్లు నిర్మించాలి. వీరంతా నిర్మాణం విలువలో 25శాతం చొప్పున రూ.73.34లక్షలు ఆర్‌ఎస్‌జీకి చెల్లించారు. ఈ ప్రాజె క్టు విలువ సుమారు రూ.మూడు కోట్లు. ఇందులో ఇప్పటికే రూ.కోటి విలువైనపనులు చేశాం. విడుదలైన రూ.50లక్షల నిధులు వికారాబాద్ బ్యాంకులో ఉన్నా యి. కాంట్రాక్టర్ సమస్యను కొలిక్కి తెచ్చి పనులు ప్రారంభిస్తాం. మూడు నెలల్లో నిర్మాణాలు పూర్తిచేస్తాం. -జీఎం మారయ్య, (ఆర్‌ఎస్‌జీ) రాజీవ్ స్వగృహ