లక్ష్యసాధనకు సత్ప్రవర్తన అవసరం
రాజాం: సత్ప్రవర్తనతో మెలిగినప్పుడే జీవితాశయాలు నెర వేరుతాయని విజయవాడకు చెందిన ఆల్ట్రాటెక్ సిమెంట్ జనర ల్ మేనేజర్ కె.వెంకటరామన్ అన్నారు. శుక్రవారం రాజాం జీఎంఆర్ ఐటీ కళాశాలలో అచీవర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీయడానికి జీఎంఆర్ ఐటీ ఎన్నో అవకాశాలను కల్పిస్తోందని చెప్పారు. తిరుమల ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్(రాజమండ్రి) డైరెక్టర్ నున్న తిరుమలరావు మాట్లాడుతూ విద్యార్థులకు కఠోరదీక్ష, నిరంతర ప్రయత్నాలు ఎంతో అవసరమన్నారు.
అనంతరం దేశంలోని ప్రముఖ కళాశాలలు, యూనివర్సిటీలలో పేపర్ ప్రెజెంటేషన్, ప్రోజెక్టు డిజైన్ పోటీల్లో పాల్గొని ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందిన 110 మంది విద్యార్థులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జె.రాజామురుగుదాస్, జీఎంఆర్ ఐటీ గవర్నింగ్ కౌన్సిలర్ మెంబర్ డాక్టర్ పీఆర్ దహియా, కన్వీనర్ డాక్టర్ జి.శశికుమార్, డాక్టర్ కేవీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.