Basara Temple: చదువుల తల్లి నిలయంగా వెలుగొందుతూ..
బాసర(ముధోల్): దేశంలోనే రెండో సరస్వతీ దేవి ఆలయంగా బాసర పుణ్యక్షేత్రం అలరారుతోంది. గోదావరినది ఒడ్డున ఆధ్యాత్మిక వాతావరణంలో కొలువుదీరిన ఈ క్షేత్రంలో అమ్మవారు నిత్యం పూజలందుకుంటారు. పురాణాల ప్రకారం వేదవ్యాస మహర్షి తపస్సు చేస్తే జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వేదవ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ల ఇసుక తీసుకువచ్చి సరస్వతి, లక్ష్మి, మహాకాళి దేవత మూర్తులను ప్రతిష్టించాడు. చాళక్యరాజులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు.
సరస్వతీ ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. జిల్లా కేంద్రం నుంచి 70 కిలోమీటర్లు దూరంలో హైదరాబాద్ నుంచి 205 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి నిత్యం మహారాష్ట్ర, నిజామాబాద్, నాందేడ్, ధర్మాబాద్ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. రైలుమార్గం గుండా కూడా బాసరకు చేరుకోవచ్చు.
మూడు గుప్పెళ్ల ఇసుకతో..
వ్యాసుడు గోదావరినది నుంచి మూడు గుప్పెళ్లతో ఇసుకను తెచ్చి మూడు విగ్రహాలను తయారు చేశా డు. ఇక అప్పటి నుంచి వ్యాసపురి, వాసర, అటుపై బాసరగా మార్పు చెందింది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు చేస్తారు. ఇసుకతో ఏర్పాటు చేసిన విగ్రహాలు ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం విశేషం. ఇక విగ్రహాలపై ఉన్న పసుపును భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఈ ప్రసాదం వల్ల విజ్ఞానం లభిస్తుందని భక్తుల విశ్వాసం. దీన్ని బండారా అంటారు.
వాల్మీకి మహర్షి ప్రతిష్ఠించినట్లుగా..
వాల్మీకి మహర్షి ఇక్కడ రామాయణం రాయడానికి ముందు సరస్వతీ దేవి విగ్రహాన్ని ప్రతిష్టించి రామాయణం రాసాడని మరో ప్రతీతి. ఈ గుడికి సమీపంలో వాల్మీకి మహర్షి సమాధి, పాలరాతి శిల్పాలు ఉన్నాయి. ఈ గుహకు దగ్గరగా ఒక గుహ ఉంది. ఈ గుహపై మాలుకుడు అనే మహర్షి తపస్సు చేసినట్లు చెబుతారు. ఇక్కడ ఉన్న ఒక పెద్ద రాతిగుండును తడితే మరోవైపు ఒక్కో శబ్ధం వస్తుంది. ఈ రాతి గుండు లోపల సీతమ్మవారి నగలు ఉన్నట్లు స్థానికులు చెబుతుంటారు. (క్లిక్ చేయండి: అలాంటి పిచ్చి డ్యాన్స్‌లు వద్దు.. గౌరమ్మ తల్లి గౌరవం కాపాడుదాం!)
చాళక్యుల కాలంలో..
ప్రధాన దేవాలయాన్ని చాళక్యుల కాలంలో నిర్మించినట్లు ఆధారాలు లభించాయి. మందిరంలో శిల్ప సంపద లేకపోయినా పరిసరాలు ప్రశాంతంగా ఉంటాయి. ప్రధాన దేవాలయానికి తూర్పు భాగంలో దత్తమందిరం ఉంది. ఇక్కడ దత్త పాదుకలను చూడవచ్చు. దీనికి దగ్గర్లోనే మహాకాళి దేవాలయం ఉంది. అటుపై ఇక్కడే ఉన్న వ్యాసమందిరంలో వ్యాసభగవానుడి విగ్రహం, వ్యాస లింగాన్నీ చూడవచ్చు. మాఘశుద్ధ పంచమినాడు సరస్వతీ దేవి జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. నిజామాబాద్, భైంసా నుంచి నిత్యం పదుల సంఖ్యలో బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి.