రూ.300 కోట్ల మోసం: ఖండించిన నిర్మాత
సాక్షి, చెన్నై : ప్రముఖ సినీ నిర్మాత కే ఈ.జ్ఞానవెల్ రాజా తనపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. దీనిపై ఆయన తన న్యాయవాది ద్వారా మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. 300 కోట్ల రూపాయిల మోసానికి పాల్పడినట్లు సామాజిక మాధ్యమాల్లో, కొన్ని టీవీ చానల్స్‌లో గురువారం ప్రసారం జరిగింది. ఈ కేసులో పోలీసులు ఆయనకు సమన్లు జారీ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని, పూర్తిగా అవాస్తవమని కే ఈ.జ్ఞానవెల్ ఖండించారు. మోసానికి పాల్పడినట్లు వస్తున్న వార్తల్లో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. (మెహందీలో మెరిసిన షాలిని-నితిన్)
తాను మహాముని అనే చిత్రాన్ని నిర్మించాలని, ఆ చిత్ర ఔట్ రైట్ విడుదల హక్కులను తరుణ్ పిక్చర్స్ అధినేత నీతిమణికి విక్రయించినట్లు తెలిపారు. ఆ చిత్రాన్ని రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేశారని, అందులో రూ. 2. 30 కోట్లను మాత్రమే తనకు చెల్లించారని, ఇంకా రూ. 3.95 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. తాను నిర్మాతల మండలిలో ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు. నీతిమణి, ఆయన సతీమణి మేనక, ఆనంద్ అనే ముగ్గురు బిన్ టేక్ పేరుతో చిట్ ఫండ్ కంపెనీ నిర్వహిస్తున్నారని తెలిపారు. (బిచ్చగాడు 2)
అయితే ఆ కంపెనీలో తులసి మణికంఠన్ అనే వ్యక్తి సహా 58 మంది డబ్బు పెట్టారని అన్నారు. వారిని నీతిమణి, ఆనంద్ మోసం చేసినట్లు తెలిసిందన్నారు. తులసి మణికంఠన్ పోలీస్‌స్టేషన్‌లో వారిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తనకు సంబంధం లేకపోయినా తన పేరు చేర్చారని అన్నారు. రామనాథపురం డిప్యూటీ పోలీస్ కమిషనర్ విచారణకు హాజరు కావలసిందిగా తనకు నోటీసులు జారీ చేయడంతో షాక్‌కు గురైనట్లు తెలిపారు. తాను లాక్డౌన్ ముగిసిన తర్వాత విచారణకు హాజరవుతానని తెలిపానన్నారు. (నాలుగు రోజుల్లోనే 25 మిలియన్ వ్యూస్)
ఈ వ్యవహారంపై మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు. మరో విషయం ఏంటంటే తులసి మణికంఠన్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో రూ.3 కోట్లు అని పేర్కొనగా రూ.300 కోట్లు అంటూ సామాజిక మాధ్యమాలు, టీవీ చానల్లో అసత్య ప్రచారం జరుగుతోందని అన్నారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తానని నిర్మాత జ్ఞానవేల్ రాజా పేర్కొన్నారు.