రైతుకు అండగా ఉద్యమబాట
జీవో 271 రద్దు చేయాలని నినదించిన వైఎస్ఆర్సీపీ
తహసీల్దార్ కార్యాలయాల్లో వినతులు
కాకినాడ :
రైతుల యాజమాన్య హక్కులను హరించే విధంగా ఉన్న జీఓ 271ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఉద్యమబాట పట్టింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో పార్టీనేతలు, కార్యకర్తలు గురువారం ఈ విషయమై వినతి పత్రాలు అందజేశారు. రైతులు సమక్షంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయా మండలాల్లో నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఒకప్పుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు పట్టాదారు పాస్‌పుస్తకాలు ద్వారా యాజమాన్య హక్కులు కాపాడే ప్రయత్నం చేస్తే చంద్రబాబు ప్రభుత్వం ఆ విధానానికి తూట్లు పొడుస్తున్న తీరును ఎండగడుతూ జిల్లాలోని పార్టీనేతలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడరూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో రూరల్ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ రైతుకు చెందిన భూమిలో వేరొకరి పేరు నమోదై ఉంటే ఇక ఆ భూమిపై రైతుకు ఎలాంటి హక్కు ఉండదని, పూర్తిస్థాయిలో రికార్డులు సవరించకుండా ఎవరి ప్రయోజనాల కోసం ఈ జీవోను బయటకు తీసుకొచ్చారని కన్నబాబు ప్రశ్నించారు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు కర్రి నాగిరెడ్డి, జడ్పీ ప్రతిపక్షనేత సాకా ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గిరెడ్డి, రాష్ట్ర రైతు విభాగం «అధ్యక్షుడు కర్రి నాగిరెడ్డి మాట్లాడుతూ 271 రద్దు చేయకపోతే రైతులకు అండగా తమ పార్టీ ఉద్యమిస్తుందన్నారు.
అమలాపురంలో పీఏసీ సభ్యులు, నియోజకర్గ కో–ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి నాయకులు, కార్యకర్తలతో కలిసి తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. మండపేట నియోజకవర్గం మండపేట, కపిలేశ్వరపురం వేగుళ్ళ పట్టాభిరామయ్యచౌదరి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేయగా అనపర్తి నియోజకవర్గ కో–ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి అనపర్తి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అలాగే బిక్కవోలు, పెదపూడి, రంగంపేట మండలాల్లో తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు.
పి.గన్నవరం నియోజకవర్గ కో–ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు మామిడికుదురు, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాల్లో తహసీల్దార్లకు నాయకులు, కార్యకర్తలతో కలిసి వినతి పత్రాలు అందజేయగా పెద్దాపురం నియోజకవర్గ కో–ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు, ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం, రౌతులపూడి, ప్రత్తిపాడు మండలాల్లో తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు. జగ్గంపేట నియోజకవర్గం గోకవరంలో కో–ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాసరావు,
రాజమహేంద్రవరంరూరల్ నియోజకవర్గంలో కో–ఆర్డినేటర్లు గిరిజాల బాబు, ఆకుల వీర్రాజు వేర్వేరుగా కడియం తహసీల్దార్‌కు నాయకులు, కార్యకర్తలతో కలిసి వినతి పత్రాలు అందజేశారు.