GO 58
-
జీఓ 58 అమలు చేయాలి
-
రెవెన్యూ’ సమస్యలు పరిష్కరించాలి..
► ఇక్కడి అధికారుల టీం బాగుంది ► జీవో 58, 59లో ఇంకా ముందుండాలి ► ప్రజలకు కష్టం కలిగించొద్దు ► ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ► అధికారులతో ‘రెవెన్యూ’పై సమీక్ష దిలాబాద్ అర్బన్ : సమస్యలు పరిష్కరించడంలో అధికారులు ప్రజలకు కష్టం కలిగించవద్దని, ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు పెండింగ్‌లో లేకుండా చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి, సహాయ, పునరావాస, రెవెన్యూ శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం 6 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో కలెక్టర్ ఎం.జగన్మోహన్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. భూముల సమస్యలు, ఆహార భద్రత కార్డుల పంపిణీ రెవెన్యూ చేపట్టిందన్నారు. ఇక్కడి అధికారుల టీం బాగుందని.. జీవో 58, 59లో ఇతర జిల్లాల కంటే ఇంకా ముందుండాలన్నారు. జిల్లాకు ఏవైనా ఇబ్బందులుంటే చెప్పాలని, సీఎంతో మాట్లాడామని చెప్పారు. ప్రజలకు కష్టం కల్గించకుండా రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జీవో 58 ద్వారా 24,872 దరఖాస్తులు.. అనంతరం జేసీ సుందర్ అబ్నార్ మాట్లాడుతూ జీవో 58 ద్వారా జిల్లా వ్యాప్తంగా 24,872 దరఖాస్తులు రాగా, 16,242 దరఖాస్తులు తిరస్కరించామని, 8,380 దరఖాస్తులను పరిశీలించి భూములను క్రమబద్ధీకరించామని తెలిపారు. సాంకేతిక సమస్యతో ఇంకా 245 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు. జీవో 59కి సంబంధించి 2637 దరఖాస్తులు వచ్చాయని, డబ్బు చెల్లింపు కింద వీరందరి నుంచి రూ.17.85 కోట్లు వసూలు చేసినట్లు వివరించారు. ఇందులో 1,741 దరఖాస్తులను అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మ్యూటేషన్‌లో 10 కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 3,831 మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఇచ్చామని, 345 మందికి బ్యాంకుల ద్వారా రుణ సహాయం అందించామన్నారు. ఈ యేడాది కూడా గ్రామ సభల ద్వారా ఎంపిక చేసి కార్డులు పంపిణీ చేస్తామన్నారు. సాదాబైనామాలపై ప్రత్యేక శ్రద్ధ సాదాబైనామాలపై శ్రద్ధ పెడతామని, దరఖాస్తుల గడువు జూన్ 2 నుంచి 15 వరకు ఉందని పేర్కొన్నారు. సాదాబైనామాల రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు మీ సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని, తహసీల్దార్ కార్యాలయాల్లో మ్యాన్యువల్‌గా కొనసాగితే సమస్యలు వచ్చేట్లు ఉన్నాయని జేసీ డిప్యూటీ సీఎం దృష్టికి తెచ్చారు. దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లో విరాసత్ చేస్తామని చెప్పారు. భూదాన్ ల్యాండ్ పరిశీలనలో ఉందన్నారు. జమాబంధీలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ల్యాండ్ అక్విషన్లో ముందున్నామన్నారు. సర్వేయర్లు తక్కువగా ఉన్నాయని, 52 మండలాలకు 28 మంది సర్వేయర్లు, 11 డిప్యూటీ సర్వేయర్లు ఉన్నారని తెలిపారు. అనంతరం షాదీముబారక్, ఇతర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జీవో 58 ప్రకారం భూముల క్రమబద్ధీకరణలో మూడో స్థానంలో ఉన్నామని, 59లో రెండో స్థానంలో ఉన్నామని మంత్రి జోగు రామన్న తెలిపారు. సమావేశంలో దేవదాయ, హౌసింగ్ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే బాపురావు, సబ్ కలెక్టర్ అధ్వైత్ కుమార్ సింగ్, డీఆర్వో సంజీవరెడ్డి, డీఆర్డీఏ పీడీ అరుణ కుమారి, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, ఆర్డీవోలు ఐలయ్య, శివలింగయ్య, సుధాకర్‌రెడ్డి, అయేషా మస్రత్ ఖానమ్, తహసీల్దార్లు, పర్యవేక్షకులు, అధికారులు పాల్గొన్నారు. -
‘చీకట్ల’ను తరిమికొట్టాం
69వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ రాష్ట్రం వస్తే చిమ్మ చీకట్లు కమ్ముకుంటాయని సమైక్యవాదులు చేసిన విష ప్రచారాన్ని ఏడాదిలోనే తలకిందులు చేశాం. విద్యుత్ కోతల్లేని తెలంగాణను చేతల్లో చూపించాం. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పడిన చిక్కుముడులను విప్పుకుంటూ బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నాం..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. శనివారం 69వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గోల్కొండ కోటపై ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ప్రసంగించారు. తెలంగాణ ప్రాభవానికి చిహ్నమైన గోల్కొండ కోటలో గతేడాది నుంచి స్వాతంత్య్ర దిన వేడుకలను జరుపుకొంటున్నామని, కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో ఎంతో ప్రగతిని సాధించామని ఆయన పేర్కొన్నారు. సంక్షేమం, విద్యుత్, వ్యవసాయం, నీటిపారుదల రంగాల అభివృద్ధికి బృహత్ ప్రణాళికలు రూపొందించామని... సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.27వేల కోట్లు కేటాయించి దేశంలోనే నంబర్‌వన్‌గా రాష్ట్రాన్ని నిలిపామని చెప్పారు. విద్యార్థులకు సన్నబియ్యం, దళితులకు భూమి పంపిణీ, దళిత, మైనారిటీ యువతుల వివాహాల కోసం షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని నెరవేర్చామని.. రూ.17వేల కోట్ల వ్యవసాయ రుణాల్లో ఇప్పటికే రూ.8,500కోట్లు చెల్లించామని తెలిపారు. వ్యవసాయానికి ప్రాధాన్యత.. వచ్చే ఏడాది మార్చి నుంచి వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్‌ను అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రైతులు తమ పంటలను నిల్వ చేసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా 350 గోదాముల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని చెప్పారు. హైదరాబాద్ పరిసరాల్లో గ్రీన్హౌస్లకు రూ.250కోట్లు, ధరల స్థిరీకరణకు రూ.400కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.402కోట్లు కేటాయించామన్నారు. విద్యుత్ రంగంలో సుమారు రూ.91,500కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చామని... 25వేల మెగావాట్ల సామర్థ్యమున్న ప్లాంట్లను త్వరలోనే ప్రారంభించుకోబోతున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. ఉత్తమ విధానాలు అనుసరిస్తున్నాం.. సమైక్య పాలనలో ధ్వంసమైన గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయను ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించారని, ఈ ఏడాది 8వేల చెరువులను పునరుద్ధరించడం ద్వారా ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని కేసీఆర్ చెప్పారు. ప్రఖ్యాత మిచిగాన్ యూనివర్సిటీ ‘మిషన్ కాకతీయ’ను పరిశోధన అంశంగా తీసుకుందని, రాష్ట్ర హైకోర్టు సైతం మిషన్ కాకతీయను అభినందించిందని పేర్కొన్నారు. వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్‌సింగ్ తన పుట్టినరోజును వరంగల్‌లో మిషన్ కాకతీయ కార్యక్రమంలో జరుపుకొన్నారని గుర్తు చేశారు. ఇక ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా పారిశ్రామిక అభివృద్ధి కోసం సింగిల్ విండో విధానం ప్రవేశపెట్టామని కేసీఆర్ తెలిపారు. పరిశ్రమలకు దరఖాస్తు చేసిన రెండు నెలల్లోనే అనుమతులు మంజూరవుతున్నాయని, పరిశ్రమల ఏర్పాటు నిమిత్తం 1.5లక్షల ఎకరాల భూమిని పరిశ్రమల శాఖకు కేటాయించామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరందించే వాటర్‌గ్రిడ్ కల త్వరలోనే సాకారం కాబోతోందని.. పథకం అమలుకు ముందే వాటర్‌గ్రిడ్‌కు హడ్కో వంటి సంస్థలు అవార్డులు ప్రకటించడం గొప్పవిషయమని పేర్కొన్నారు. నీటి పారుదల రంగంపై ప్రత్యేకంగా అధ్యయనం జరిపి త్వరలోనే బృహత్ ప్రణాళికలు సిద్ధం చేస్తామని చెప్పారు. గోదావరి మహా పుష్కరాలను అద్భుతంగా నిర్వహించామని... ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది కృష్ణా పుష్కరాలను నిర్వహిస్తామని తెలిపారు. విశ్వనగరంగా హైదరాబాద్..: హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రూ.25వేలకోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామని కేసీఆర్ వెల్లడించారు. పేదలు నివాసముంటున్న ప్రభుత్వ స్థలాలను జీవో 58 కింద ఉచితంగా క్రమబద్ధీకరించామన్నారు. హైదరాబాద్‌లో మహిళల భద్రత కోసం షీటీమ్స్ ఏర్పాటు చేశామని, పటిష్ట పోలీస్ వ్యవస్థ కోసం సెంట్రల్ కమాండ్ సెంటర్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. కోటిన్నర జనాభా ఉన్న హైదరాబాద్‌కు తాగునీటి కొరత రాకుండా ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో 30టీఎంసీల సామర్థ్యమున్న రెండు రిజర్వాయర్లను నిర్మిస్తామన్నారు. పల్లెలే పట్టుగొమ్మలు.. దేశ ఆత్మ గ్రామాల్లోనే ఉందని, పల్లెలే దేశానికి పట్టుగొమ్మలని చెబుతుంటారని... కానీ స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా గ్రామాల్లో అభివృద్ధి జరగలేదని కేసీఆర్ పేర్కొన్నారు. పల్లెలను దేశానికి పట్టుగొమ్మలుగా మార్చేందుకే ‘గ్రామజ్యోతి’ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. దీనిలో సర్పంచ్ నుంచి జెడ్పీ చైర్మన్ వరకు ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం సాధించిన పురోగతిని వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం గుర్తించిందని, తాము నిర్వహించే సదస్సుకు రావాలని ప్రభుత్వానికి ఆహ్వానం పంపిం దని కేసీఆర్ చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలను సాధించేందుకు అందరూ కలిసి రావాలని ఆకాంక్షించారు.