‘చీకట్ల’ను తరిమికొట్టాం
69వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ రాష్ట్రం వస్తే చిమ్మ చీకట్లు కమ్ముకుంటాయని సమైక్యవాదులు చేసిన విష ప్రచారాన్ని ఏడాదిలోనే తలకిందులు చేశాం. విద్యుత్ కోతల్లేని తెలంగాణను చేతల్లో చూపించాం. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పడిన చిక్కుముడులను విప్పుకుంటూ బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నాం..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. శనివారం 69వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గోల్కొండ కోటపై ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
అనంతరం ప్రసంగించారు. తెలంగాణ ప్రాభవానికి చిహ్నమైన గోల్కొండ కోటలో గతేడాది నుంచి స్వాతంత్య్ర దిన వేడుకలను జరుపుకొంటున్నామని, కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో ఎంతో ప్రగతిని సాధించామని ఆయన పేర్కొన్నారు. సంక్షేమం, విద్యుత్, వ్యవసాయం, నీటిపారుదల రంగాల అభివృద్ధికి బృహత్ ప్రణాళికలు రూపొందించామని... సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.27వేల కోట్లు కేటాయించి దేశంలోనే నంబర్‌వన్‌గా రాష్ట్రాన్ని నిలిపామని చెప్పారు.
విద్యార్థులకు సన్నబియ్యం, దళితులకు భూమి పంపిణీ, దళిత, మైనారిటీ యువతుల వివాహాల కోసం షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని నెరవేర్చామని.. రూ.17వేల కోట్ల వ్యవసాయ రుణాల్లో ఇప్పటికే రూ.8,500కోట్లు చెల్లించామని తెలిపారు.
వ్యవసాయానికి ప్రాధాన్యత..
వచ్చే ఏడాది మార్చి నుంచి వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్‌ను అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రైతులు తమ పంటలను నిల్వ చేసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా 350 గోదాముల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని చెప్పారు. హైదరాబాద్ పరిసరాల్లో గ్రీన్‌హౌస్‌లకు రూ.250కోట్లు, ధరల స్థిరీకరణకు రూ.400కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.402కోట్లు కేటాయించామన్నారు. విద్యుత్ రంగంలో సుమారు రూ.91,500కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చామని... 25వేల మెగావాట్ల సామర్థ్యమున్న ప్లాంట్లను త్వరలోనే ప్రారంభించుకోబోతున్నామని కేసీఆర్ పేర్కొన్నారు.
ఉత్తమ విధానాలు అనుసరిస్తున్నాం..
సమైక్య పాలనలో ధ్వంసమైన గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయను ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించారని, ఈ ఏడాది 8వేల చెరువులను పునరుద్ధరించడం ద్వారా ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని కేసీఆర్ చెప్పారు. ప్రఖ్యాత మిచిగాన్ యూనివర్సిటీ ‘మిషన్ కాకతీయ’ను పరిశోధన అంశంగా తీసుకుందని, రాష్ట్ర హైకోర్టు సైతం మిషన్ కాకతీయను అభినందించిందని పేర్కొన్నారు.
వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్‌సింగ్ తన పుట్టినరోజును వరంగల్‌లో మిషన్ కాకతీయ కార్యక్రమంలో జరుపుకొన్నారని గుర్తు చేశారు. ఇక ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా పారిశ్రామిక అభివృద్ధి కోసం సింగిల్ విండో విధానం ప్రవేశపెట్టామని కేసీఆర్ తెలిపారు. పరిశ్రమలకు దరఖాస్తు చేసిన రెండు నెలల్లోనే అనుమతులు మంజూరవుతున్నాయని, పరిశ్రమల ఏర్పాటు నిమిత్తం 1.5లక్షల ఎకరాల భూమిని పరిశ్రమల శాఖకు కేటాయించామని చెప్పారు.
రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరందించే వాటర్‌గ్రిడ్ కల త్వరలోనే సాకారం కాబోతోందని.. పథకం అమలుకు ముందే వాటర్‌గ్రిడ్‌కు హడ్కో వంటి సంస్థలు అవార్డులు ప్రకటించడం గొప్పవిషయమని పేర్కొన్నారు. నీటి పారుదల రంగంపై ప్రత్యేకంగా అధ్యయనం జరిపి త్వరలోనే బృహత్ ప్రణాళికలు సిద్ధం చేస్తామని చెప్పారు. గోదావరి మహా పుష్కరాలను అద్భుతంగా నిర్వహించామని... ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది కృష్ణా పుష్కరాలను నిర్వహిస్తామని తెలిపారు.
విశ్వనగరంగా హైదరాబాద్..: హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రూ.25వేలకోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామని కేసీఆర్ వెల్లడించారు. పేదలు నివాసముంటున్న ప్రభుత్వ స్థలాలను జీవో 58 కింద ఉచితంగా క్రమబద్ధీకరించామన్నారు. హైదరాబాద్‌లో మహిళల భద్రత కోసం షీటీమ్స్ ఏర్పాటు చేశామని, పటిష్ట పోలీస్ వ్యవస్థ కోసం సెంట్రల్ కమాండ్ సెంటర్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. కోటిన్నర జనాభా ఉన్న హైదరాబాద్‌కు తాగునీటి కొరత రాకుండా ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో 30టీఎంసీల సామర్థ్యమున్న రెండు రిజర్వాయర్లను నిర్మిస్తామన్నారు.
పల్లెలే పట్టుగొమ్మలు..
దేశ ఆత్మ గ్రామాల్లోనే ఉందని, పల్లెలే దేశానికి పట్టుగొమ్మలని చెబుతుంటారని... కానీ స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా గ్రామాల్లో అభివృద్ధి జరగలేదని కేసీఆర్ పేర్కొన్నారు. పల్లెలను దేశానికి పట్టుగొమ్మలుగా మార్చేందుకే ‘గ్రామజ్యోతి’ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. దీనిలో సర్పంచ్ నుంచి జెడ్పీ చైర్మన్ వరకు ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం సాధించిన పురోగతిని వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం గుర్తించిందని, తాము నిర్వహించే సదస్సుకు రావాలని ప్రభుత్వానికి ఆహ్వానం పంపిం దని కేసీఆర్ చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలను సాధించేందుకు అందరూ కలిసి రావాలని ఆకాంక్షించారు.