రెవెన్యూ’ సమస్యలు పరిష్కరించాలి..
► ఇక్కడి అధికారుల టీం బాగుంది
► జీవో 58, 59లో ఇంకా ముందుండాలి
► ప్రజలకు కష్టం కలిగించొద్దు
► ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ
► అధికారులతో ‘రెవెన్యూ’పై సమీక్ష
దిలాబాద్ అర్బన్ : సమస్యలు పరిష్కరించడంలో అధికారులు ప్రజలకు కష్టం కలిగించవద్దని, ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు పెండింగ్‌లో లేకుండా చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి, సహాయ, పునరావాస, రెవెన్యూ శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం 6 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో కలెక్టర్ ఎం.జగన్మోహన్
అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. భూముల సమస్యలు, ఆహార భద్రత కార్డుల పంపిణీ రెవెన్యూ చేపట్టిందన్నారు. ఇక్కడి అధికారుల టీం బాగుందని.. జీవో 58, 59లో ఇతర జిల్లాల కంటే ఇంకా ముందుండాలన్నారు. జిల్లాకు ఏవైనా ఇబ్బందులుంటే చెప్పాలని, సీఎంతో మాట్లాడామని చెప్పారు. ప్రజలకు కష్టం కల్గించకుండా రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
జీవో 58 ద్వారా 24,872 దరఖాస్తులు..
అనంతరం జేసీ సుందర్ అబ్నార్ మాట్లాడుతూ జీవో 58 ద్వారా జిల్లా వ్యాప్తంగా 24,872 దరఖాస్తులు రాగా, 16,242 దరఖాస్తులు తిరస్కరించామని, 8,380 దరఖాస్తులను పరిశీలించి భూములను క్రమబద్ధీకరించామని తెలిపారు. సాంకేతిక సమస్యతో ఇంకా 245 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు. జీవో 59కి సంబంధించి 2637 దరఖాస్తులు వచ్చాయని, డబ్బు చెల్లింపు కింద వీరందరి నుంచి రూ.17.85 కోట్లు వసూలు చేసినట్లు వివరించారు. ఇందులో 1,741 దరఖాస్తులను అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మ్యూటేషన్‌లో 10 కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 3,831 మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఇచ్చామని, 345 మందికి బ్యాంకుల ద్వారా రుణ సహాయం అందించామన్నారు. ఈ యేడాది కూడా గ్రామ సభల ద్వారా ఎంపిక చేసి కార్డులు పంపిణీ చేస్తామన్నారు.
సాదాబైనామాలపై ప్రత్యేక శ్రద్ధ
సాదాబైనామాలపై శ్రద్ధ పెడతామని, దరఖాస్తుల గడువు జూన్ 2 నుంచి 15 వరకు ఉందని పేర్కొన్నారు. సాదాబైనామాల రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు మీ సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని, తహసీల్దార్ కార్యాలయాల్లో మ్యాన్యువల్‌గా కొనసాగితే సమస్యలు వచ్చేట్లు ఉన్నాయని జేసీ డిప్యూటీ సీఎం దృష్టికి తెచ్చారు. దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లో విరాసత్ చేస్తామని చెప్పారు. భూదాన్ ల్యాండ్ పరిశీలనలో ఉందన్నారు. జమాబంధీలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ల్యాండ్ అక్విషన్‌లో ముందున్నామన్నారు. సర్వేయర్లు తక్కువగా ఉన్నాయని, 52 మండలాలకు 28 మంది సర్వేయర్లు, 11 డిప్యూటీ సర్వేయర్లు ఉన్నారని తెలిపారు. అనంతరం షాదీముబారక్, ఇతర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జీవో 58 ప్రకారం భూముల క్రమబద్ధీకరణలో మూడో స్థానంలో ఉన్నామని, 59లో రెండో స్థానంలో ఉన్నామని మంత్రి జోగు రామన్న తెలిపారు. సమావేశంలో దేవదాయ, హౌసింగ్ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే బాపురావు, సబ్ కలెక్టర్ అధ్వైత్ కుమార్ సింగ్, డీఆర్వో సంజీవరెడ్డి, డీఆర్డీఏ పీడీ అరుణ కుమారి, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, ఆర్డీవోలు ఐలయ్య, శివలింగయ్య, సుధాకర్‌రెడ్డి, అయేషా మస్రత్ ఖానమ్, తహసీల్దార్లు, పర్యవేక్షకులు, అధికారులు పాల్గొన్నారు.