జన్మభూమితో ఒరిగిందేమిటి?
నాల్గో రోజు అవే సెగలు
బాక్సైట్ జీవో రద్దుకు తీర్మానాలు చేయించిన గిరిజనులు
అధికారులను రోడ్డుపై నిలిపేసిన మన్యం ప్రజలు
విశాఖపట్నం: జిల్లా వ్యాప్తంగా నాల్గో రోజు జరిగిన ‘జన్మభూమి- మా ఊరు’ సభల్లో సేమ్ సీన్ రిపీటైంది. చైతన్యవంతులైన జనం సమస్యలపై ఎక్కడిక్కడే అధికారులను నిలదీశారు. మొక్కుబడిగా జరుపుతున్న సభలు మాకు అక్కర్లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన దరఖాస్తులకు మోక్షం, సమస్యలకు పరిష్కారం లేనప్పుడు ఇప్పుడొచ్చి ఏం చేస్తారంటూ ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పటిలాగే ఆయా సభల్లో పెత్తనం చెలాయిస్తూ దరఖాస్తుదారుల ఆగ్రహానికి గురయ్యారు.
విశాఖ నగరం విశాలాక్షినగర్‌లో సమస్యలను ప్రస్తావిస్తున్న విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. శ్మశానవాటిక సమస్యపై ప్లకార్డులు ప్రదర్శిస్తున్న వీరిని నిలువరించారు. దీంతో విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులు ఎదురు తిరిగారు. పోలీసుల జోక్యం చేసుకుని సభను నిర్వహించారు. భీమిలి మండలం చిట్టివలసలో మూతపడ్డ జ్యూట్‌మిల్లును తెరిపించడానికి ప్రజాప్రతినిధులు కృషి చేయడం లేదంటూ సీపీఐ, వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళనకు దిగారు.దేవరాపల్లి మండలం తారువాలో బయోమెట్రిక్ పనిచేయక అర్హులైన పేదలకు పింఛన్లు, రేషన్‌కార్డులు అందకుండా పోతున్నాయని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.
ఏజెన్సీలోని హుకుంపేట మండలం గన్నేరుపుట్టు, చీకుమద్దిల పంచాయతీల్లో జన్మభూమి సభలను జరగకుండా అక్కడ గిరిజనులు అడ్డుకున్నారు. సమస్య పరిష్కరించకుండా ఎందుకొచ్చారంటూ ఐదు గంటలకుపైగానే అధికారులను రోడ్డుపైనే నిలిపి వేసి నిరసన తెలిపారు. అరకు మండలం గన్నెల పంచాయతీలో గిరిజనులు జన్మభూమి సభలను అడ్డుకున్నారు. చివరకు బాక్సైట్ తవ్వకాల జీవోను రద్దు చేయాలంటూ తీర్మానం చేయడంతో సభకు అనుమతించారు. ఇదే మండలం పద్మాపురం, డుంబ్రిగుడ మండలంలోని మరికొన్ని గ్రామాల్లోనూ బాక్సైట్ జీవో రద్దు చేయాలంటూ గిరిజనులు తీర్మానాలు చేయించారు. నర్సీపట్నం 8వ వార్డులో జన్మభూమి సభకు జనం హాజరు కాకపోవడంతో.. అధికారులే కార్యక్రమాన్ని తూతూమంత్రంగా నిర్వహించి వెళ్లిపోయారు.పాయకరావుపేట మండలం పెంటకోటలో జెడ్పీ ఫ్లోర్ లీడర్ చిక్కాల రామారావు డ్వాక్రా మహిళలకు పొదుపు సొమ్ము ఇస్తామని మోసం చేశారంటూ అధికారులను అడ్డుకున్నారు.
కోటవురట్లలో సీఎం సందేశాన్ని చదవకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు నేతృత్వంలో పలువురు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.ఇదే మండలం కైలాసపట్నంలో టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. జన్మభూమి కమిటీ సభ్యుడినంటూ వచ్చిన ఆ పార్టీ కార్యకర్తను సాటి కార్యకర్తలు గెంటివేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.