లోకల్ వాళ్లకు కాసినోల్లో నో ఎంట్రీ!
ఎక్కడైనా మంచి కాసినో గానీ, పబ్ గానీ ఉన్నాయంటే లోకల్ గా ఉన్నవాళ్లు పండగ చేసుకుంటారు. కాస్త సమయం చిక్కినప్పుడు, చేతిలో డబ్బులు ఉన్నపుడల్లా వాటిని దర్శించుకుని హేపీగా ఫీలవుతారు. కానీ గోవాలో మాత్రం అక్కడి ప్రభుత్వం స్థానికులకు తీవ్ర నిరాశ కలిగించే నిర్ణయం తీసుకుంటోంది. రాష్ట్రంలో కేసినో పరిశ్రమను నియంత్రించే చర్యల్లో భాగంగా.. స్థానికులకు అక్కడి కేసినోలలో ఎంట్రీని నిషేధిస్తోంది. కేవలం బయటి నుంచి వచ్చిన పర్యాటకులకు మాత్రమే అక్కడి కేసినోలను ఎంజాయ్ చేయడానికి చాన్సు ఉంటుందట. ఈ మేరకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో నిబంధనలు రూపొందించి, తర్వాత ముఖ్యమంత్రి ఆమోదం తీసుకుంటారు.
20 రోజుల్లోగా దీనికి సంబంధించిన నిబంధనలను నోటిఫై చేస్తామని గోవా హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ గడ్కర్ చెప్పారు. ఇవి నోటిఫై చేసిన తర్వాత రాష్ట్రంలో గేమింగ్ కమిషన్ ఒకదాన్ని ఏర్పాటుచేస్తారు. అప్పటి నుంచి స్థానికులకు ఎట్టి పరిస్థితుల్లోను కేసినోలలో ఎంట్రీ ఉండదు. ఒకవేళ ఎవరైనా వెళ్లాలనుకుంటే ముందుగా గేమింగ్ కమిషనర్ నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాలి. గోవాలో మొత్తం 18 కేసినోలున్నాయి.