యువతి పేరుతో ఫేక్ అకౌంట్
పనాజీ: సోషల్ మీడియా వెబ్సైట్లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసినందుకు గోవా పోలీసులు ఓ యువకుడిపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని కోల్హాపూర్ ప్రాంతానికి చెందిన పాండురంగ్ తేజమ్ అనే యువకుడు గోవాకి చెందిన ఓ యువతి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలని నిర్ణయించుకున్నాడు. యువతి పేరు మీద ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశాడు. అంతటితో ఆగకుండా ఆ అమ్మాయి ఫ్రెండ్స్‌కు, బంధువులకు సందేశాలు పంపించాడు. తన ఫొటోలను కూడా సైట్లో అప్ లోడ్ చేశాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది.
సోషల్ మీడియాలో యువతి పరువుకు భంగం కలిగించాలని యత్నించిన యువకుడిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. యువతి ఐడెంటిటీని దొంగిలించడం, పరువు నష్టం కలిగించడం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఓ అధికారి పేర్కొన్నారు. నిందితుడి కోసం దర్యాప్తు చర్యలు చేపట్టినట్లు వివరించారు.