'పుష్కరాల్లో తొక్కిసలాట'పై న్యాయవిచారణ
రాజమండ్రి: గోదావరి పుష్కరాల మొదటి రోజైన మంగళవారం రాజమండ్రిలోని పుష్కర ఘాట్లో తొక్కిసిలాట సభంవించి 27 మంది దుర్మరణం చెందిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. పుష్కరాల ప్రారంభానికి రెండు రోజుల ముందునుంచీ రాజమండ్రిలోనే మకాం వేసిన ఏపీ సీఎం చంద్రబాబు ఈ మేరకు తమ నిర్ణయాన్ని మంగళవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. తోపులాటకు ప్రధాన కారణం ప్రభుత్వ వైఫల్యమేననే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో కేవలం నష్టనివారణ చర్యల్లో భాగంగానే ప్రభుత్వం న్యాయవిచారణవైపు మొగ్గుచూపినట్లు తెలిసింది.
మరోవైపు భక్తుల మరణాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన నేపథ్యంలో బుధవారం ఢిల్లీకి వెళ్లాల్సిన ఏపీ సీఎం చంద్రబాబు తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ప్రధాని అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబాబు పాల్గొన్నాల్సి ఉంది. పుష్కరాలు పూర్తయ్యేవరకు రాజమండ్రిలోనే ఉంటానని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.