బరిలో రాముడు, కృష్ణుడు, శివుడు, నేతాజీ!
పాట్నా: రాముడు, కృష్ణుడు, శ్యాముడు, శివుడు, శ్రతఘ్నుడు, అర్జునుడు, శకుని, ప్రహ్లాదుడు.. చివరగా సుభాష్ చంద్రబోస్.. ఇలా పురాణ పాత్రలు, ఓ స్వాతంత్ర్య సమరయోధుడి పేర్లను ఒకచోట చేర్చారెందుకు? ఆశ్చర్యపోతున్నారా.. వీరందరి మధ్య ఒక స్వామ్యం ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల పేర్లు ఇవి. హిందువుల ఆరాధ్యదైవం రాముడి పేరు కలిగినవాళ్లు చాలామంది ఈసారి పోటీలో ఉన్నారు. కొన్నిచోట్ల శ్యాం, కృష్ణ పేరు కలిగిన అభ్యర్థులు శివ పేరు గల ప్రత్యర్థులను ఢీకొంటున్నారు.
పురాణ పాత్రలైన అర్జునుడు, శ్రతఘ్నుడు, శకుని, ప్రహ్లాద్ పేర్లు కలిగిన అభ్యర్థులూ చాలామంది బరిలో ఉన్నారు. దాదాపు అన్ని పార్టీల నుంచి రామ్ అనే పేరుగల అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బీహార్లోని 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు అన్నిచోట్ల రామ్ అనే పేరుగల అభ్యర్థి బరిలో ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో రామ్ అనే పేరు గల ఇద్దరు అభ్యర్థులు పరస్పరం పోటీ పడుతుండటం గమనార్హం అని రాజకీయ విశ్లేషకుడు రంజీవ్ చెప్పారు.
బీజేపీ, ఎల్జేపీ, ఆర్ఎల్ఎస్పీ, హెచ్ఏఎంలతో కూడిన ఎన్డీయే కూటమే కాదు.. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్తో కూడిన మహాకూటమి నుంచి కూడా పలువురు రామ్ పేరుగల అభ్యర్థులు ఈ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆఖరికీ వామపక్షాల నుంచి చాలామంది రామ్ అనే పేరుగల అభ్యర్థులు ఉన్నారని, నేములో ఏముంది అంటారు కానీ, బీహార్ ఎన్నికల్లో పేరు కూడా ఒక ప్రభావిత అంశమే అవుతుందని విశ్లేషకులు చెప్తున్నారు.