గోజావాస్లో స్నాప్డీల్ పెట్టుబడులు రూ.130 కోట్లు
న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం స్నాప్డీల్ లాజిస్టిక్స్ సంస్థ గోజావాస్లో రూ.130 కోట్లు(2 కోట్ల డాలర్లు) పెట్టుబడులు పెట్టింది. డెలివరీ, లాజిస్టిక్స్ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకోవడానికి 20 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టాలన్న తమ వ్యూహంలో భాగంగా గోజావాస్లో వాటా కొనుగోలు చేశామని స్నాప్డీల్ వెల్లడించింది. ఈ రూ.130 కోట్ల పెట్టుబడులతో వంద నగరాల్లో ఏడాది కాలంలో తన కార్యకలాపాలను గోజావాస్ విస్తరించనున్నదని స్నాప్డీల్ వ్యవస్థాపకుల్లో ఒకరు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రోహిత్ బన్సాల్ చెప్పారు.
వస్తువుల డెలివరీ మరింత వేగవంతం చేయడానికి గత ఆర్నెళ్లలో రూ.650 కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేశామని తెలిపారు. స్పాప్డీల్ అందించిన తాజా పెట్టుబడులతో భారత దేశ అతి పెద్ద వ్యక్తిగత లాజిస్టిక్స్ సంస్థల్లో ఒకటిగా నిలవడానికి తమకు దోహదపడతాయని గోజావాస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ విజయ్ ఘడ్గే చెప్పారు. కాగా ఈ ఏడాది మార్చిలో గోజావాస్లో స్నాప్డీల్ రూ.200 కోట్లు పెట్టుబడులు పెట్టింది.