మా అండతో గెలిచి మమ్మల్నే విస్మరిస్తారా?
ఆచంట : టీడీపీ మద్దతుతో గెలుపొంది ఎంపీ, మంత్రి పదవులు పొందిన గోకరాజు గంగరాజు, పైడికొండల మాణిక్యాలరావులు స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకు తెలియకుండా నియోజకవర్గంలో పర్యటించడం తగదని పలువురు టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తారు.
ఈ మేరకు సోమవారం స్థానిక రామేశ్వరస్వామి వారి సత్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి మంత్రి, ఎంపీ పర్యటన విషయం నియోజకవర్గంలోని గ్రామ సర్పంచ్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలకు సమాచారం ఇవ్వలేదని నిరసన వ్యక్తం చేశారు.
ఇటువంటి చర్యలు మరోసారి పునరావృతమైతే సహించేదిలేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణపై కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని, ఇటువంటి చర్యలను ప్రజలు సహించరన్నారు. సమావేశంలో ఆచంట, పోడూ రు జెడ్పీటీసీలు బండి రామారావు, బొక్కా నాగేశ్వరరావు, ఆచంట మండల పార్టీ అధ్యక్షుడు మేకా జానకిరామయ్య, డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు కండిబోయిన సత్యనారాయణ పాల్గొన్నారు.