Gokulnath Shetty
-
పీఎన్బీ స్కాం: గోకుల్‌నాథ్ సంచలన విషయాలు
సాక్షి,ముంబై: దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంగా పేరొందిన పీఎన్బీ స్కాంలో కీలక వివరాలను ఈడీ సాధించింది. విచారణలో పీఎన్బీ మాజీ డిప్యూటీ మేనేజర్ గోకుల్‌నాథ్ శెట్టి సంచలన విషయాలను వెల్లడించాడు. బ్యాంకు జనరల్ మేనేజర్ ఆదేశాల మేరకే తానే ఎల్వోయూల (లెటర్ ఆఫ్ క్రెడిట్) జారీచేశానని ఒప్పుకున్నాడు. ఈ విషయంలో వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ, గీతాంజలి జెమ్స్ వ్యవస్థాపకుడు మెహుల్ చోక్సీ తనను బ్లాక్ మెయిల్ చేశారని ఈడీ విచారణలో అంగీకరించాడు. అయితే ఇందుకు తాను ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం పొందలేదని వివరించాడు. 2010లో నీరవ్‌మోదీకి మోడీకి మొట్టమొదటి ఎల్‌వోయూను జారీ చేసినట్టుగా గోకుల్‌నాథ్ శెట్టి ఈడీ ముందు ఒప్పుకున్నాడు. దీంతో మొదటి దుర్వినియోగంపై ఇద్దరు వ్యాపారవేత్తలు బెదిరింపులకు పాల్పడడంతో 2017 వరకు జారీ చేస్తూ వచ్చానని తెలిపాడు. ఇలా మొత్తం 13,700 కోట్ల రూపాయల విలువైన ఎల్వోయూలను జారీ చేశానని తెలిపాడు. అయితే 2010 ఆగస్టు నుంచి 2017వరకు పీఎన్బీ బ్రాడీహౌస్ బ్రాంచ్‌కు జీఎంగా ఉన్న రాజీవ్ జిందాల్ ఆదేశాల మేరకు వీటిని విడుదల చేసినట్టు చెప్పాడు. ఎలాంటి సెక్యూరిటీలు, హామీలు లేకుండానే వీటిని జారీ చేయాలని తనను జీఎం ఆదేశించినట్టు పేర్కొన్నాడు. అంతేకాదు ఈ వ్యవహారాన్ని బహిర్గతం చేస్తే ఉద్యోగం ఊడిపోతుందంటూ చోక్సీ, మోదీ బెదిరించారని ఈడీ అధికారులకు చెప్పాడు. బ్యాంకింగ్ నియమాల ఉల్లంఘనపై పూర్తి బాధ్యతను తనపై వేసుకున్న శెట్టి... తన కింది ఉద్యోగులు ఎవరికీ ఈ మోసం గురించి తెలియదని పేర్కొన్నాడు. దీంతో విచారణలో శెట్టి తెలిపిన వివరాలపై ఈడీ మరితంగా ఆరా తీస్తోంది. కాగా ఇప్పటికే రాజీవ్ జిందాల్‌ను ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పీఎన్బీ స్కాంలో పీఎంఏల్‌ఏ చట్టం కింద మార్చి 3న, అదుపులోకి తీసుకున్న గోకుల్ నాథ్ శెట్టి జ్యుడీషియల్ కస్టడీ ఈ బుధవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈడీ మరింత సమాచారాన్ని రాబట్టేందుకు కస్టడీ గడువును కోరే అవకాశం ఉంది. -
పీఎన్బీ స్కాం : ఆయన అరెస్ట్‌కు గ్రీన్‌సిగ్నల్
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకులో డైమాండ్ కింగ్ నీరవ్ మోదీ పాల్పడిన రూ.13,500 కోట్ల భారీ కుంభకోణంలో ఆ బ్యాంకు మాజీ అధికారిని ఈడీ తన కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు బుధవారం అనుమతి ఇచ్చింది. తమ అప్లికేషన్‌కు కోర్టు అనుమతి ఇచ్చిందని, ఇప్పుడు పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితుడైన, పీఎన్బీ మాజీ డిప్యూటీ జనరల్ మేనేజర్ గోకుల్ నాథ్ శెట్టీని అరెస్ట్ చేయవచ్చని స్పెషల్ ఈడీ ప్రాసిక్యూటర్ హిటెన్ వెనెగాంకర్ నేడు చెప్పారు. అంతకముందే ఇతన్ని సీబీఐ అరెస్ట్ చేసింది. పీఎన్బీలో వెలుగు చూసిన రూ.13,500 కోట్ల కుంభకోణ విచారణలో భాగంగా సీబీఐ శెట్టిని అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. మనీ లాండరింగ్ కింద ఈ కుంభకోణాన్ని ఈడీ కూడా విచారిస్తోంది. అక్రమ లావాదేవీలను నిర్వహించడంలో శెట్టి కీలక పాత్ర పోషించారని ఈడీ స్పెషల్ కోర్టుకు తెలిపింది. మనీ లాండరింగ్‌లో ఈయనే ప్రధాన కుట్రదారుడు, ప్రధాన నిందితుడని పేర్కొంది. ఈ నేపథ్యంలో శెట్టిని అరెస్ట్ చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. పీఎన్బీ బ్యాంకులో రూ.13,500 కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ, ఆయన అంకుల్ మెహుల్ చౌక్సిలు దేశం విడిచిపోయారు. వీరిని భారత్‌కు రప్పించడానికి కూడా దర్యాప్తు సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. -
పీఎన్బీ స్కాం కీలక వ్యక్తులు అరెస్ట్
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకు భారీ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన బ్యాంకు అధికారులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ప్రధాన సూత్రదారుడు, ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీకి సహకరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి పీఎన్బీ డిప్యూటీ మేనేజర్ గోకుల్ నాధ్ శెట్టిని, పీఎన్బీ ఎస్‌డబ్ల్యూఓ మనోజ్ ఖారత్‌ను, నీరవ్ మోదీ గ్రూప్ సంస్థలకు అధికారిక సంతకందారు హేమంత్ భట్‌ను సీబీఐ అరెస్ట్‌చేసింది. ఎటువంటి రుణ పరిమితి లేకుండా లేదా నగదు మార్జిన్ లేకుండానే 'లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్' (ఎల్‌ఒయు) పొందేందుకు గోకుల్ నాథ్ శెట్టి, మనోజ్ ఖారత్, హేమంత్ భట్‌లతో కలిసి నీరవ్‌మోదీ ఈ కుట్రకు పాల్పడ్డారని పీఎన్బీ తన ఫిర్యాదులో పేర్కొన్న సంగతి తెలిసిందే. వీరిని నేడు ముంబైలోని సీబీఐ స్పెషల్ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. కాగ, నీరవ్ మోదీకి గోకుల్ నాథ్ శెట్టి అత్యంత సన్నిహితుడిగా ఉండేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో ముంబైలోని ఆయన నివాసంలో కూడా సీబీఐ సోదాలు నిర్వహించింది. ఈ స్కాంలో గోకుల్ శెట్టిని సహ నిందితుడిగా బ్యాంకు పేర్కొంది. దాదాపు రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ ప్రస్తుతం విదేశాల్లో దాక్కున్నట్టు తెలుస్తోంది. ఈ కుంభకోణం బయటపడుతుందనే సమయంలోనే అంటే జనవరి 1నే నీరవ్ విదేశాలకు చెక్కేశాడు. ఆయన ప్రస్తుతం న్యూయార్క్‌లోని జేడబ్ల్యూ మారియట్స్ ఎస్సెక్స్ హౌజ్‌లో ఉన్నట్టు సమాచారం. నీరవ్ మోదీని పట్టుకోవడం కోసం సీబీఐ, ఈడీ అధికారులు వేట కొనసాగించారు. ఆయన్ను పట్టుకునేందుకు భారత్ ఇంటర్‌పోల్ సహాయం కోరింది. మరోవైపు పీఎన్బీలో స్కాం దెబ్బకు బ్యాంకులు విలవిలలాడుతున్నాయి. వేలకోట్ల రూపాయల్లో బ్యాంకులు భారీగా రుణాలు ఇచ్చాయి. దీంతో ఆ బ్యాంకులు తలలు పట్టుకుంటున్నాయి.