ఈడీ అదుపులో గోకుల్‌నాథ్ శెట్టి
సాక్షి,ముంబై: దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంగా పేరొందిన పీఎన్‌బీ స్కాంలో కీలక వివరాలను ఈడీ సాధించింది. విచారణలో పీఎన్‌బీ మాజీ డిప్యూటీ మేనేజర్ గోకుల్‌నాథ్ శెట్టి సంచలన విషయాలను వెల్లడించాడు. బ్యాంకు జనరల్ మేనేజర్ ఆదేశాల మేరకే తానే ఎల్‌వోయూల (లెటర్ ఆఫ్ క్రెడిట్) జారీచేశానని ఒప్పుకున్నాడు. ఈ విషయంలో వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ, గీతాంజలి జెమ్స్ వ్యవస్థాపకుడు మెహుల్ చోక్సీ తనను బ్లాక్ మెయిల్ చేశారని ఈడీ విచారణలో అంగీకరించాడు. అయితే ఇందుకు తాను ఎలాంటి వ‍్యక్తిగత ప్రయోజనం పొందలేదని వివరించాడు.
2010లో నీరవ్‌మోదీకి మోడీకి మొట్టమొదటి ఎల్‌వోయూను జారీ చేసినట్టుగా గోకుల్‌నాథ్ శెట్టి ఈడీ ముందు ఒప్పుకున్నాడు. దీంతో మొదటి దుర్వినియోగంపై ఇద్దరు వ్యాపారవేత్తలు బెదిరింపులకు పాల్పడడంతో 2017 వరకు జారీ చేస్తూ వచ్చానని తెలిపాడు. ఇలా మొత్తం 13,700 కోట్ల రూపాయల విలువైన ఎల్‌వోయూలను జారీ చేశానని తెలిపాడు. అయితే 2010 ఆగస్టు నుంచి 2017వరకు పీఎన్‌బీ బ్రాడీహౌస్ బ్రాంచ్‌కు జీఎంగా ఉన్న రాజీవ్ జిందాల్ ఆదేశాల మేరకు వీటిని విడుదల చేసినట్టు చెప్పాడు. ఎలాంటి సెక్యూరిటీలు, హామీలు లేకుండానే వీటిని జారీ చేయాలని తనను జీఎం ఆదేశించినట్టు పేర్కొన్నాడు. అంతేకాదు ఈ వ్యవహారాన్ని బహిర్గతం చేస్తే ఉద్యోగం ఊడిపోతుందంటూ చోక్సీ, మోదీ బెదిరించారని ఈడీ అధికారులకు చెప్పాడు. బ్యాంకింగ్ నియమాల ఉల్లంఘనపై పూర్తి బాధ్యతను తనపై వేసుకున్న శెట్టి... తన కింది ఉద్యోగులు ఎవరికీ ఈ మోసం గురించి తెలియదని పేర్కొన్నాడు. దీంతో విచారణలో శెట్టి తెలిపిన వివరాలపై ఈడీ మరితంగా ఆరా తీస్తోంది.
కాగా ఇప్పటికే రాజీవ్ జిందాల్‌ను ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పీఎన్‌బీ స్కాంలో పీఎంఏల్‌ఏ చట్టం కింద మార్చి 3న, అదుపులోకి తీసుకున్న గోకుల్ నాథ్ శెట్టి జ్యుడీషియల్ కస్టడీ ఈ బుధవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈడీ మరింత సమాచారాన్ని రాబట్టేందుకు కస్టడీ గడువును కోరే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment