పంజాబ్ నేషనల్ బ్యాంకు (ఫైల్ ఫోటో)
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకు భారీ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన బ్యాంకు అధికారులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ప్రధాన సూత్రదారుడు, ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీకి సహకరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి పీఎన్‌బీ డిప్యూటీ మేనేజర్ గోకుల్ నాధ్ శెట్టిని, పీఎన్‌బీ ఎస్‌డబ్ల్యూఓ మనోజ్ ఖారత్‌ను, నీరవ్ మోదీ గ్రూప్ సంస్థలకు అధికారిక సంతకందారు హేమంత్ భట్‌ను సీబీఐ అరెస్ట్‌చేసింది. ఎటువంటి రుణ పరిమితి లేకుండా లేదా నగదు మార్జిన్ లేకుండానే 'లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్' (ఎల్‌ఒయు) పొందేందుకు గోకుల్ నాథ్ శెట్టి, మనోజ్ ఖారత్, హేమంత్ భట్‌లతో కలిసి నీరవ్‌మోదీ ఈ కుట్రకు పాల్పడ్డారని పీఎన్‌బీ తన ఫిర్యాదులో పేర్కొన్న సంగతి తెలిసిందే. వీరిని నేడు ముంబైలోని సీబీఐ స్పెషల్ కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
కాగ, నీరవ్ మోదీకి గోకుల్ నాథ్ శెట్టి అత్యంత సన్నిహితుడిగా ఉండేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో ముంబైలోని ఆయన నివాసంలో కూడా సీబీఐ సోదాలు నిర్వహించింది. ఈ స్కాంలో గోకుల్ శెట్టిని సహ నిందితుడిగా బ్యాంకు పేర్కొంది. దాదాపు రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ ప్రస్తుతం విదేశాల్లో దాక్కున్నట్టు తెలుస్తోంది. ఈ కుంభకోణం బయటపడుతుందనే సమయంలోనే అంటే జనవరి 1నే నీరవ్ విదేశాలకు చెక్కేశాడు. ఆయన ప్రస్తుతం న్యూయార్క్‌లోని జేడబ్ల్యూ మారియట్స్ ఎస్సెక్స్ హౌజ్‌లో ఉన్నట్టు సమాచారం. నీరవ్ మోదీని పట్టుకోవడం కోసం సీబీఐ, ఈడీ అధికారులు వేట కొనసాగించారు. ఆయన్ను పట్టుకునేందుకు భారత్ ఇంటర్‌పోల్ సహాయం కోరింది. మరోవైపు పీఎన్‌బీలో స్కాం దెబ్బకు బ్యాంకులు విలవిలలాడుతున్నాయి. వేలకోట్ల రూపాయల్లో బ్యాంకులు భారీగా రుణాలు ఇచ్చాయి. దీంతో ఆ బ్యాంకులు తలలు పట్టుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment