ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకులో డైమాండ్ కింగ్ నీరవ్ మోదీ పాల్పడిన రూ.13,500 కోట్ల భారీ కుంభకోణంలో ఆ బ్యాంకు మాజీ అధికారిని ఈడీ తన కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు బుధవారం అనుమతి ఇచ్చింది. తమ అప్లికేషన్‌కు కోర్టు అనుమతి ఇచ్చిందని, ఇప్పుడు పీఎన్‌బీ స్కాంలో ప్రధాన నిందితుడైన, పీఎన్‌బీ మాజీ డిప్యూటీ జనరల్ మేనేజర్ గోకుల్ నాథ్ శెట్టీని అరెస్ట్ చేయవచ్చని స్పెషల్ ఈడీ ప్రాసిక్యూటర్ హిటెన్ వెనెగాంకర్ నేడు చెప్పారు. అంతకముందే ఇతన్ని సీబీఐ అరెస్ట్ చేసింది.
పీఎన్‌బీలో వెలుగు చూసిన రూ.13,500 కోట్ల కుంభకోణ విచారణలో భాగంగా సీబీఐ శెట్టిని అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. మనీ లాండరింగ్ కింద ఈ కుంభకోణాన్ని ఈడీ కూడా విచారిస్తోంది. అక్రమ లావాదేవీలను నిర్వహించడంలో శెట్టి కీలక పాత్ర పోషించారని ఈడీ స్పెషల్ కోర్టుకు తెలిపింది. మనీ లాండరింగ్‌లో ఈయనే ప్రధాన కుట్రదారుడు, ప్రధాన నిందితుడని పేర్కొంది. ఈ నేపథ్యంలో శెట్టిని అరెస్ట్ చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. పీఎన్‌బీ బ్యాంకులో రూ.13,500 కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ, ఆయన అంకుల్ మెహుల్ చౌక్సిలు దేశం విడిచిపోయారు. వీరిని భారత్‌కు రప్పించడానికి కూడా దర్యాప్తు సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment