యువరాజ్ లొంగుబాటు
సాక్షి, చెన్నై : ఇంజినీరింగ్ విద్యార్థి గోకుల్ రాజ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు యువరాజ్ సీబీసీఐడీ ఎదుట ఆదివారం లొంగి పోయాడు. యువరాజ్ లొంగిపోతున్న సమాచారంతో పెద్ద సంఖ్యలో మా వీరన్ ధీరన్ చిన్నమలై గౌండర్ పేరవై వర్గాలు సీబీసీఐడీ కార్యాలయం వద్దకు తరలివచ్చాయి. వారిని కట్టడి చేసే క్రమంలో ఉద్రిక్తత, ఉత్కంఠ నెలకొంది.
నామక్కల్ జిల్లా తిరుచంగోడులో హత్యకు గురైన ఇంజనీరింగ్ విద్యార్థి గోకుల్ రాజ్ కేసులో మా వీరన్ ధీరన్ చిన్నమలై గౌండర్ పేరవై నేత యువరాజ్‌ను ప్రధాని నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే. ఈకేసులో ఇప్పటికే పలువురు అరెస్టయి, బెయిల్ మీద బయటకు వచ్చి ఉన్నారు. అయితే, యువరాజ్ మాత్రం పోలీసుల చేతికి చిక్కకుండా చుక్కలు చూపించే పనిలో పడ్డారు. ఈ కేసు విచారణ సమయంలో నామక్కల్ డీఎస్పీ విష్ణుప్రియ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ రెండు కేసుల్లోనూ పోలీసు ఉన్నతాధికారులు ఒత్తిళ్లు ఉన్నాయని అజ్ఞాతంలో ఉంటూ యువరాజ్ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ వచ్చాడు. తమకు ఓ సవాల్‌గా మారిన యువరాజ్‌ను అరెస్టు చేయడానికి సీబీసీఐడీ వర్గాలు తీవ్రంగా కుస్తీల పట్టాయి. ఎట్టకేలకు విచారణకు తాను సహకరిస్తానని లొంగి పోయేందుకు సిద్ధంగా ఉన్నట్టు యువరాజ్ ప్రకటించాడు.
లొంగుబాటు : సీబీసీఐడీ ఎదుట లొంగి పోయేందుకు తమ నేత నిర్ణయించడంతో ఆ పేరవై వర్గాలు ఆదివారం ఉదయాన్నే నామక్కల్‌లోని ఆ కార్యాలయం వద్దకు తరలి వచ్చాయి. దీంతో ఆపరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున బలగాల్ని రంగంలోకి దించి భద్రతను పర్యవేక్షించారు. అదే సమయంలో నామక్కల్ పరిసరాల్లో చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. అయితే, పోలీసుల కళ్లు గప్పి యువరాజ్ చాకచక్యంగా వ్యవహరించి సీబీసీఐడీ కార్యాలయం వద్దకు పదకొండు గంటల సమయంలో చేరుకున్నాడు. ఓ మోటారు సైకిల్‌పై తనను ఎవరూ గుర్తు పట్టని విధంగా హెల్మెట్ ధరించి ఆ కార్యాలయం వద్దకు యువరాజ్ దూసుకొచ్చాడు.
మూడు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న తమ నాయకుడు బయటకు రావడంతో ఆ పేరవై వర్గాలు ఆయన్ను చుట్టుముట్టాయి. ఆ కార్యాలయంలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నాయి. చివరకు పోలీసులు ఆ పేరవై వర్గాలను పక్కకు పంపించి యువరాజ్‌ను లోనికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్నతాధికారుల సమక్షంలో లొంగిపోయాడు. దీంతో యువరాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముందుగా మీడియాతో మాట్లాడుతూ, ఇది తప్పుడు కేసు అన్న విషయం అందరికీ తెలుసునని, తాననిర్దోషిగా బయటకు వస్తానన్నారు. అయితే, డీఎస్పీ విష్ణుప్రియ ఆత్మహత్య వెనుక ఉన్న అధికారులు శిక్షించ బడాల్సిన అవసరం ఉందన్నారు. వాళ్లందరిపై చర్యలు తీసుకునే విధంగా తాను కోర్టులో స్పందిస్తానని వ్యాఖ్యానించారు.