రూ.34 కోట్లు.. 5 మెగావాట్లు
గొల్లగూడెం (ఉంగుటూరు): ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామంలో పోలవరం గట్టుపై జెన్కో ఆధ్వర్యంలో చేపట్టిన సోలార్ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రాజెక్ట్ కోసం పోలవరం–తాడిపూడి కాలువల మధ్య ఉన్న నీటిపారుదల శాఖ స్థలం 30 ఎకరాలను లీసుకు తీసుకున్నారు. రూ.34 కోట్ల నిర్మాణ వ్యయంతో చేపట్టిన ప్రాజెక్ట్ సామర్థ్యం 5 మెగావాట్లు. దీనిలో భాగంగా 5 మెగావాట్ల ఉత్పత్తి యూనిట్లను నెలకొల్పుతున్నారు. ఇప్పటికే స్థలాన్ని చదును చేసి సోలార్ ప్యానల్స్ ఏర్పాటుచేశారు. ఇప్పటికీ మూడు మెగావాట్లకు సంబంధించి ప్యానల్ పనులు పూర్తికాగా రెండు మెగావాట్లకు సంబంధించి పనులు వేగిరపర్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని పోలవరం పవర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొలగాని వీవీఎస్ మూర్తి తెలిపారు.
విద్యుత్ సబ్‌స్టేషన్‌కు అనుసంధానం.. సోలార్ ప్రాజెక్ట్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఐదు మెగావాట్ల విద్యుత్‌ను గొల్లగూడెం 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు అనుసంధానం చేస్తారు. బోర్ల కింద వ్యవసాయం చేసే రైతులకు, గృహ వినియోగదారులకు, పరిశ్రమలకు సోలార్ విద్యుత్‌ను సరఫరా చేయనున్నారు. దీని ద్వారా విద్యుత్ కొరత తీరడంతో పాటు లో ఓల్టేజీ సమస్య ఉండదని అధికారులు అంటున్నారు.
సీఎంతో ప్రారంభానికి సన్నాహాలుప్రారంభించటానికి సన్నాహాలు
సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ముఖ్యమంతి చంద్రబాబునాయుడు చేతులమీదుగా ప్రారంభిం చడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ను మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత రాష్ట్ర్ర గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. పోలవరం– తాడిపూడి కాలువల మధ్య నిర్మించడంతో ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా మారుతుందని అధికారులు అంటున్నారు. కేంద్రం ఆవరణంలో మొక్కలు నాటి ఆదర్శవంతమైన నిర్మాణంగా తీర్చిదిద్దుతామని చెబుతున్నారు.
దేశంలో తొలి ప్రాజెక్ట్‌గా.. దేశంలో కాలువ గట్టుపై నిర్మిస్తున్న తొలి సోలార్ ప్రాజెక్ట్‌గా ఇది నిలువనుంది. ప్రాజెక్ట్‌కు కేంద్రం రూ.7.5 కోట్ల సబ్సిడీ ఇచ్చింది. కాలువ గట్టుపై నిర్మించడం వల్ల ఈ సబ్సిడీ వచ్చింది. పనులు చురుగ్గా సాగుతున్నాయి. నెలాఖరుకు పూర్తిచేయాలని ప్రణాళిక అమలుచేస్తున్నాం. ప్రాజెక్ట్ ద్వారా నాణ్యమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు.
–కొలగాని వీవీఎస్ మూర్తి, పోలవరం పవర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్