golconda police
-
ఏసోబు చేయిపడితే...
సాక్షి, సిటీబ్యూరో: ఏపీలోని ప్రకాశం జిల్లాలో పుట్టాడు... బతుకుదెరువు కోసం నగరానికి వలసవచ్చాడు... కొన్నాళ్ల పాటు మేస్త్రీగా పనిచేశాడు... దుర్వ్యసనాల కారణంగా దొంగగా మారాడు... ఎలాంటి తాళమైనా పగులకొట్టి చోరీలకు పాల్పడే ఘరానా చోరుడు ఏసోబు నేపథ్యమిది. రెండున్నరేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న అతడిని గోల్కొండ పోలీసులు అరెస్టు చేశారు. ఆసిఫ్‌నగర్ ఏసీపీ మహ్మద్ గౌస్ మొహియుద్దీన్‌తో కలిసి బుధవారం తన కార్యాలయంలో వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. వ్యసనాలకు బానిసై.. ప్రకాశం జిల్లా కల్లూరివారిపాలెం ప్రాంతానికి చెందిన ఎం.ఏసు అలియాస్ ఏసోబు వృత్తిరీత్యా తాపీమేస్త్రి. బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌కు వలసవచ్చాడు. అయితే మద్యం, పేకాట, వ్యభిచారం వంటి వ్యసనాలతో పాటు స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకోవడానికి బానిసగా మారడంతో మేస్త్రీ పనితో వచ్చే ఆదాయం చాలలేదు. దీంతో తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు చోరీల బాటపట్టాడు. 1996లో బంజారాహిల్స్ పరిధిలో తొలినేరం చేసి పోలీసులకు చిక్కాడు. ఆ తర్వాత ఏడాది రెండు కేసులకు సంబంధించి గోల్కొండ పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన ఏసోబు కొన్నేళ్ల పాటు కామారెడ్డితో పాటు ఇతర ప్రాంతాల్లో మేస్త్రీ పని చేసుకుని బతికాడు. ఆ ఆదాయంతో సంతృప్తి చెందని అతను 2015లో మళ్లీ సిటీకి మాకాం మార్చి భోజగుట్టలో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. రెండున్నరేళ్లలో 21 నేరాలు... పాత పంథా ప్రారంభించిన ఏసోబు తాళం వేసున్న ఇళ్లను టార్గెట్‌గా చేసుకునేవాడు. గోడ దూకడం, తాళం పగుల కొట్టడం, కిటికీ గ్రిల్స్ తొలగించడం ద్వారా ఇంట్లోకి ప్రవేశించే వాడు. ఎలాంటి బీరువా/అల్మారా అయినా తాళం తేలిగ్గా పగులకొట్టే వాడు. దీనికోసం ఇతగాడు కొన్ని ఉపకరణాలను సైతం తయారు చేసుకున్నాడు. అందులో ఉన్నదంతా ఊడ్చుకెళ్లేవాడు. గోల్కొండ, నార్సింగి, రాయదుర్గం ఠాణాల పరిధిలోని షేక్‌పేట, వైఎస్సార్ కాలనీ, మణికొండల్లో 21 నేరాలు చేశాడు. రూ.20 లక్షల విలువైన బంగారం, వెండి తస్కరించాడు. నార్సింగిలో దొరికిన వేలిముద్రలు... షేక్‌పేటలోని సయ్యద్ హసన్ షరీఫ్ ఇంట్లో ఆగస్టు 24న చోరీ జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలిలో అనుమానితుడి వేలిముద్రలను సేకరించారు. వీటిని చుట్టుపక్కల ఉన్న పోలీసుస్టేషన్ల రికార్డుల్లో ఉన్న వాటితో పోల్చి చూశారు. ఈ నేపథ్యంలోనే 2015లో నార్సింగ్ పరిధిలోని ఓ సీన్ ఆఫ్ అఫెన్స్‌లో లభించిన వాటితో సరిపోలాయి. దీని ఆధారంగా ఏసోబు నిందితుడిగా గుర్తించారు. రెండున్నరేళ్లుగా పరారీలో ఉన్న ఇతడిని పట్టుకోవడానికి గోల్కొండ ఇన్స్పెక్టర్ సయ్యద్ ఫయాజ్, ఎస్సై పి.వాసుదేవ్‌ల నేతృత్వంలో బృందం ఏర్పాటైంది. ముమ్మరంగా గాలించిన పోలీసులు బుధవారం గుడిమల్కాపూర్‌లో అతడిని అరెస్టు చేశారు. ఇతడిచ్చిన సమాచారంతో 60.5 తులాల బంగారం, 2.83 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. ఏసోబు నేరచరిత్రను పరిగణనలోకి తీసుకుని అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగానికి సిఫార్సు చేయనున్నట్లు డీసీపీ తెలిపారు. -
లాయర్ ఖర్చుల కోసం చోరీ
సాక్షి, హైదరాబాద్: లాయర్ ఖర్చుల కోసం దొంగగా మారాడు.. ఓ సోమాలియా జాతీయు డు. రూ.33 లక్షలు చోరీ చేసిన రోజున్నరలోనే రూ.5.28 లక్షలు ఖర్చు చేసేశాడు. ఈ ఘరానా చోరుడిని గోల్కొండ పోలీసులు సోమవారం అరెస్టు చేసినట్లు వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు దొంగతనం కేసులో నల్లజాతీయుడు అరెస్టు కావడం రాజధానిలో ఇదే తొలిసారి. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ పూర్తి వివరాలు వెల్లడించారు. జల్సాలకు అలవాటుపడి... సోమాలియాకు చెందిన మహ్మద్ వలీ అలీ 2014లో స్టూడెంట్ వీసాపై హైదరాబాద్ వచ్చాడు. రాజేంద్రనగర్ పరిధిలోని సన్ సిటీలో నివసిస్తూ నిజాం కాలేజీలో బీబీఏ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. జల్సాలకు అలవాటుపడిన ఇతడికి సోమాలియా నుంచి తల్లి పంపే డబ్బు సరిపోయేది కాదు. దీంతో ఈ ఏడాది జూన్ నుంచి గంజాయి దందా ప్రారంభించాడు. గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి నిజాం కాలేజీతో పాటు ఇతర కళాశాలల్లో విక్రయించేవాడు. ఈ ఆరోపణలపై నారాయణగూడ ఎక్సైజ్ పోలీసులు అదే నెల 23న అరెస్టు చేసి 10 కేజీల గంజాయి, పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు. ‘ఖర్చుల’ కోసం చోరీల బాట... ఆగస్టులో బెయిల్‌పై వచ్చిన అలీ.. లాయర్‌కు అవసరమైన ఖర్చుల కోసం చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. శనివారం పట్టపగలు టోలిచౌకిలోని నదీమ్‌కాలనీలో రియల్టర్ మహ్మద్ షకీల్ ఇంటికి తాళం వేసి ఉండటం గమనించాడు. ఒక చేయి సరిగా పనిచేయకున్నా స్క్రూడ్రైవర్‌తో ఇంటి తాళం, బీరువా పగుల కొట్టిన అలీ.. రియల్ ఎస్టేట్ లావాదేవీల కోసం షకీల్ ఉంచిన రూ.33 లక్షల నగదు తస్కరించాడు. తేలిగ్గా రూ.5 లక్షలు ఖర్చు.. శనివారం మధ్యాహ్నం ఈ చోరీ చేసిన అలీ.. సోమవారం ఉదయం నాటికి రూ.5,28,220 ఖర్చు చేసేశాడు. రూ.1.1 లక్షలు వెచ్చించి రాయల్ ఎన్ఫీల్డ్, రూ.40 వేలతో ల్యాప్‌టాప్, రూ.24 వేలతో రెండు ట్యాబ్స్, ఐఫోన్ 8 తదితరాలు ఖరీదు చేశాడు. రిచ్‌గా కనిపించడం కోసం పది జతల వస్త్రాలు ఖరీదు చేసి కుట్టడానికి టైలర్‌కు ఇచ్చాడు. శనివారం, ఆదివారం స్నేహితులతో కలసి పార్టీలు చేసుకున్నాడు. రూ.1.5 లక్షలు తన స్నేహితుడైన రిచర్డ్‌కు ఇచ్చాడు. శనివారం కేసు నమోదు చేసుకున్న గోల్కొండ పోలీసులు 25 సీసీ కెమెరాలను అధ్యయనం చేయడం ద్వారా అలీని నిందితుడిగా గుర్తించారు. సోమవారం పట్టుకుని రూ.27,71,780 నగదుతో పాటు అతడు ఖరీదు చేసిన వాహనం, వస్తువులు స్వా ధీనం చేసుకున్నారు. కేసును కేవలం 36 గంటల్లో ఛేదించిన ఆసిఫ్‌నగర్ ఏసీపీ మహ్మద్ గౌస్ మొహియుద్దీన్, గోల్కొండ ఇన్స్పెక్టర్ సయ్యద్ ఫయాజ్ తదితరుల్ని డీసీపీ అభినందించారు. -
ప్రేమికులచేత గుంజీళ్లు తీయించిన పోలీసులు
హైదరాబాద్: గోల్కొండ పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ప్రేమికుల చేత గుంజీళ్లు తీయించారు. గోల్కొండ కోట చూసేందుకు వచ్చిన యువజంటలపై పోలీస్ జులుంను పలువురు విమర్శిస్తున్నారు. ప్రేమికుల చేత బహిరంగంగా పోలీసులు గుంజీళ్లు తీయించడం వివాదాలకు దారి తీసింది. మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. ఇనస్పెక్టర్ సయ్యద్ నజీముద్దీన్ ఒంటరిగా ఉన్న యువతీ, యువకులను అదుపులోకి తీసుకుని గుంజీళ్లు తీయించారు. అమ్మాయిలని కూడా చూడకుండా విపరీతంగా ప్రవర్తించారు. వారి చెంపలు కూడా వాయించినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రుల కళ్లు గప్పి పెడదారి పడుతున్న వారికి బుద్ధిచెప్పేందుకే ఇలా చేశామని ఇన్స్పెక్టర్ సయ్యద్ తన చర్యను సమర్ధించుకుంటున్నారు. అయితే పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అందరి మధ్యలో వారిని ఇలా అవమానించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.