ఏసోబు చేయిపడితే... | thief arrested golconda police | Sakshi
Sakshi News home page

ఏసోబు చేయిపడితే... ఎలాంటి తాళమైనా పగలాల్సిందే..

Published Thu, Oct 19 2017 7:15 AM | Last Updated on Thu, Oct 19 2017 7:15 AM

thief arrested golconda police

వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ వెంకటేశ్వర్‌రావు

సాక్షి, సిటీబ్యూరో: ఏపీలోని ప్రకాశం జిల్లాలో పుట్టాడు... బతుకుదెరువు కోసం నగరానికి వలసవచ్చాడు... కొన్నాళ్ల పాటు మేస్త్రీగా పనిచేశాడు... దుర్వ్యసనాల కారణంగా దొంగగా మారాడు... ఎలాంటి తాళమైనా పగులకొట్టి చోరీలకు పాల్పడే ఘరానా చోరుడు ఏసోబు నేపథ్యమిది. రెండున్నరేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న అతడిని గోల్కొండ పోలీసులు అరెస్టు చేశారు. ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ మహ్మద్‌ గౌస్‌ మొహియుద్దీన్‌తో కలిసి బుధవారం తన కార్యాలయంలో వెస్ట్‌జోన్‌ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు.  

వ్యసనాలకు బానిసై..
ప్రకాశం జిల్లా కల్లూరివారిపాలెం ప్రాంతానికి చెందిన ఎం.ఏసు అలియాస్‌ ఏసోబు వృత్తిరీత్యా తాపీమేస్త్రి. బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌కు వలసవచ్చాడు. అయితే మద్యం, పేకాట, వ్యభిచారం వంటి వ్యసనాలతో పాటు స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకోవడానికి బానిసగా మారడంతో మేస్త్రీ పనితో వచ్చే ఆదాయం చాలలేదు. దీంతో తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు చోరీల బాటపట్టాడు. 1996లో బంజారాహిల్స్‌ పరిధిలో తొలినేరం చేసి పోలీసులకు చిక్కాడు. ఆ తర్వాత ఏడాది రెండు కేసులకు సంబంధించి గోల్కొండ పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన ఏసోబు కొన్నేళ్ల పాటు కామారెడ్డితో పాటు ఇతర ప్రాంతాల్లో మేస్త్రీ పని చేసుకుని బతికాడు. ఆ ఆదాయంతో సంతృప్తి చెందని అతను 2015లో మళ్లీ సిటీకి మాకాం మార్చి భోజగుట్టలో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు.
 
రెండున్నరేళ్లలో 21 నేరాలు...
పాత పంథా ప్రారంభించిన ఏసోబు తాళం వేసున్న ఇళ్లను టార్గెట్‌గా చేసుకునేవాడు. గోడ దూకడం, తాళం పగుల కొట్టడం, కిటికీ గ్రిల్స్‌ తొలగించడం ద్వారా ఇంట్లోకి ప్రవేశించే వాడు. ఎలాంటి బీరువా/అల్మారా అయినా తాళం తేలిగ్గా పగులకొట్టే వాడు. దీనికోసం ఇతగాడు కొన్ని ఉపకరణాలను సైతం తయారు చేసుకున్నాడు. అందులో ఉన్నదంతా ఊడ్చుకెళ్లేవాడు. గోల్కొండ, నార్సింగి, రాయదుర్గం ఠాణాల పరిధిలోని షేక్‌పేట, వైఎస్సార్‌ కాలనీ, మణికొండల్లో 21 నేరాలు చేశాడు. రూ.20 లక్షల విలువైన బంగారం, వెండి తస్కరించాడు.

నార్సింగిలో దొరికిన వేలిముద్రలు...
షేక్‌పేటలోని సయ్యద్‌ హసన్‌ షరీఫ్‌ ఇంట్లో ఆగస్టు 24న చోరీ జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలిలో అనుమానితుడి వేలిముద్రలను సేకరించారు. వీటిని చుట్టుపక్కల ఉన్న పోలీసుస్టేషన్ల రికార్డుల్లో ఉన్న వాటితో పోల్చి చూశారు. ఈ నేపథ్యంలోనే 2015లో నార్సింగ్‌ పరిధిలోని ఓ సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌లో లభించిన వాటితో సరిపోలాయి. దీని ఆధారంగా ఏసోబు నిందితుడిగా గుర్తించారు. రెండున్నరేళ్లుగా పరారీలో ఉన్న ఇతడిని పట్టుకోవడానికి  గోల్కొండ ఇన్‌స్పెక్టర్‌ సయ్యద్‌ ఫయాజ్, ఎస్సై పి.వాసుదేవ్‌ల నేతృత్వంలో బృందం ఏర్పాటైంది. ముమ్మరంగా గాలించిన పోలీసులు బుధవారం గుడిమల్కాపూర్‌లో అతడిని అరెస్టు చేశారు. ఇతడిచ్చిన సమాచారంతో 60.5 తులాల బంగారం, 2.83 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. ఏసోబు నేరచరిత్రను పరిగణనలోకి తీసుకుని అతడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగానికి సిఫార్సు చేయనున్నట్లు డీసీపీ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement