సింగరాయకొండ : ఏపీ–తమిళనాడు సరిహద్దులోని ఆ ఊరు నేర సామ్రాజ్యానికి అడ్డా.. అది పోలీసులు కూడా ఛేదించలేకపోయిన ఘరానా దొంగల గడ్డ.. అలాంటి చోటుకు మన ఏపీ పోలీసులు ఎంతో ధైర్యసాహసాలతో ప్రాణాలకు తెగించి వెళ్లారు. వెళ్లడమే కాదు.. పద్మవ్యూహంలాంటి ఆ చోర సామ్రాజ్యం నుంచి కరడుగట్టిన ముగ్గురు దొంగల్ని పట్టుకున్నారు. ఇది పసిగట్టిన అక్కడి దొంగల ముఠా సభ్యులు పోలీసులను వెంబడించారు. ఈ ఛేజింగ్లో మన పోలీసుల చాకచక్యంతో పైచేయి సాధించి ముగ్గురు నేరస్తుల్ని పట్టుకొచ్చేశారు. క్రైమ్ థ్రిల్లర్ని తలపించిన ఈ ఘటన వివరాలు ఏమిటంటే..
ప్రకాశం జిల్లా ఒంగోలు, సింగరాయకొండలో వరుస చోరీలకు పాల్పడిన ముగ్గురు ఘరానా దొంగలను తమిళనాడులోని మింజూరులో ప్రకాశం జిల్లా పోలీసులు వలపన్ని సినీ ఫక్కీలో అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ నెల 11న ప్రకాశం జిల్లా ఒంగోలు టీచర్స్ కాలనీకి చెందిన పోతిరెడ్డి కృష్ణారెడ్డి ఇంట్లో 60 సవర్ల బంగారం, రూ.6 లక్షల నగదు చోరీకి గురైంది.
ఈ నెల 12వ తేదీన సింగరాయకొండ పరిధిలోని మూలగుంటపాడులో ముమ్మడిశెట్టి చంద్రశేఖర్ ఇంట్లోకి చొరబడి భారీ చోరీకి పాల్పడ్డారు. ఎస్పీ మల్లికాగర్గ్ ఆదేశాల మేరకు డీఎస్పీ నారాయణస్వామి పర్యవేక్షణలో సింగరాయకొండ సీఐ రంగనాథ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. సీసీ టీవీ ఫుటేజీలు ఆధారంగా ఒంగోలు టీచర్స్ కాలనీ, సింగరాయకొండలో చోరీలకు పాల్పడిన ముఠా ఒకటేనని నిర్థారణకు వచ్చారు. ఇదే ముఠా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోనూ గతంలో దోపిడీలకు పాల్పడినట్టు గుర్తించారు.
నేర సామ్రాజ్యంలోకి వెళ్లి మరీ అరెస్ట్?
ఈ ముఠా తమిళనాడులోని మింజూరు ప్రాంతానికి చెందినదని గుర్తించిన పోలీసు బృందాలు నిందితుల్ని అదుపులోకి తీసుకునేందుకు పథకం పన్నారు. మింజూరు ప్రాంతం నేర సామ్రాజ్యానికి అడ్డా కావడం.. గతంలో పోలీసులు వీరిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన క్రమంలో దొంగల ముఠాకు చెందిన వ్యక్తులు పోలీసులపై విరుచుకుపడటం వంటి పరిస్థితులు తలెత్తాయి. గతంలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల పోలీసులు ఈ ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నించి తమవల్ల కాక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకున్న సింగరాయకొండ సీఐ ఆధ్వర్యంలోని పోలీస్ టీమ్ దొంగలను అదుపులోకి తీసుకునేందుకు రెండు కార్లలో పక్కా ప్రణాళికతో వెళ్లారు. మింజూరు స్టేషన్ మహిళా ఎస్సై సహకారంతో దొంగల కోసం రోజంతా అక్కడ మాటు వేశారు. చివరకు శనివారం తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఆదమరచి నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు దొంగలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులపైనే దాడికి యత్నం
చోరీ సొత్తును రికవరీ చేసే క్రమంలో ఆంధ్రా నుంచి పోలీసులు వచ్చారని తెలుసుకున్న దొంగల ముఠాకు చెందిన కొందరు వ్యక్తులు పోలీసులపై మూకుమ్మడి దాడికి యత్నించినట్టు సమాచారం. అప్పటికే కొంత సొత్తును రికవరీ చేసిన పోలీసులు వెంటనే అప్రమత్తమై నిందితులు ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని వెంటనే తాము వచ్చిన వాహనాల్లోనే తిరిగి బయలుదేరారు. ఈ క్రమంలో దొంగల ముఠాకు చెందిన వ్యక్తులు మరో రెండు కార్లులో పోలీసుల్ని వెంబడించినట్టు తెలిసింది. ఆ తరువాత పోలీసుల వాహనాలు హైవేపైకి రావడంతో ముఠా తరఫు వ్యక్తులు వెనుదిరిగినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment