కుక్కకు బంగారపు యాపిల్ వాచీలు
బీజింగ్: వెర్రి వెయ్యి విధాలు అంటే ఇదే కాబోలు. తన పెంపుడు కుక్కకు లక్షలాది రూపాయల విలువ చేసే బంగారం వాచీలు అలంకరించి మురిసిపోయాడో సిరిపుత్రుడు. అక్కడితో ఆగకుండా సువర్ణపు వాచీలతో అలంకరించిన తన శునకం ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
చైనా సంపన్న వ్యాపారవేత్త వాంగ్ జియన్ లిన్ కుమారుడు వాంగ్ సికాంగ్ తన కుక్క కోసం సుమారు రూ. 25 లక్షల విలువచేసే రెండు బంగారపు యాపిల్ వాచీలు కొన్నాడు. వాటిని తన బుజ్జి కుక్క ముందు కాళ్లకు అలంకరించాడు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
'నాకున్న నాలుగు కాళ్లకు నాలుగు వాచీలు పెట్టాలనుకున్నా. ప్రస్తుతానికి రెండు వాచీలతో సరిపెట్టుకున్నా. ఇవీ రెండూ నా స్టేటస్ కు తగ్గట్టే ఉన్నాయి' అని కుక్క తరపున చైనా ట్విటర్ వీబొలో కామెంట్స్ కూడా పోస్ట్ చేశాడు వాంగ్ సికాంగ్. అతడి పిచ్చిపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు.