నేటి నుంచి జూలై గోల్డ్ బాండ్ల ట్రేడింగ్
ముంబై: జూలై నెలలో జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లకు సంబంధించి ట్రేడింగ్ మంగళవారం నుంచీ స్టాక్ ఎక్సే్ఛంజీల్లో ప్రారంభమవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేర్కొం ది. ఆర్బీఐ సోమవారం నాడు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. జూలై 6వ తేదీన ప్రభుత్వం 2017–18 సిరిస్ 2 సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రకటించింది. జూలై 10 నుంచి 14 వరకూ అమల్లో ఉన్న స్కీమ్‌కు సంబంధించి బాండ్లు జూలై 28న జారీ అయ్యాయి. 2015 నవంబర్ 5న తొలిసారిగా కేంద్రం గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ఆవిష్కరించింది.
ఫిజికల్ గోల్డ్‌కు డిమాండ్‌ను తగ్గించడం, ఈ మొత్తాలను పొదుపులుగా మళ్లించి ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా చేయడం ఈ విధాన లక్ష్యం. జూలై సిరిస్‌కు ముందు, ప్రభుత్వం ఎనిమిది దఫాలుగా ఈ స్కీమ్‌ను ఆవిష్కరించింది. తద్వారా రూ.5,400 కోట్లు సమీకరించగలిగింది. బంగారం బాండ్లలోకి భారీగా పెట్టుబడులను ఆకర్షించేలా కేంద్రం ఇటీవలే ఒక కీలక నిర్ణయమూ తీసుకుంది. సావరిన్ గోల్డ్ బాండ్లలో (ఎస్జీబీ) వార్షిక పెట్టుబడుల పరిమితిని భారీగా పెంచింది. ప్రస్తుతం 500 గ్రాముల మేరకు మాత్రమే పెట్టుబడి పెట్టే వీలుండగా... దీన్ని ఏకంగా 4 కిలోలకు పెంచింది. ఈ పథకం ద్వారా 2015–16, 2016–17లో రూ. 25,000 కోట్లు సమీకరించాలన్నది లక్ష్యమైనా, రూ.4,769 కోట్లే ప్రభుత్వ ఖాతాలోకి వచ్చాయి.