Gold Exchange treded funds
-
కళ తప్పిన గోల్డ్ ఈటీఎఫ్‌లు
న్యూఢిల్లీ: గోల్డ్ ఎక్సేంజెడ్ ట్రేడెడ్ ఫండ్స్ గతేడాది పెద్దగా పెట్టుబడులను ఆకర్షించలేకపోయాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 2022లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు 90 శాతం తగ్గిపోయి, రూ.459 కోట్లకు పరిమితమయ్యాయి. 2021లో గోల్డ్ ఈటీఎఫ్ పథకాలు రూ.4,814 కోట్లను ఆకర్షించగా, 2020లో రూ.6,657 కోట్ల పెట్టుబడులు వీటిల్లోకి రావడం గమనార్హం. అయితే గతేడాది గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం/పెట్టుబడులు), ఫోలియోలు పెరగడాన్ని గమనించొచ్చు. ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి కేటాయించే గుర్తింపునే ఫోలియోగా చెబుతారు. 2021 చివరి నాటికి గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.18,405 కోట్లుగా ఉంటే, 2022 డిసెంబర్ చివరికి 16 శాతం వృద్ధితో రూ.21,455 కోట్లకు చేరాయి. గోల్డ్ ఈటీఎఫ్ ఫోలియోల సంఖ్య గతేడాది 14.29 లక్షలు పెరగడంతో మొత్తం ఫోలియోల సంఖ్య 46.28 లక్షలకు చేరింది. గోల్డ్ ఈటీఎఫ్‌ల పట్ల ఇన్వెస్టర్లలో విశ్వాసానికి ఇది నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు. ‘‘బంగారం ధరలు పెరగడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు వెనక్కి తగ్గి ఉండొచ్చు. వడ్డీ రేట్లు పెరుగుదల, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లతో ఈ ఏడాది ఎక్కువ భాగం ఆర్థిక వ్యవస్థ సవాళ్లను చూడొచ్చు’’అని మార్నింగ్ స్టార్ ఇండియా సీనియర్ రీసెర్చ్ మేనేజర్ కవితా కృష్ణన్ పేర్కొన్నారు. ఇక గతేడాది గోల్డ్ ఈటీఎఫ్‌ల కంటే ఇన్వెస్టర్లు ఈక్విటీలవైపు మొగ్గు చూపించారు. ఈక్విటీ పథకాలు గతేడాది రూ.1.6 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం దీన్నే తెలియజేస్తోంది. అయినప్పటికీ బంగారం ఈటీఎఫ్‌లు నికరంగా పెట్టుబడులను ఆకర్షించడం సానుకూలం. ఇక ముందు ఏంటి పరిస్థితి? మార్కెట్లలో అస్థిరతలు కొనసాగితే ఇక ముందూ గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గేమ్ ఆధారిత సేవింగ్స్ యాప్ ‘ఫెల్లో’ సీఈవో మనీష్మర్యాద మాత్రం సార్వభౌమ బంగారం బాండ్ల (ఎస్‌జీబీలు) మాదిరే గోల్డ్ ఈటీఎఫ్‌లకు సైతం పన్ను ప్రయోజనం అవసరమన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘మార్కెట్లో ఎస్‌జీబీల గురించే చర్చ నడుస్తోంది. గోల్డ్ ఈటీఎఫ్‌ల కంటే ఎస్‌జీబీల గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎస్జీబీలకు పన్ను ప్రయోజనం ఉండడమే. ఎస్‌జీబీల మాదిరే గోల్డ్ ఈటీఎఫ్‌లు వృద్ధి చెందాలంటే, దీర్ఘకాల మూలధన లాభాల పన్నును సగానికి తగ్గించాలి. ఇది మంచి సానుకూల చర్య అవుతుంది. బంగారంలో దీర్ఘకాలం కోసమే ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడుతుంటారు. కనుక గోల్డ్ ఈటీఎఫ్‌లను ఈఎల్ఎస్ఎస్ మాదిరి పన్ను ఆదా సాధనం కింద వర్గీకరించడం వల్ల ఎక్కువ మంది ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు. ఇదొక ప్రధాన పెట్టుబడి సాధనంగా మారుతుంది’’అని మర్యాద చెప్పారు. -
గోల్డ్ ఈటీఎఫ్‌లలో అమ్మకాలు
న్యూఢిల్లీ: పసిడి ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్‌లు) నుంచి గత నెలలో నికరంగా రూ. 195 కోట్ల పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. అయితే అంతకుముందు రెండు నెలల్లో నికరంగా కొనుగోళ్లే పైచేయి సాధించాయి. వెరసి అక్టోబర్‌లో రూ. 147 కోట్లు, సెప్టెంబర్‌లో రూ. 330 కోట్ల చొప్పున నికరంగా పెట్టుబడులు లభించాయి. ఇక ఆగస్ట్‌లో మాత్రం నికరంగా రూ. 38 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ యాంఫీ గణాంకాలివి. గత నెలలో మార్కెట్ల ర్యాలీ నడుమ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యమిచ్చినట్లు ఎల్‌ఎక్స్‌ఎంఈ వ్యవస్థాపకులు ప్రీతి రథి గుప్తా పేర్కొన్నారు. అంతేకాకుండా పెళ్లిళ్ల సీజన్ కారణంగా కుటుంబాల నుంచి పసిడికి డిమాండ్ పెరగడం ప్రభావం చూపినట్లు తెలియజేశారు. అయితే పండుగల సీజన్ కారణంగా అక్టోబర్‌లో ఫిజికల్ గోల్డ్ కొనుగోలుకి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారని, దీంతో పెట్టుబడులు సైతం లభించాయని వివరించారు. కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకూ గోల్డ్ ఈటీఎఫ్‌లలో నికరంగా రూ. 1,121 కోట్ల పెట్టుబడులు లభించినట్లు గణాంకాలు వెల్లడించాయి. నవంబర్ చివరికల్లా నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) రూ. 20,833 కోట్లను తాకాయి. ఫోలియోల సంఖ్య 11,800 పెరిగి 46.8 లక్షలకు చేరింది. గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్లు డీమ్యాట్ రూపంలో పసిడిలో పెట్టుబడులకు వీలు కల్పించే సంగతి తెలిసిందే. -
పసిడి స్పీడెందుకు? ఇప్పుడు కొనొచ్చా?
కొద్ది నెలలుగా బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ప్రధానంగా పలు దేశాల కేంద్ర బ్యాంకులు, ఇన్వెస్ట్మెంట్ సంస్థలు పసిడి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నాయి. దీంతో గత వారం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 1800 డాలర్లను అధిగమించింది. 2011 తదుపరి ఇది గరిష్టంకాగా.. ఇందుకు పలు అంశాలు కారణమవుతున్నట్లు బులియన్ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. ఇటీవల దేశీయంగానూ బంగారం ధరలు మెరుస్తున్నాయి. శుక్రవారానికల్లా 10 గ్రాముల ధర రూ. 49,240 వద్ద స్థిరపడింది. వెరసి ఈ ఏడాది(2020)లో ఇప్పటివరకూ పసిడి ధరలు 25 శాతం లాభపడ్డాయి. ఎందుకంటే? గతేడాది(2019)లో అమెరికా, చైనా మధ్య నడిచిన వాణిజ్య వివాదాలు ప్రపంచ ఆర్థిక మందగమన పరిస్థితులకు దారితీశాయి. ఆపై చైనాలో పుట్టి యూరోపియన్ దేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్ కారణంగా అల్లకల్లోల పరిస్థితులు తలెత్తాయి. దీంతో పలు దేశాలు లాక్‌డవున్‌ల విధింపువైపు మొగ్గు చూపాయి. ఫలితంగా ఆరోగ్య, ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నాయి. సాధారణంగా సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు పెట్టుబడులు బంగారంవైపు మళ్లుతుంటాయి. దీనికితోడు ఇంతక్రితం స్టాక్ మార్కెట్లు, రియల్టీ ధరల పతనంతో చౌకగా లభిస్తున్న నిధులు బంగారంలోకి ప్రవేశించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే కొద్ది రోజులుగా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల తగ్గింపుతోపాటు.. భారీ లిక్విడిటీని కల్పిస్తుండటంతో ఇటీవల పసిడితోపాటు తిరిగి స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నట్లు తెలియజేశారు. దేశీయంగా చూస్తే.. కోవిడ్-19 కేసులు పెరుగుతుండటం, చైనాతో సరిహద్దు వద్ద వివాదాలు వంటి అంశాలు ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. 6 నెలల్లోనే.. కొద్ది రోజులుగా గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్‌లు)లోకి నిధులు భారీగా ప్రవహిస్తున్నాయి. దీంతో జూన్ చివరికల్లా ఈటీఎఫ్‌ల హోల్డింగ్స్ 3621 టన్నులకు చేరాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వివరాల ప్రకారం ఇవి ఈటీఎఫ్‌ల చరిత్రలోనే అత్యధికంకాగా.. ఈ ఏడాది తొలి అర్ధభాగం(జనవరి-జూన్)లో ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ ఈటీఎఫ్‌లు నికరంగా 734 టన్నులను జమ చేసుకున్నాయి. వీటి విలువ 39.5 బిలియన్ డాలర్లు! ఇవి 2009లో జమ అయిన మొత్తం 646 టన్నులతో పోల్చినా అధికంకావడం విశేషం! దేశీయంగా దేశీయంగానూ పసిడికి డిమాండ్ పెరిగింది. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ వివరాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో గోల్డ్ ఈటీఎఫ్‌లు రూ. 2040 కోట్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. 2010 జనవరి తదుపరి 2020లో ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్‌లలో రూ. 3,530 కోట్లను ఇన్వెస్ట్ చేసినట్లు వేల్యూ రీసెర్చ్ పేర్కొంది. గతేడాది జూన్ నుంచీ చూస్తే బంగారం ధరలు దాదాపు 42 శాతం ర్యాలీ చేసినట్లు తెలియజేసింది. ర్యాలీ ఓకే.. కానీ దేశీయంగా కోవిడ్-19 ప్రభావంతో ఉపాధి కోల్పోవడం, వేతనాలలో కోత, బిజినెస్‌లు మందగించడం వంటి అంశాలు బంగారు ఆభరణాలు, పసిడి కొనుగోళ్లను దెబ్బతీస్తున్నట్లు బులియన్ వర్తకులు తెలియజేశారు. ఈ పరిస్థితుల్లో ఇకపై బంగారం ధరలు భారీగా ర్యాలీ చేయకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే బంగారం ధరలు ఇకపైన కూడా పటిష్టంగా కదిలే వీలున్నట్లు చాయిస్ బ్రోకింగ్ ఈడీ సుమీత్ బగాడియా చెబుతున్నారు. రానున్న 12-18 నెలల కాలంలో 10 గ్రాముల ధర రూ. 55,000 వరకూ పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్స్ మార్కెట్లో అయితే అంటే ఎంసీఎక్స్‌లో వారాంతాన ఆగస్ట్ కాంట్రాక్ట్ ధర రూ. 48,900 వద్ద ముగిసింది. రానున్న కాలంలో యూఎస్ అధ్యక్ష ఎన్నికలు, కోవిడ్ నేపథ్యంలో కేంద్ర బ్యాంకుల చర్యలు వంటి అంశాలు బంగారం ధరల్లో ఆటుపోట్లకు కారణంకావచ్చని విశ్లేషిస్తున్నారు. దీంతో ధరలు పతనమైతే రూ. 44,200 స్థాయిలో పసిడికి సపోర్ట్ లభించవచ్చని సుమీత్ భావిస్తున్నారు. రక్షణ కోసమైతే ప్రస్తుత స్థాయిలో పసిడిని లాభాల కోసం కొనుగోలు చేయడం సమంజసంకాదని మనీసేఫ్ ఫైనాన్షియిల్ సర్వీసెస్ వ్యవస్థాపకులు అజయ్ కే వాడేకర్ చెబుతున్నారు. హెడ్జింగ్‌కు అంటే.. పోర్ట్‌ఫోలియోల రిస్క్‌ను తగ్గించుకునే బాటలో వినియోగించుకోవచ్చని తెలియజేశారు. పసిడి ధరల్లో గత కొద్ది రోజులుగా నమోదవుతున్న ర్యాలీ స్పీడ్ ఇకపై నీరసించవచ్చని భావిస్తున్నారు. పసిడిలో పెట్టుబడుల కోసం గోల్డ్ ఈటీఎఫ్‌లు, సావరిన్ గోల్డ్ బాండ్లను పరిగణించవచ్చని సూచించారు. -
గోల్డ్ ఈటీఎఫ్‌లు వెలవెల
న్యూఢిల్లీ: గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడేడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) వెలుగులు మసకబారుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు రూ.1,500 కోట్ల వరకూ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కితీసుకున్నారని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(ఏఎంఎఫ్ఐ) తాజా గణాంకాలు వెల్లడించాయి. గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి రాబడులు సరిగ్గా లేకపోవడం, పుత్తడి దిగుమతులపై రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు దీనికి కొన్ని కారణాలని నిపుణులంటున్నారు. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో కూడా మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి పెద్ద మొత్తంలోనే(రూ.2,283 కోట్లు) ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకున్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో మాత్రం గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.1,414 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లకు డిమాండ్ క్రమక్రమంగా తగ్గుతోందని క్వాంటమ్ ఏఎంసీ ఫండ్ మేనేజర్(కమోడిటీస్) చిరాగ్ మెహతా చెప్పారు. బంగారం ధరలు తగ్గుతుండడం, షేర్లు మంచి రాబడులనివ్వడం దీనికి కారణాలని వివరించారు.