గోల్డ్ ఈటీఎఫ్‌లు వెలవెల
న్యూఢిల్లీ: గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడేడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) వెలుగులు మసకబారుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు రూ.1,500 కోట్ల వరకూ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కితీసుకున్నారని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(ఏఎంఎఫ్‌ఐ) తాజా గణాంకాలు వెల్లడించాయి. గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి రాబడులు సరిగ్గా లేకపోవడం, పుత్తడి దిగుమతులపై రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు దీనికి కొన్ని కారణాలని నిపుణులంటున్నారు.
అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో కూడా మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి పెద్ద మొత్తంలోనే(రూ.2,283 కోట్లు) ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకున్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో మాత్రం గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.1,414 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లకు డిమాండ్ క్రమక్రమంగా తగ్గుతోందని క్వాంటమ్ ఏఎంసీ ఫండ్ మేనేజర్(కమోడిటీస్) చిరాగ్ మెహతా చెప్పారు. బంగారం ధరలు తగ్గుతుండడం, షేర్లు మంచి రాబడులనివ్వడం దీనికి కారణాలని వివరించారు.