కొద్ది నెలలుగా బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ప్రధానంగా పలు దేశాల కేంద్ర బ్యాంకులు, ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు పసిడి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నాయి. దీంతో గత వారం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 1800 డాలర్లను అధిగమించింది. 2011 తదుపరి ఇది గరిష్టంకాగా.. ఇందుకు పలు అంశాలు కారణమవుతున్నట్లు బులియన్ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. ఇటీవల దేశీయంగానూ బంగారం ధరలు మెరుస్తున్నాయి. శుక్రవారానికల్లా 10 గ్రాముల ధర రూ. 49,240 వద్ద స్థిరపడింది. వెరసి ఈ ఏడాది(2020)లో ఇప్పటివరకూ పసిడి ధరలు 25 శాతం లాభపడ్డాయి.
ఎందుకంటే?
గతేడాది(2019)లో అమెరికా, చైనా మధ్య నడిచిన వాణిజ్య వివాదాలు ప్రపంచ ఆర్థిక మందగమన పరిస్థితులకు దారితీశాయి. ఆపై చైనాలో పుట్టి యూరోపియన్ దేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్ కారణంగా అల్లకల్లోల పరిస్థితులు తలెత్తాయి. దీంతో పలు దేశాలు లాక్‌డవున్‌ల విధింపువైపు మొగ్గు చూపాయి. ఫలితంగా ఆరోగ్య, ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నాయి. సాధారణంగా సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు పెట్టుబడులు బంగారంవైపు మళ్లుతుంటాయి. దీనికితోడు ఇంతక్రితం స్టాక్ మార్కెట్లు, రియల్టీ ధరల పతనంతో చౌకగా లభిస్తున్న నిధులు బంగారంలోకి ప్రవేశించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే కొద్ది రోజులుగా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల తగ్గింపుతోపాటు.. భారీ లిక్విడిటీని కల్పిస్తుండటంతో ఇటీవల పసిడితోపాటు తిరిగి స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నట్లు తెలియజేశారు. దేశీయంగా చూస్తే.. కోవిడ్-19 కేసులు పెరుగుతుండటం, చైనాతో సరిహద్దు వద్ద వివాదాలు వంటి అంశాలు ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.
6 నెలల్లోనే..
కొద్ది రోజులుగా గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్‌లు)లోకి నిధులు భారీగా ప్రవహిస్తున్నాయి. దీంతో జూన్ చివరికల్లా ఈటీఎఫ్‌ల హోల్డింగ్స్ 3621 టన్నులకు చేరాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వివరాల ప్రకారం ఇవి ఈటీఎఫ్‌ల చరిత్రలోనే అత్యధికంకాగా.. ఈ ఏడాది తొలి అర్ధభాగం(జనవరి-జూన్)లో ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ ఈటీఎఫ్‌లు నికరంగా 734 టన్నులను జమ చేసుకున్నాయి. వీటి విలువ 39.5 బిలియన్ డాలర్లు! ఇవి 2009లో జమ అయిన మొత్తం 646 టన్నులతో పోల్చినా అధికంకావడం విశేషం!
దేశీయంగా
దేశీయంగానూ పసిడికి డిమాండ్ పెరిగింది. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ వివరాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో గోల్డ్ ఈటీఎఫ్‌లు రూ. 2040 కోట్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. 2010 జనవరి తదుపరి 2020లో ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్‌లలో రూ. 3,530 కోట్లను ఇన్వెస్ట్ చేసినట్లు వేల్యూ రీసెర్చ్ పేర్కొంది. గతేడాది జూన్ నుంచీ చూస్తే బంగారం ధరలు దాదాపు 42 శాతం ర్యాలీ చేసినట్లు తెలియజేసింది.
ర్యాలీ ఓకే.. కానీ
దేశీయంగా కోవిడ్-19 ప్రభావంతో ఉపాధి కోల్పోవడం, వేతనాలలో కోత, బిజినెస్‌లు మందగించడం వంటి అంశాలు బంగారు ఆభరణాలు, పసిడి కొనుగోళ్లను దెబ్బతీస్తున్నట్లు బులియన్ వర్తకులు తెలియజేశారు. ఈ పరిస్థితుల్లో ఇకపై బంగారం ధరలు భారీగా ర్యాలీ చేయకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే బంగారం ధరలు ఇకపైన కూడా పటిష్టంగా కదిలే వీలున్నట్లు చాయిస్ బ్రోకింగ్ ఈడీ సుమీత్ బగాడియా చెబుతున్నారు. రానున్న 12-18 నెలల కాలంలో 10 గ్రాముల ధర రూ. 55,000 వరకూ పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్స్ మార్కెట్లో అయితే అంటే ఎంసీఎక్స్‌లో వారాంతాన ఆగస్ట్ కాంట్రాక్ట్ ధర రూ. 48,900 వద్ద ముగిసింది. రానున్న కాలంలో యూఎస్ అధ్యక్ష ఎన్నికలు, కోవిడ్ నేపథ్యంలో కేంద్ర బ్యాంకుల చర్యలు వంటి అంశాలు బంగారం ధరల్లో ఆటుపోట్లకు కారణంకావచ్చని విశ్లేషిస్తున్నారు. దీంతో ధరలు పతనమైతే రూ. 44,200 స్థాయిలో పసిడికి సపోర్ట్ లభించవచ్చని సుమీత్ భావిస్తున్నారు.
రక్షణ కోసమైతే
ప్రస్తుత స్థాయిలో పసిడిని లాభాల కోసం కొనుగోలు చేయడం సమంజసంకాదని మనీసేఫ్ ఫైనాన్షియిల్ సర్వీసెస్ వ్యవస్థాపకులు అజయ్ కే వాడేకర్ చెబుతున్నారు. హెడ్జింగ్‌కు అంటే.. పోర్ట్‌ఫోలియోల రిస్క్‌ను తగ్గించుకునే బాటలో వినియోగించుకోవచ్చని తెలియజేశారు. పసిడి ధరల్లో గత కొద్ది రోజులుగా నమోదవుతున్న ర్యాలీ స్పీడ్ ఇకపై నీరసించవచ్చని భావిస్తున్నారు. పసిడిలో పెట్టుబడుల కోసం గోల్డ్ ఈటీఎఫ్‌లు, సావరిన్ గోల్డ్ బాండ్లను పరిగణించవచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment