ముత్తూట్ ఫైన్సాన్స్ లో భారీ దోపిడీ
బీరంగూడ: సంగారెడ్డి జిల్లా బీరంగూడలో భారీ దోపిడీ జరిగింది. ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలోకి చొరబడిన ఐదుగురు దుండగులు 10 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం దోచుకెళ్లారు. సీబీఐ అధికారులమని చెప్పి లోపలికి ప్రవేశించిన దుండగులు ఉద్యోగులను మారణాయుధాలతో బెదిరించి ఈ దోపిడీకి పాల్పడ్డారు. దుండగులు నలుపు రంగు స్కార్పియో కారులో వచ్చారని, ఇద్దరు వ్యక్తుల చేతుల్లో తుపాకులు ఉన్నట్టు సిబ్బంది తెలిపారు. తమను గుర్తుపట్టకుండా సీసీ కెమెరాలను దొంగలు ధ్వంసం చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేట్టారు. దోపిడీదారులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలిసినవారి పనా, లేక పాత నేరస్తులు ఎవరైనా ఈ దోపిడీకి పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ సిబ్బందిని అడిగి వివరాలు సేకరిస్తున్నారు. చోరీకి సంబంధించి ఐదుగురు వ్యక్తుల ఆనవాళ్లను పోలీసులు విడుదల చేశారు. నిందితుల వయస్సు 35 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉంటుందని పోలీసులు తెలిపారు.
మూడేళ్ల క్రితం ఇదే సంస్థలో ఉగ్రవాదులు చోరీ చేశారు. మధ్యప్రదేశ్ లోని తాండ్వా జైలు నుంచి తప్పించుకుని వచ్చిన ఉగ్రవాదులు ఈ దోపిడీకి పాల్పడ్డారు. మళ్లీ ఇదే సంస్థలో ఇప్పుడు దోపిడీ జరగడంతో భయాందోళన వ్యక్తమవుతోంది.