మళ్లీ ఐపీవోల హల్చల్
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఇటీవల దేశీయంగా ప్రైమరీ మార్కెట్ కళకళలాడుతోంది. ఇటీవలే నిధుల సమీకరణ చేపట్టిన హర్ష ఇంజినీర్స్ నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో లిస్ట్‌కాగా.. ప్రభుత్వ రంగ కంపెనీ వ్యాప్కోస్ ఐపీవో బాట పట్టింది. మరోవైపు ఫ్లోట్ గ్యాస్ తయారీ కంపెనీ గోల్డ్ ప్లస్ గ్లాస్ ఇండస్ట్రీ, ఇంజినీరింగ్ సొల్యూషన్స్ సంస్థ యూనిపార్ట్స్ ఇండియా పబ్లిక్ ఇష్యూలకు తాజాగా సెబీ అనుమతించింది. వివరాలు చూద్దాం..
గోల్డ్ ప్లస్ గ్లాస్..
ఈ ఏడాది ఏప్రిల్‌లో ముసాయిదా పత్రాలు దాఖలు చేసిన గోల్డ్ ప్లస్ గ్లాస్ ఇండస్ట్రీకి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించింది. దీంతో ఐపీవోలో భాగంగా ఫ్లోట్ గ్లాస్ తయారీ కంపెనీ రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.28 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులతోపాటు, సాధారణ కార్పొరేట్, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనుంది. ఫ్లోట్ గ్లాస్ తయారీలో కంపెనీ దేశీయంగా 16 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఆటోమోటివ్, నిర్మాణం, పారిశ్రామిక రంగాలలో ప్రధానంగా కంపెనీ ప్రొడక్టులు వినియోగమవుతున్నాయి.
యూనిపార్ట్స్ ఇండియా
ఐపీవోకు వీలుగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన యూనిపార్ట్స్ ఇండియాకు సెబీ ఓకే చెప్పింది. దీంతో ఇష్యూలో భాగంగా 1.57 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కాగా.. 2014 సెప్టెంబర్‌లో ఒకసారి, 2018 డిసెంబర్లో మరోసారి పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేసింది. ఈ రెండుసార్లూ సెబీ నుంచి అనుమతులు సైతం పొందింది. అయితే పరిస్థితులు అనుకూలించక వెనకడుగు వేసింది. కంపెనీ ప్రధానంగా ఆఫ్‌హైవే మార్కెట్‌కు అనుగుణమైన సిస్టమ్స్, విడిభాగాలను సరఫరా చేస్తోంది. వ్యవసాయం, కన్స్ట్రక్షన్, మైనింగ్ తదితర రంగాలకు సొల్యూషన్లు, ప్రొడక్టులు అందిస్తోంది.
ఐపీవోకు వ్యాప్కోస్
నీటిపారుదల, విద్యుత్, మౌలిక సదుపాయాల రంగాలలో కన్సల్టెన్సీ, ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ సర్వీసులందించే పీఎస్‌యూ సంస్థ వ్యాప్కోస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి సిద్ధపడుతోంది. ఇందుకు సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా 3.25 కోట్ల షేర్లను కంపెనీ ప్రమోటర్(కేంద్ర ప్రభుత్వం) విక్రయానికి ఉంచనుంది. జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే కంపెనీ దక్షిణాసియా, ఆఫ్రికాలోనూ డ్యాములు, రిజర్వాయర్లకు సంబంధించిన ఇంజినీరింగ్, ఇరిగేషన్, వరద నియంత్రణ సర్వీసులను అందిస్తోంది. 30 దేశాలలో కార్యకలాపాలు విస్తరించింది. 455కుపైగా ప్రాజెక్టులు చేపట్టింది. గతేడాది(2021–22) ఆదాయం 11 శాతం బలపడి రూ. 2,798 కోట్లకు చేరగా.. నికర లాభం 14 శాతం పుంజుకుని రూ. 69 కోట్లను అధిగమించింది. కంపెనీ పనిచేస్తున్న విభాగంలో కార్యకలాపాలు కలిగిన ఇతర సంస్థలలో ఇప్పటికే లిస్టయిన ఇర్కాన్ ఇంటర్నేషనల్, రైట్స్, ఇంజినీర్స్ ఇండియా, ఎన్బీ సీసీ, వా టెక్ వాబాగ్‌లను ప్రస్తావించవచ్చు.