గోల్డ్‌క్వెస్ట్ కేసులో మరో నిందితుడి అరెస్ట్
ఇమ్మిగ్రేషన్ తనఖీల్లో చిక్కిన సూత్రధారి
సాక్షి, హైదరాబాద్: గోల్డ్‌క్వెస్ట్ స్కీమ్స్ పేరుతో నెల్లూరు జిల్లా కావలిలో అనేక మందిని నిండా ముంచిన కేసులో మరో నిందితుడిని గురువారం అరెస్టు చేసినట్లు సీఐడీ అదనపు డీజీ టి.కృష్ణప్రసాద్ వెల్లడించారు. కావలి టౌన్ కేంద్రంగా వ్యవహారాలు నడిపిన క్వెస్ట్‌నెట్ ఎంటర్ప్రైజెస్ సంస్థ వివిధ స్కీముల పేరుతో అనేక మందికి ఎరవేసి ఒక్కొక్కరి నుంచి రూ. 33 వేల నుంచి రూ. 66 వేల వరకు వసూలు చేసి మోసగించింది.
దీనికి సంబంధించి స్థానిక టౌన్ పోలీసుస్టేషన్లో నమోదైన కేసును దర్యాప్తు నిమిత్తం సీఐడీకి బదిలీ అయ్యింది. కొందరు నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న వారి కోసం లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేసి అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడు రావి రమేష్‌బాబు ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో అధికారులకు చిక్కారు. విషయం తెలుసుకున్న సీఐడీ అధికారులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.
చెన్నైలో చిక్కిన ‘వరకట్న’ నిందితుడు..
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్లో నమోదైన వరకట్న వేధింపుల కేసులో నిందితుడు స్వామినాథన్ శివానందం శుక్రవారం చెన్నై విమానాశ్రయంలో పట్టుబడినట్లు కృష్ణప్రసాద్ తెలిపారు. 2010లో నమోదైన ఈ కేసులో బెయిల్ పొందిన శివానందం కోర్టు వాయిదాలకు హాజరుకావట్లేదు. దీంతో సంబంధిత న్యాయస్థానం ఇతడిపై వారెంట్ జారీ చేసింది. ఈ అరెస్టును తప్పించుకోవడానికి నిందితుడు ఖతర్‌లో తలదాచుకున్నాడు. దీంతో సైబరాబాద్ పోలీసు కమిషనర్ విజ్ఞప్తి మేరకు సీఐడీ పోలీసులు ఎల్ఓసీ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే నిందితుడు గురువారం ఉదయం ఖతర్ నుంచి తిరిగి వస్తూ చెన్నైలోని విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులకు పట్టుబడ్డాడు.