డాలర్లు దొరక్క.. తిరుమల భక్తుల్లో అసంతృప్తి
సాక్షి, తిరుమల : అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా మంగళవారం తిరుమలలో శ్రీవారి బంగారు, వెండి డాలర్ల అమ్మకాలు జోరుగా సాగాయి. సాయంత్రం 6 గంటల వరకు సుమారు రూ.30 లక్షల వరకు అమ్మకాలు జరిగాయి. రూ.26,020 విలువ చేసే 10 గ్రాముల బంగారు డాలర్లు, రూ.13,225 విలువ చేసే 5 గ్రాముల బంగారు డాలర్ల అమ్మకాలు జరిగాయి. కాగా ఇందులో రూ.5,485 ధరతో విక్రయించే 2 గ్రాముల బంగారు డాలర్ల స్టాకు లేదు. అలాగే రూ.850లు విలువ చేసే10 గ్రాముల వెండి డాలర్లు, రూ.475 విలువ చేసే 5 గ్రాముల వెండి డాలర్లు మాత్రమే అమ్ముడయ్యాయి. రూ.275 ధరతో విక్రయించే 3 గ్రాముల వెండి డాలర్ల స్టాకు అందుబాటులో లేదు.
అక్షయ తృతీయ రోజున శ్రీవారి బంగారు డాలర్లు కొనుగోలు చేద్దామని వచ్చిన భక్తులకు తక్కువ ధరతో ఉన్న డాలర్లు అందుబాటులో ఉంచడంలో టీటీడీ అధికారులు నిర్లక్ష్యం చేశారని పలువురు ధ్వజమెత్తారు. అలాగే డాలర్ల విక్రయ కేంద్రం కూడా ఆలయం ముందు భాగం నుంచి లడ్డూ కౌంటర్ల వద్దకు మార్చడంతో అమ్మకాలు తగ్గినట్టు కనిపిస్తున్నాయి.