రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం పరిహారం ఇవ్వాలి
పునరావాస చట్టం అమలుచేయాలి
గోలివాడ భూనిర్వాసితుల డిమాండ్
రామగుండం: గోలివాడ వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా పరిహారం చెల్లించాలని, తమకు చెల్లించే లబ్ధి చేకూర్చే అంశాలపై అధికారులు లిఖితపూర్వకమైన హామీలు ఇవ్వాలని భూనిర్వాసితులు స్పష్టంచేశారు. మేడిగడ్డ–కాళేశ్వరం పంపుహౌస్ నిర్మాణం కోసం భూసేకరణ నిమిత్తం పెద్దపల్లి ఆర్డీవో, భూసేకరణ అధికారి అశోక్‌కుమార్, కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్ఈ సుధాకర్‌రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు రైతులతో ఆదివారం సమావేశమయ్యారు. భూముల ధరపై రైతులు అభ్యంతరం తెలుపుతూ అధికారుల చెల్లించే ధరను స్పష్టం చేయాలని ప్రశ్నించారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ విలువ ఎకరాకు రూ.14.52లక్షలు ఉందని, అదే ధర ఇస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు. పంపుహౌస్ పనులకు సేకరించే వ్యవసాయ భూములలో శాస్త్రీయ పద్ధతిని పాటించి రైతులకు ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం భూములు సేకరించిన తర్వాత వాటి వెనుకవైపు ఉన్న భూములకు రవాణా సౌకర్యం కల్పించాల డిమాండ్ చేయగా.. స్పందించిన ఎస్ఈ సు«ధాకర్‌రెడ్డి సదరు భూములకు వెళ్లేందుకు కెనాల్‌పై వంతెన నిర్మాణం చేపడతామని చెప్పారు. భూనిర్వాసిత కుటుంబం నుంచి ఒకరికి ప్రాజెక్టులో, లేదంటే నీటిపారుదలశాఖలో ఉద్యోగావకాశం కల్పించాలని, డబుల్‌బెడ్ రూం పథకం వర్తింపజేయాలని కోరారు. 2013భూసేకరణ చట్టం అనుసరించి పరిహారాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల అభిప్రాయాలను అధికారులు ఉన్నతాధికారులతో సమీక్షించి తదుపరి నిర్ణయం వెల్లడించనున్నట్లు ఆర్డీవో అశోక్‌కుమార్ తెలిపారు.