జిల్లాలో ఏమిటీ నియంతృత్వం
రాచరిక పాలన సాగుతోంది
ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు
టీడీపీ నేతలపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, ఎమ్మెల్యే రాజా ధ్వజం
గొల్లప్రోలు :
జిల్లాలో రాచరికవ్యవస్థ కన్నా ఘోరంగా నియంతృత్వ ధోరణితో టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని వెఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. మండలంలోని తాటిపర్తి గ్రామంలో గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం సందర్భంగా పిఠాపురం పార్టీ నియోజకవర్గ కన్వీనర్ పెండెం దొరబాబు ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో తొలుత కన్నబాబు మాట్లాడుతూ రాజులపాలన గుర్తుతెచ్చే విధంగా జిల్లాలో పాలన సాగుతోందన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా అధికారపార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలపై పోలీసులచే అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ప్రజాసమస్యలపై పోరాడడానికి పార్టీ సిద్ధంగా ఉందన్నారు.
కన్నీళ్లు కార్చి కన్నెర్ర జేస్తున్న వర్మ...
నాడు ఓట్లు కోసం కన్నీరు కార్చిన ఎమ్మెల్యే వర్మ అధికారంలోకి వచ్చాక ప్రజలపై కన్నెర్ర చేస్తూ హింసిస్తున్నాడని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. ఏడ్చే నాయకులను నమ్మవద్దన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలోని నాయకులు నీరు, మట్టి, ఇసుకను అమ్ముకుని దందాను సాగిస్తున్నారని, చివరకు గాలిని కూడా అమ్ముకోవడానికి వెనుకాడరన్నారు. వైఎస్సార్ సీపీ కాకినాడ నియోజకవర ్గకన్వీనర్ చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన సాగుతోందన్నారు. పిఠాపురం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ పెండెం దొరబాబు మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎటువంటి కష్టనష్టాలు వచ్చినా అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట, కాకినాడ సిటీ పార్టీ కన్వీనర్లు ముత్యాల శ్రీనివాస్, ముత్తా శశిధర్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కురుమళ్ల రాంబాబు, మండల కన్వీనర్ అరిగెల రామయ్యదొర, స్థానిక నాయకులు దాసం వెంటకలక్ష్మి, ఎంపీటీసీ గారపాటి శ్రీనివాసరావు, బుజ్జి, దాసం కామరాజు, గోవిందు, సామినీడి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.