ప్రతిపక్ష పార్టీలంటే అంత చులకనా!
గొల్లప్రోలు : గొల్లప్రోలు నగర పంచాయతీ అత్యవసర సమావేశం గందరగోళంగా సాగింది. నగర పంచాయతీ చైర్మన్ శీరం మాణిక్యం అధ్యక్షతన ఈ సమావేశం సోమవారం జరిగింది. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లకు కుర్చీలు లేకపోవడంతో వారు కొంతసేపు నిలబడి ఉండిపోయారు. అజెండా అంశాలను చైర్మన్ సమావేశంలో ప్రవేశపెట్టి, కౌన్సిలర్ల ఇబ్బందిని పట్టిం చుకోలేదు. దీంతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ఆగ్రహంతో కమిషనర్ వేగి సత్యనారాయణను, చైర్మన్‌ను నిలదీశారు. ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లు అంటే అంతచులకనా అంటూ వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ తెడ్లపు చిన్నారావు మండిపడ్డారు. బయట అభివృద్ధి కార్యక్రమాల్లో పట్టించుకోవడం లేదని, కనీసం ప్రజా సమస్యలపై చర్చ జరిగే సమావేశంలో కూడా చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే విషయాన్ని గత సమావేశాల్లో ప్రస్తావించినా మార్పు రాలేదంటూ అక్కడే బైఠాయించి నిరసనకు దిగారు. ఈ సమయంలో టీడీపీ కౌన్సిలర్ తోట వీర్రాఘవులు ఆగ్రహంతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లపైకి దూసుకువచ్చారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కేకలు, అరుపులతో కౌన్సిల్ సమావేశం దద్దరిల్లింది. అధికార దర్పంతో ఉద్దేశపూర్వకంగా తమను కించపరుస్తున్నారని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ఈరుగుల గంగ, అమలదాసు శ్రీనివాసరావు, గంధం నాగేశ్వరరావు, రంధి కృష్ణ, గంటా అప్పలస్వామి, గొల్లపల్లి అచ్యుతాంబ ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులుకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇకపై ఇబ్బంది కలగకుండా చూస్తామని కమిషనర్ సత్యనారాయణ సభ్యులకు సర్ది చెప్పారు.