Gollapudi Maruthi
-
‘చెత్త’శుద్ధి
జీవన కాలమ్ బస్సు కదులుతుంటే ఒకే ఒక్క సమస్య నా కళ్లకు కట్టింది. ఇన్ని లక్షల మంది నివసించే దేశంలో ‘చెత్త’ సమస్య కదా! అదీ జపాన్‌లో నేను మా మిత్రుడిని అడిగిన మొదటి ప్రశ్న. ఆయన నవ్వాడు: ‘‘అడగాల్సిన మొదటి ప్రశ్న ఇదే’’ అన్నాడు. జపాన్‌లో టోక్యో నగరానికి 80 కిలోమీటర్ల దూరంలో నారిటా అనే ఊరిలో విమానాశ్రయం. అక్కడి నుంచి టోక్యోకి బస్సులో రెండు గంటల ప్రయాణం. మా మిత్రుడు తీసుకెళ్లాడు. దారి పొడుగునా ముప్పయ్ నలభై అంతస్తుల భవనాలు. లక్షలాది ఇళ్లు. జపాన్ చిన్న ద్వీపం. పురోగతిలో ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉంది. ఏమిటి దీని గొప్పతనం? బస్సు కదులుతుంటే ఒకే ఒక్క సమస్య నా కళ్లకు కట్టింది. ఇన్ని లక్షల మంది నివసించే దేశంలో ‘చెత్త’ సమస్య కదా! అదీ జపాన్‌లో నేను మా మిత్రుడిని అడిగిన మొదటి ప్రశ్న. ఆయన నవ్వాడు: ‘‘అడగాల్సిన మొదటి ప్రశ్న ఇదే’’ అన్నాడు. జపాన్‌లో చెత్త చాలా విలువైన వస్తువు. మరో విలువైన వస్తువు– స్థలం– చిన్న దేశం కనుక. పాలకులు తాటిచెట్టుకీ, తాత పిలకకీ ముడివేశారు. ప్రతిచోటా రెండు రకాలైన చెత్తని వేయడానికి డబ్బాలుంటాయి. తడి చెత్త, పొడి చెత్త. పొడి చెత్తని కొన్ని రసాయనాలతో కలిపి ఇటుకలుగా చేస్తారు. దేశం చుట్టూ ఉన్న సముద్ర జలాలలో నింపి– స్థలాన్ని పెంచుకుంటారు. అలా పూడ్చిన స్థలం మీదే ఒసాకా విమానాశ్రయాన్ని నిర్మిం చారు. అంతేకాదు. 2020లో జరుగుతున్న ఒలింపిక్స్ స్టేడియం– కెంగో కుమాలోన స్టేడియంని ఇలాంటి స్థలం మీదే నిర్మించారు. మా మిత్రుడు– తెలుగు మిత్రుడు– కిళ్లీ వేసుకుని నడిరోడ్డు మీద తుపుక్కున ఉమ్మడం హక్కుగా భావించే తెలుగు మిత్రుడు– నేను తాగిన కూల్‌డ్రింక్ డబ్బాలో కొంచెం ఉండిపోయిందని దాన్ని పడేసే చెత్తబుట్టని వెతుక్కుంటూ కిలోమీటరు నడిచాడు! దేశంలో నేలబారు పౌరుడికి తన కర్తవ్యాన్ని వంటబట్టించిన దేశం ప్రపంచానికి మార్గదర్శి కాక ఏమౌతుంది? ఇప్పుడు మన చెత్తకథ. భారతదేశంలో–125 కోట్ల పైబడిన జనాభా ఉన్న దేశంలో–చెత్తకి కొద్దిరోజుల్లో సంవత్సరానికి ఢిల్లీ నగరమంత స్థలం కావలసి ఉంటుందట. ఈ విషయాన్ని శాస్త్ర, పర్యావరణ పరిరక్షక కేంద్రం ప్రకటించింది. మనది సమృద్ధిగా చెత్తని ఉత్పత్తి చేసే దేశం. చెత్తని గుట్టలు గుట్టలుగా పోయడం కార్పొరేషన్ల హక్కు. వాటి కాలుష్యం వర్ణనాతీతం. ఎవరికీ పట్టదు. ఈ మధ్యనే తడి చెత్త, పొడి చెత్త అంటున్నారు కాని, కేరళలో అళప్పుళ, గోవా రాష్ట్రాలు తప్ప ఎవరూ పట్టించుకోవడంలేదట. చెత్త మన హక్కు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే– అతి చిన్నదేశం స్వీడన్– అలా చెప్తే చాలామందికి తెలియదు. ప్రపంచానికి నోబెల్ బహుమతులని ఏటేటా ఇచ్చే, మన సౌకర్యాలకి ఓల్వో బస్సులని తయారుచేసే దేశం– చెత్తతో బయోగ్యాస్నీ, విద్యుచ్ఛక్తినీ, ఇంటి ఉష్ణోగ్రతలని పెంచే సాధనాలనీ తయారు చేసుకుంటోంది. ఎంత ముమ్మరంగా చేస్తోందంటే– వారి దేశంలో తయారయే చెత్త చాలక 980 లక్షల టన్నుల చెత్తని సాలీనా దిగుమతి చేసుకుంటోందట. ఇది అనూహ్యమైన విషయం. దిగుమతి అవుతున్న చెత్త ఫొటో చూడండి. ఇందులో మళ్లీ ఇళ్లలో తయారయే చెత్తని– జపాన్‌లాగే సముద్రాన్ని నింపి స్థలాన్ని పెంచుకునే కార్యానికి వినియోగిస్తున్నారు. 2011 నుంచి ఇలా సముద్ర స్థలాన్ని కలుపుకోవడానికి ప్రతీ ఇంటిలో తయారవుతున్న చెత్తలో ఒక శాతాన్ని వినియోగిస్తున్నారట. 2012లో ఈ చెత్త వినియోగ విభాగం సలహాదారుడు కాటన్నా ఓస్ట్లుండ్– మా దేశం మాకు కావలసినంత చెత్తని ఇవ్వడం లేదని వాపోయాడు. నార్వే, ఇంగ్లండ్, ఇటలీ, రుమేనియా, బల్గేరియాల నుంచి చెత్తని వీరు దిగుమతి చేసుకుంటున్నారు. మనం స్వీడన్ దాకా వెళ్లనక్కరలేదు. జపాన్‌లో బతుకుతున్న తెలుగువారిని దిగుమతి చేసుకుని– ఆ దేశపు క్రమశిక్షణని ఎలా పాటించాలో నేర్చుకుంటే ‘ఎందుకు పాటించాలో’ పెద్దలు చెప్తారు. అయితే చెత్తలో మనతో పోటీ పడే దేశం మరొకటి ఉంది. అమెరికా. చెత్త గుట్టలు గుట్టలుగా ప్రారంభమయి ప్రస్తుతం అవి కొండలని తలపిస్తున్నాయట. ఏతావాతా దేశానికి కావలసింది వ్యక్తిగత సంస్కారం. పరిపాలకులకు కావలసింది వారిని, వారి ఆలోచనా సరళిని మార్చే చిత్తశుద్ధి. రోజూ దైనందిన జీవితంలో సతమతమయ్యేవారి పొట్ట కొట్టే నాయకుడో, అధికారో పౌరుని అక్రమ శిక్షణని సంస్కరించలేడు. నిజానికి మన దేశంలో చెత్తని మించిన ‘చెత్త’ వ్యక్తుల బుర్రల్లో ఉంది. మనం చేసే పనుల్లో చెత్తపనులు కోకొల్లలు. మొదట వాటిని గుర్తు పట్టి, వేరు చేసి recycle చేసుకోగలిగితే మన మనస్సుల్ లోenergy levels పెరుగుతాయి. అనవసరమైన వ్యర్థాలు తొలగుతాయి. పరిశుభ్రపరుచుకోవడంలో సమాజానికి, వ్యక్తికి పెద్ద తేడా లేదు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి నిలపాలనే జపాన్ లోని తెలుగు మిత్రుడి బుర్రలో ‘అక్రమ శిక్షణ’ అనే చెత్తని ఆ దేశం తొలగించగలిగిందని మనం గుర్తించాలి. గొల్లపూడి మారుతీరావు -
ఓటరూ.. జిందాబాద్
జీవన కాలమ్ విశ్వాసానికి అడ్డదారిలేదు. చదువులేని పేదవాడి చేతిలో ఉన్న బలమైన ఆయుధానికి కాషాయ రంగు లేదు. దళిత వాసన లేదు. ముస్లిం, క్రైస్తవ ‘రుచి’ లేదు. ఒక్కటే ఉంది. క్రూరమైన నిజాయితీ. నేను నేలబారు భారతీ యుడిని. పత్రికలలో కని పించేవే చదువుతాను. నాకంటే బొత్తిగా చదువు రానివారు ఈ దేశంలో కోట్లాదిమంది ఉన్నారు. చదువులూ, పదవులూ కాక కేవలం పొట్టకూటికి, జీవనోపాధికి ప్రతీక్షణమూ పాకులాడేవారు వారంతా. నిజానికి వారే ఈ దేశానికి నాయకత్వాన్ని నిర్ణయిస్తారు. వారి కులాల పేరిటా, వారి మతాల పేరిటా, వారి అవసరాల పేరిటా, వారి ప్రాంతాల పేరిటా, వారి ఉనికి పేరిటా సమర్థిం చడమో, వెనకేసుకు రావడమో జరిపే నాయకులదే ఈ దేశపు అనర్థమంతా. ఈ చదువురాని, కేవలం అవసరాలను తీర్చుకునే జీవనాన్ని గడిపేవారి పెట్టు బడి ఏమిటి? వారు వేసే ఓటుకి ప్రాతిపదిక ఏమి టి?– విశ్వాసం. దీనికి ఎవరూ, ఎప్పుడూ ఏ రంగూ పులమ లేడు. అతను దళితుడైనా, యాద వుడైనా, కాయస్థుడైనా, కుర్మీ అయినా, ముస్లిం అయినా, క్రైస్త వుడైనా, సిక్కు అయినా– అతని పెట్టుబడి విశ్వాసమే. దీనికి ప్రత్యామ్నాయం లేదు. ఉండదు. మరి గూండాలూ, హంత కులూ, బందిపోట్లూ, దోపిడీదా రులూ, కోట్లు దోచుకునేవారూ పదవుల్లోకి ఎలా వస్తున్నారు? ఓటరుని మభ్యపెట్టి. వోటరు నిస్సహాయతని పణంగా పెట్టి. మరో ప్రత్యామ్నాయం కనిపిం చక. గత పాతిక సంవత్సరాలలో తమిళనాడులో రెండే ద్రవిడ పార్టీలు రాజ్యమేలుతున్నాయి. రెండూ రెండు రకాలైన అవినీతుల్ని పాటించాయి. గత 20 సంవత్సరాలలో ఉత్తరప్రదేశ్‌లో రెండే రెండు పార్టీలు రాజ్యమేలుతున్నాయి. ఎస్.పి., బీఎస్పీ. మాయావతి పదవిలో ఉన్న కాలంలో ముస్లింలు, బడుగు వర్గాల గొడవ మరచి పోయి– తన విగ్రహాలు, కాన్షీరామ్ విగ్రహాలు, బలిసిన ఏనుగులు, పార్కులూ కట్టిం చింది. వీటి ఖరీదు కేవలం 5,919 కోట్లు. లక్షల రూపాయల దండల్ని పుట్టిన రోజు కానుకగా ధరిం చింది. ఇది ఒక కథ. మరొక నాయకుడు– మోదీ – నోట్ల బహిష్కరణ కారణంగా 15 లక్షల కోట్లు బ్యాంకుల్లోకి జమకాగా, వివిధ పథకాల ద్వారా పేదలకు, వృద్ధులకు, మహిళలకు పంచారు. నరేంద్ర మోదీకి కావలసినంత వ్యతిరేకత చాన ళ్లలో కనిపించింది. ఆయన ‘శ్రీరామ’ అంటే మతా నికి కొమ్ము కాస్తున్నారన్నారు. ప్రపంచంలో ఎవరూ చేసి, సాధించలేని కరెన్సీ నిషేధ చర్యని ఎండ గట్టారు. ప్రజలు నానా కష్టాల పాలవుతున్నారని పత్రికలు రాశాయి. మేధావులు విమర్శించారు. మరి మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్‌లో, ఉత్తరాఖండ్‌లో నిర్ద్వంద్వంగా చదువురాని దళితుడు, ముస్లిం, ఇతర వర్గాల ఓటర్లు ఆయన్ని ఎన్నుకున్నారేం? ఈ పని 2014లోనూ చేశారు కదా? చానళ్లు ఘోషించిన కరెన్సీ కష్టాలు ఈ నాయకులు వర్ణించినంతగా వారి ని బాధిస్తే– నిరంకుశంగా, నిర్దయతో, నిష్కర్షగా– ఆ ఏకాంతపు బూత్‌లో మోదీని తిరస్కరించేవాడుకదా? అది అతనికెవరూ అడ్డుచెప్పలేని క్షణం కదా? గత 70 సంవత్సరాల కాంగ్రెసు పాలనలో భార తదేశంలో 99 సంస్థలకు, 66 స్కీములకు, జంతు ప్రదర్శన శాలలకు, విమానాశ్రయాలకు, 51 అవా ర్డులకు, 15 స్కాలర్‌షిప్‌లకు, 98 విద్యా సంస్థలకు, 28 టోర్నమెంట్లకు, ట్రోఫీలకు, స్టేడియంలూ, ఆసు పత్రులూ, విశ్వవిద్యాలయాలు– ఇది కేవలం నమూనా జాబితా– గాంధీల పేర్లు పెట్టారు. కాంగ్రెసు హయాంలో సిక్కుల ఊచకోత జరిగింది. ఈ మేధావులెవరూ అడగరేం? ఆత్మవంచన చదువుకున్నవారి హిపోక్రసీ. మేధావుల్ని మతం భయపెట్టినంతగా అవినీతి భయపెట్టదేమో! నన్ను చాలామంది అడుగు తారు– కాంగ్రెసు మీద ఎందుకు మీకు అంత కోపం అని. కార ణం– ఒకే ఒక్క మాట. విశ్వాసం. కాంగ్రెసుని మా తరం ఆరాధిం చింది. మహాత్మాగాంధీ, నెహ్రూ, పటేల్, మౌలానా ఆజాద్, మాల వీయా, తిలక్– వీరందరూ ఆరా ధ్యులు. కాంగ్రెసు పేరు చూసి కొన్ని తరాలు ‘భక్తి’గా వారిని ఎన్నుకున్నాం. తరువాత ఇందిరాగాంధీ నాటికి కాంగ్రెసు చరిత్ర మలుపు తిరిగింది. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఆ పార్టీకి సమాధి కట్టారు. 2019 నాటికి కాంగ్రెసు మిగులుతుందా? అని నిన్ననే ఎవరో సందేహాన్ని వెలిబుచ్చారు. విశ్వాసానికి అడ్డదారిలేదు. కడుపులో ఆకలి తీర డానికి ప్రత్యామ్నాయం లేదు. చదువులేని పేదవాడి చేతిలో ఉన్న బలమైన ఆయుధానికి కాషాయ రంగు లేదు. దళిత వాసన లేదు. ముస్లిం, క్రైస్తవ ‘రుచి’ లేదు. ఒక్కటే ఉంది. క్రూరమైన నిజాయితీ. ఉత్తర ప్రదేశ్‌లో సామాన్య ఓటరు సామూహికంగా వార సత్వపు, మత, దళిత రాజకీయాలమీద తిరగబడ్డా డనడానికి 324 స్థానాల గెలుపు హెచ్చరిక. ఇంకా నాయకులు ఓటింగు మెషిన్లను శంకిస్తే అది వారి ఖర్మ. ఏతావాతా నరేంద్ర మోదీ ఇన్ని కోట్లమందిని ఇన్నిసార్లు మోసం చేయలేడు. ఓటరు ఇంతకంటే ఖరాఖండీగా తన కోపాన్ని, విసుగునీ, తిరుగుబా టునీ ప్రదర్శించలేడు. - గొల్లపూడి మారుతిరావు -
యువజన ఆనంద సంఘం
జీవన కాలమ్ జాతిని సజావుగా నడిపేవాడు నాయకుడు. దేశానికి ముందుంటాడు. జాతిని ఆనందపరిచేవాడు కళాకారుడు–అది ఆటయినా, పాటయినా, మాటయినా–మరేదయినా. జాతి మనస్సులో సుప్రతిష్టమయి ఉంటాడు. కాకినాడలో నూరేళ్ల కిందట యువజన ఆనంద సంఘం అనే ఒక వాలీబాల్ క్లబ్బు ఉండేది. ఆ క్లబ్బు కార్యక్రమాలను నాటక, కళా రంగాలకి విస్తరింపదలచిన పెద్దలు– దంటు సూర్యారావు, గండికోట జోగినాధం, రామానుజులు నాయుడు, ఖాశిం సాహెబ్ గారలు దాన్ని ‘యంగ్ మెన్స్ హాపీ క్లబ్బు’గా మార్చారు. వారి సంకల్పబలం. అది భారతదేశంలోనే మకుటాయమానమైన సంస్థగా మారి ఉద్దండులయిన కళాకారుల్ని తీర్చిదిద్ది–నిన్నే శత వసంతోత్సవం జరుపుకుంది. ఇది చరిత్ర. సంస్థ స్థాపనకు అయిన ఖర్చు– అణాన్నర–అంటే ఇప్పటి ఇరవై పైసలు. ఇలాంటి సంస్థలు నటులని చేర్చి నాటకాలు వేయడం రివాజు. కానీ ఈ సంస్థ ప్రత్యేకత– చిన్న పిల్లల్ని ఆహ్వానించి, వారిని స్కూళ్లలో చేర్చి, చదువులు చెప్పించి, సాకలేని తల్లిదండ్రులకూ ఆర్థిక సహాయం చేసి, అటు తర్వాత ఆ పిల్లలకు నాటకాలలో తర్ఫీదు ఇచ్చేవారు. అలాంటి ఇద్దరు పిల్లలు– కేవలం ఇద్దరి పేరే చెప్తాను– రేలంగి, వడ్లమాని విశ్వనాధం. గండికోట జోగినాధం గొప్ప నటులు. ఆ రోజుల్లో కాళ్లకూరి ‘చింతామణి’లో సుబ్బిశెట్టి, పానుగంటి వారి ‘కంఠాభరణం’లో పెద్దిశెట్టి, ‘శ్రీకృష్ణ లీలలు’లో మొద్దబ్బాయి వేసేవారు. ఆయన అనుంగు శిష్యులు రేలంగి మరొక పేరుపొందిన సుబ్బిశెట్టి. ఇంకా యస్వీ రంగారావు, అంజలీదేవి, సూర్యాకాంతం, ఆదినారాయణరావు, ఏవీ సుబ్బారావు, బీఏ సుబ్బారావు, నల్ల రామ్మూర్తి మొదలైన ఉద్దండులను నాటక, సినీ రంగాలకు అందించిన సంస్థ. యస్వీ రంగారావుగారు ఇంగ్లిష్ నాటకాలు వేసేవారు. అక్కినేని, ఎన్టీ రామారావుతో ఆ రోజుల్లో ‘పల్లెటూరి పిల్ల’ తీసిన బీఏ సుబ్బారావుగారు, ఆనాడు రాజమండ్రిలో ఉండే కృష్ణవేణిగారు కలిసి ‘ఓన్లీ డాటర్’ నాటకాన్ని వేశారు. అవును, ‘సతీ అనసూయ’, ‘పేరంటాలు’, ‘లక్ష్మమ్మ’ నటీమణి కృష్ణవేణి మాటే. ఆవిడకిప్పుడు 96. నిన్ననే ఆమెకు సన్మానం చేశారు. ఆదినారాయణరావుగారి అసిస్టెంటుగా చేసి తనదైన బాణీని ఏర్పరచుకున్న సంగీత దర్శకుడు సత్యం–ఆయన్ని డోలక్ సత్యం అనేవారు– ఈ సంస్థ వారే. అంజలీదేవిగారిది పెద్దాపురం. నాటకాల్లో వేయడానికి తర్ఫీదుకి ఆమె తండ్రి కాకినాడ తీసుకువచ్చారు. గురువు ఆదినారాయణరావు. రోజూ ఆయన సైకిలు మీద డ్యాన్స్ రిహార్సల్స్‌కి వచ్చేవారు. ఆమెకప్పుడు కేవలం 9 ఏళ్లు. వీరిద్దరికీ తేలికగా పన్నెండు సంవత్సరాల దూరం. ఆమె 14వ ఏట క్లబ్బు పెద్దలే కాకినాడలో వారి పెళ్లిని జరిపించారు. పైన పేర్కొన్న వారందరితో కలిసి పనిచేసిన అదృష్టం నాది. నేను రాసిన ఎన్నో చిత్రాలకు సత్యం సంగీతాన్ని నిర్వహించారు. యస్వీ రంగారావుగారు నా ‘పాపం పసివాడు’లో నటించారు. ‘నాకు మరో ‘బంగారుపాప’ అవుతుంది మారుతీరావుగారూ’ అని మురిసిపోయిన రంగారావుగారు ‘చల్లనితల్లి’ మొదటి షెడ్యూలు అవుతూనే కన్నుమూశారు. రేలంగి నా మొదటి చిత్రం ‘ఆత్మ గౌరవం’లో నటించి– దాదాపు ఆయన ఆఖరి చిత్రం, నేను రాసిన ‘నిప్పులాంటి మనిషి’లో నటించారు. ‘జంజీర్’లో దుర్మార్గుల ముఠా రహస్యాలు చెప్పే ఒక పాత్రకి యస్వీ రంగారావుగారిని అనుకున్నాం. షూటింగ్ జరిగే రోజుల్లో ఆయన కన్నుమూశారు. ఆ పాత్ర ఎవరు వేయాలి? నేనూ, ఎస్డీ లాల్, నిర్మాత వైవీ రావుగారు రేలంగి గారిని అనుకున్నాం. ఆయన బొత్తిగా నడవలేని స్థితి. వైవీ రావుగారు అడగ్గానే కళ్లనీళ్లు పెట్టుకున్నారట. నిప్పులాంటి మనిషి 25 వారాలు నడిచింది. ఇక అంజలీ దేవిగారూ నేనూ అక్కా తమ్ముళ్లుగా నటించాం. చిత్రం ‘సంకెళ్లు’. ప్రముఖ దర్శకులు కేఎస్ ప్రకాశరావుగారు నాకు బావగారు. తొలి రోజుల్లో ‘చింతామణి’, ‘భక్త రామదాసు’ ‘కృష్ణలీల’, ‘బృహన్నల’ నుంచి ఇప్పటి నంది నాటకోత్సవాల దాకా అన్నిరకాల నాటకాలనూ ప్రదర్శించి, వృద్ధ కళాకారులకు ఆర్థిక సహాయాన్ని ఇతోధికంగా అందజేస్తూ–ఏటా కళాకారులను సత్కరిస్తూ (నాకు జీవన సాఫల్య పురస్కారాన్ని ఇచ్చారు) తమదైన నాటకశాలను నిర్మించుకోవడం విశేషం. ఒక దశలో నీరసపడిన ఈ సంస్థకి ఆనాటి దంటు సూర్యారావుగారి తమ్ముడు భాస్కరరావుగారు ప్రాణం పోయగా ఈనాటి దంటు సూర్యారావుగారు ఆ వారసత్వాన్ని నిలుపుతున్నారు. జాతికి విజ్ఞానాన్ని పంచేవాడు మేధావి. గ్రంథాలయాల్లో ఉంటాడు. జాతికి నీతిని పంచేవాడు ప్రవక్త. చరిత్రలో ఉంటాడు. జాతిని సజావుగా నడిపేవాడు నాయకుడు. దేశానికి ముందుంటాడు. జాతిని ఆనందపరిచేవాడు కళాకారుడు–అది ఆటయినా, పాట యినా, మాటయినా–మరేదయినా. జాతి మనస్సులో సుప్రతిష్టమయి ఉంటాడు. అది ‘కళ’ ఆకాశంలో నిలవడానికీ, వ్యక్తిని ఆకాశంలో నిలపడానికీ అరుదైన, గొప్ప వేదిక. అలాంటి వేదిక ‘యంగ్మెన్స్ హాపీ క్లబ్’. - గొల్లపూడి మారుతీరావు