ఓటరూ.. జిందాబాద్
జీవన కాలమ్
విశ్వాసానికి అడ్డదారిలేదు. చదువులేని పేదవాడి చేతిలో ఉన్న బలమైన ఆయుధానికి కాషాయ రంగు లేదు. దళిత వాసన లేదు. ముస్లిం, క్రైస్తవ ‘రుచి’ లేదు. ఒక్కటే ఉంది. క్రూరమైన నిజాయితీ.
నేను నేలబారు భారతీ యుడిని. పత్రికలలో కని పించేవే చదువుతాను. నాకంటే బొత్తిగా చదువు రానివారు ఈ దేశంలో కోట్లాదిమంది ఉన్నారు. చదువులూ, పదవులూ కాక కేవలం పొట్టకూటికి, జీవనోపాధికి ప్రతీక్షణమూ పాకులాడేవారు వారంతా. నిజానికి వారే ఈ దేశానికి నాయకత్వాన్ని నిర్ణయిస్తారు. వారి కులాల పేరిటా, వారి మతాల పేరిటా, వారి అవసరాల పేరిటా, వారి ప్రాంతాల పేరిటా, వారి ఉనికి పేరిటా సమర్థిం చడమో, వెనకేసుకు రావడమో జరిపే నాయకులదే ఈ దేశపు అనర్థమంతా. ఈ చదువురాని, కేవలం అవసరాలను తీర్చుకునే జీవనాన్ని గడిపేవారి పెట్టు బడి ఏమిటి? వారు వేసే ఓటుకి ప్రాతిపదిక ఏమి టి?– విశ్వాసం. దీనికి ఎవరూ, ఎప్పుడూ ఏ రంగూ పులమ లేడు. అతను దళితుడైనా, యాద వుడైనా, కాయస్థుడైనా, కుర్మీ అయినా, ముస్లిం అయినా, క్రైస్త వుడైనా, సిక్కు అయినా– అతని పెట్టుబడి విశ్వాసమే. దీనికి ప్రత్యామ్నాయం లేదు. ఉండదు.
మరి గూండాలూ, హంత కులూ, బందిపోట్లూ, దోపిడీదా రులూ, కోట్లు దోచుకునేవారూ పదవుల్లోకి ఎలా వస్తున్నారు? ఓటరుని మభ్యపెట్టి. వోటరు నిస్సహాయతని పణంగా పెట్టి. మరో ప్రత్యామ్నాయం కనిపిం చక. గత పాతిక సంవత్సరాలలో తమిళనాడులో రెండే ద్రవిడ పార్టీలు రాజ్యమేలుతున్నాయి. రెండూ రెండు రకాలైన అవినీతుల్ని పాటించాయి. గత 20 సంవత్సరాలలో ఉత్తరప్రదేశ్‌లో రెండే రెండు పార్టీలు రాజ్యమేలుతున్నాయి. ఎస్.పి., బీఎస్పీ. మాయావతి పదవిలో ఉన్న కాలంలో ముస్లింలు, బడుగు వర్గాల గొడవ మరచి పోయి– తన విగ్రహాలు, కాన్షీరామ్ విగ్రహాలు, బలిసిన ఏనుగులు, పార్కులూ కట్టిం చింది. వీటి ఖరీదు కేవలం 5,919 కోట్లు. లక్షల రూపాయల దండల్ని పుట్టిన రోజు కానుకగా ధరిం చింది. ఇది ఒక కథ. మరొక నాయకుడు– మోదీ – నోట్ల బహిష్కరణ కారణంగా 15 లక్షల కోట్లు బ్యాంకుల్లోకి జమకాగా, వివిధ పథకాల ద్వారా పేదలకు, వృద్ధులకు, మహిళలకు పంచారు.
నరేంద్ర మోదీకి కావలసినంత వ్యతిరేకత చాన ళ్లలో కనిపించింది. ఆయన ‘శ్రీరామ’ అంటే మతా నికి కొమ్ము కాస్తున్నారన్నారు. ప్రపంచంలో ఎవరూ చేసి, సాధించలేని కరెన్సీ నిషేధ చర్యని ఎండ గట్టారు. ప్రజలు నానా కష్టాల పాలవుతున్నారని పత్రికలు రాశాయి. మేధావులు విమర్శించారు. మరి మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్‌లో, ఉత్తరాఖండ్‌లో నిర్ద్వంద్వంగా చదువురాని దళితుడు, ముస్లిం, ఇతర వర్గాల ఓటర్లు ఆయన్ని ఎన్నుకున్నారేం? ఈ పని 2014లోనూ చేశారు కదా? చానళ్లు ఘోషించిన కరెన్సీ కష్టాలు ఈ నాయకులు వర్ణించినంతగా వారి ని బాధిస్తే– నిరంకుశంగా, నిర్దయతో, నిష్కర్షగా– ఆ ఏకాంతపు బూత్‌లో మోదీని తిరస్కరించేవాడుకదా? అది అతనికెవరూ అడ్డుచెప్పలేని క్షణం కదా?
గత 70 సంవత్సరాల కాంగ్రెసు పాలనలో భార తదేశంలో 99 సంస్థలకు, 66 స్కీములకు, జంతు ప్రదర్శన శాలలకు, విమానాశ్రయాలకు, 51 అవా ర్డులకు, 15 స్కాలర్‌షిప్‌లకు, 98 విద్యా సంస్థలకు, 28 టోర్నమెంట్లకు, ట్రోఫీలకు, స్టేడియంలూ, ఆసు పత్రులూ, విశ్వవిద్యాలయాలు– ఇది కేవలం నమూనా జాబితా– గాంధీల పేర్లు పెట్టారు. కాంగ్రెసు హయాంలో సిక్కుల ఊచకోత జరిగింది. ఈ మేధావులెవరూ అడగరేం? ఆత్మవంచన చదువుకున్నవారి హిపోక్రసీ. మేధావుల్ని మతం భయపెట్టినంతగా అవినీతి భయపెట్టదేమో!
నన్ను చాలామంది అడుగు తారు– కాంగ్రెసు మీద ఎందుకు మీకు అంత కోపం అని. కార ణం– ఒకే ఒక్క మాట. విశ్వాసం. కాంగ్రెసుని మా తరం ఆరాధిం చింది. మహాత్మాగాంధీ, నెహ్రూ, పటేల్, మౌలానా ఆజాద్, మాల వీయా, తిలక్– వీరందరూ ఆరా ధ్యులు. కాంగ్రెసు పేరు చూసి కొన్ని తరాలు ‘భక్తి’గా వారిని ఎన్నుకున్నాం. తరువాత ఇందిరాగాంధీ నాటికి కాంగ్రెసు చరిత్ర మలుపు తిరిగింది. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఆ పార్టీకి సమాధి కట్టారు. 2019 నాటికి కాంగ్రెసు మిగులుతుందా? అని నిన్ననే ఎవరో సందేహాన్ని వెలిబుచ్చారు.
విశ్వాసానికి అడ్డదారిలేదు. కడుపులో ఆకలి తీర డానికి ప్రత్యామ్నాయం లేదు. చదువులేని పేదవాడి చేతిలో ఉన్న బలమైన ఆయుధానికి కాషాయ రంగు లేదు. దళిత వాసన లేదు. ముస్లిం, క్రైస్తవ ‘రుచి’ లేదు. ఒక్కటే ఉంది. క్రూరమైన నిజాయితీ. ఉత్తర ప్రదేశ్‌లో సామాన్య ఓటరు సామూహికంగా వార సత్వపు, మత, దళిత రాజకీయాలమీద తిరగబడ్డా డనడానికి 324 స్థానాల గెలుపు హెచ్చరిక. ఇంకా నాయకులు ఓటింగు మెషిన్లను శంకిస్తే అది వారి ఖర్మ.
ఏతావాతా నరేంద్ర మోదీ ఇన్ని కోట్లమందిని ఇన్నిసార్లు మోసం చేయలేడు. ఓటరు ఇంతకంటే ఖరాఖండీగా తన కోపాన్ని, విసుగునీ, తిరుగుబా టునీ ప్రదర్శించలేడు.
- గొల్లపూడి మారుతిరావు