యువజన ఆనంద సంఘం
జీవన కాలమ్
జాతిని సజావుగా నడిపేవాడు నాయకుడు. దేశానికి ముందుంటాడు. జాతిని ఆనందపరిచేవాడు కళాకారుడు–అది ఆటయినా, పాటయినా, మాటయినా–మరేదయినా. జాతి మనస్సులో సుప్రతిష్టమయి ఉంటాడు.
కాకినాడలో నూరేళ్ల కిందట యువజన ఆనంద సంఘం అనే ఒక వాలీబాల్ క్లబ్బు ఉండేది. ఆ క్లబ్బు కార్యక్రమాలను నాటక, కళా రంగాలకి విస్తరింపదలచిన పెద్దలు– దంటు సూర్యారావు, గండికోట జోగినాధం, రామానుజులు నాయుడు, ఖాశిం సాహెబ్ గారలు దాన్ని ‘యంగ్ మెన్స్ హాపీ క్లబ్బు’గా మార్చారు. వారి సంకల్పబలం. అది భారతదేశంలోనే మకుటాయమానమైన సంస్థగా మారి ఉద్దండులయిన కళాకారుల్ని తీర్చిదిద్ది–నిన్నే శత వసంతోత్సవం జరుపుకుంది. ఇది చరిత్ర. సంస్థ స్థాపనకు అయిన ఖర్చు– అణాన్నర–అంటే ఇప్పటి ఇరవై పైసలు.
ఇలాంటి సంస్థలు నటులని చేర్చి నాటకాలు వేయడం రివాజు. కానీ ఈ సంస్థ ప్రత్యేకత– చిన్న పిల్లల్ని ఆహ్వానించి, వారిని స్కూళ్లలో చేర్చి, చదువులు చెప్పించి, సాకలేని తల్లిదండ్రులకూ ఆర్థిక సహాయం చేసి, అటు తర్వాత ఆ పిల్లలకు నాటకాలలో తర్ఫీదు ఇచ్చేవారు. అలాంటి ఇద్దరు పిల్లలు– కేవలం ఇద్దరి పేరే చెప్తాను– రేలంగి, వడ్లమాని విశ్వనాధం.
గండికోట జోగినాధం గొప్ప నటులు. ఆ రోజుల్లో కాళ్లకూరి ‘చింతామణి’లో సుబ్బిశెట్టి, పానుగంటి వారి ‘కంఠాభరణం’లో పెద్దిశెట్టి, ‘శ్రీకృష్ణ లీలలు’లో మొద్దబ్బాయి వేసేవారు. ఆయన అనుంగు శిష్యులు రేలంగి మరొక పేరుపొందిన సుబ్బిశెట్టి. ఇంకా యస్వీ రంగారావు, అంజలీదేవి, సూర్యాకాంతం, ఆదినారాయణరావు, ఏవీ సుబ్బారావు, బీఏ సుబ్బారావు, నల్ల రామ్మూర్తి మొదలైన ఉద్దండులను నాటక, సినీ రంగాలకు అందించిన సంస్థ. యస్వీ రంగారావుగారు ఇంగ్లిష్ నాటకాలు వేసేవారు. అక్కినేని, ఎన్టీ రామారావుతో ఆ రోజుల్లో ‘పల్లెటూరి పిల్ల’ తీసిన బీఏ సుబ్బారావుగారు, ఆనాడు రాజమండ్రిలో ఉండే కృష్ణవేణిగారు కలిసి ‘ఓన్లీ డాటర్’ నాటకాన్ని వేశారు. అవును, ‘సతీ అనసూయ’, ‘పేరంటాలు’, ‘లక్ష్మమ్మ’ నటీమణి కృష్ణవేణి మాటే. ఆవిడకిప్పుడు 96. నిన్ననే ఆమెకు సన్మానం చేశారు. ఆదినారాయణరావుగారి అసిస్టెంటుగా చేసి తనదైన బాణీని ఏర్పరచుకున్న సంగీత దర్శకుడు సత్యం–ఆయన్ని డోలక్ సత్యం అనేవారు– ఈ సంస్థ వారే.
అంజలీదేవిగారిది పెద్దాపురం. నాటకాల్లో వేయడానికి తర్ఫీదుకి ఆమె తండ్రి కాకినాడ తీసుకువచ్చారు. గురువు ఆదినారాయణరావు. రోజూ ఆయన సైకిలు మీద డ్యాన్స్ రిహార్సల్స్‌కి వచ్చేవారు. ఆమెకప్పుడు కేవలం 9 ఏళ్లు. వీరిద్దరికీ తేలికగా పన్నెండు సంవత్సరాల దూరం. ఆమె 14వ ఏట క్లబ్బు పెద్దలే కాకినాడలో వారి పెళ్లిని జరిపించారు.
పైన పేర్కొన్న వారందరితో కలిసి పనిచేసిన అదృష్టం నాది. నేను రాసిన ఎన్నో చిత్రాలకు సత్యం సంగీతాన్ని నిర్వహించారు. యస్వీ రంగారావుగారు నా ‘పాపం పసివాడు’లో నటించారు. ‘నాకు మరో ‘బంగారుపాప’ అవుతుంది మారుతీరావుగారూ’ అని మురిసిపోయిన రంగారావుగారు ‘చల్లనితల్లి’ మొదటి షెడ్యూలు అవుతూనే కన్నుమూశారు. రేలంగి నా మొదటి చిత్రం ‘ఆత్మ గౌరవం’లో నటించి– దాదాపు ఆయన ఆఖరి చిత్రం, నేను రాసిన ‘నిప్పులాంటి మనిషి’లో నటించారు. ‘జంజీర్’లో దుర్మార్గుల ముఠా రహస్యాలు చెప్పే ఒక పాత్రకి యస్వీ రంగారావుగారిని అనుకున్నాం. షూటింగ్ జరిగే రోజుల్లో ఆయన కన్నుమూశారు. ఆ పాత్ర ఎవరు వేయాలి? నేనూ, ఎస్‌డీ లాల్, నిర్మాత వైవీ రావుగారు రేలంగి గారిని అనుకున్నాం. ఆయన బొత్తిగా నడవలేని స్థితి. వైవీ రావుగారు అడగ్గానే కళ్లనీళ్లు పెట్టుకున్నారట. నిప్పులాంటి మనిషి 25 వారాలు నడిచింది. ఇక అంజలీ దేవిగారూ నేనూ అక్కా తమ్ముళ్లుగా నటించాం. చిత్రం ‘సంకెళ్లు’. ప్రముఖ దర్శకులు కేఎస్ ప్రకాశరావుగారు నాకు బావగారు.
తొలి రోజుల్లో ‘చింతామణి’, ‘భక్త రామదాసు’ ‘కృష్ణలీల’, ‘బృహన్నల’ నుంచి ఇప్పటి నంది నాటకోత్సవాల దాకా అన్నిరకాల నాటకాలనూ ప్రదర్శించి, వృద్ధ కళాకారులకు ఆర్థిక సహాయాన్ని ఇతోధికంగా అందజేస్తూ–ఏటా కళాకారులను సత్కరిస్తూ (నాకు జీవన సాఫల్య పురస్కారాన్ని ఇచ్చారు) తమదైన నాటకశాలను నిర్మించుకోవడం విశేషం. ఒక దశలో నీరసపడిన ఈ సంస్థకి ఆనాటి దంటు సూర్యారావుగారి తమ్ముడు భాస్కరరావుగారు ప్రాణం పోయగా ఈనాటి దంటు సూర్యారావుగారు ఆ వారసత్వాన్ని నిలుపుతున్నారు.
జాతికి విజ్ఞానాన్ని పంచేవాడు మేధావి. గ్రంథాలయాల్లో ఉంటాడు. జాతికి నీతిని పంచేవాడు ప్రవక్త. చరిత్రలో ఉంటాడు. జాతిని సజావుగా నడిపేవాడు నాయకుడు. దేశానికి ముందుంటాడు. జాతిని ఆనందపరిచేవాడు కళాకారుడు–అది ఆటయినా, పాట యినా, మాటయినా–మరేదయినా. జాతి మనస్సులో సుప్రతిష్టమయి ఉంటాడు. అది ‘కళ’ ఆకాశంలో నిలవడానికీ, వ్యక్తిని ఆకాశంలో నిలపడానికీ అరుదైన, గొప్ప వేదిక. అలాంటి వేదిక ‘యంగ్‌మెన్స్ హాపీ క్లబ్’.
- గొల్లపూడి మారుతీరావు