జీవో-279ని రద్దు చేయాలి
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కె.ఉమామహేశ్వరరావు
నెహ్రూనగర్ (గుంటూరు): మున్సిపల్ కార్మికులను ఇబ్బందులకు గురిచేసే జీవో నం.279ని రద్దు చేయకుంటే దీర్ఘకాలిక పోరాటం చేయకతప్పదని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. జీవో 279ని రద్దు చేయాలని, 151, 193 జీవోల ప్రకారం జీతాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బు«ధవారం డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జీవో నం : 279 వల్ల అటు కార్మికులకే కాకుండా ఇటు ప్రజల నెత్తిన ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. తెనాలి, చీమకుర్తి మున్సిపాల్టీల్లో 279 జీవో ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం నిర్వహణ, జీతాల కంటే అదనంగా దాదాపు రూ.50 లక్షల దాకా ఖర్చువుతుందని చెప్పారు. అదనపు ఖర్చుల భారమంతా ప్రజలపై వేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందన్నారు. ఇప్పటికే నెల్లూరు, విజయనగరం, తెనాలి, సాలూరు మున్సిపాల్టీల్లో జీవో 279 అమలు పరిచి విఫలమయ్యారని తెలిపారు. 151, 193 జీవోల ప్రకారం కాంట్రాక్టు కార్మికులకు జీతాలు అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోకుంటే మంత్రుల ఇళ్లు ముట్టడించేందుకు సైతం వెనుకాడేదిలేదని స్పష్టం చేశారు. ధర్నాలో సీఐటీయూ నాయకులు పి.రామచంద్రరావు, ఎం.డేవిడ్, కె.తిరుపాల్, ధనలక్ష్మి, సుబ్బారావు, నాగభూషణం, శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.