మస్త్.. మస్త్..
అనంతపురం కల్చరల్, న్యూస్‌లైన్ : న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. పిల్లలు, యువకులు, పెద్దలు.. ఎవరికి తోచినట్లు వారు కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. బేకరీలు, హోటళ్లు, డాబాలు జనంతో కిటకిటలాడాయి. అర్ధరాత్రి కాగానే కేక్ కట్ చేసి.. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉల్లాసంగా, ఉత్సాహంగా యువత కేరింతలు కొట్టారు. 2013కి గుడ్ బై చెబుతూ 2014కి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ వెల్కమ్ చెప్పారు. మంగళవారం రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతపురంలో చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా అందరూ సంతోషంగా అర్ధరాత్రి వరకు మేలుకున్నారు.
సరిగ్గా 12 గంటలు కాగానే ‘హ్యాపీ న్యూఇయర్’ అంటూ కేకలు వేస్తూ.. బంధు మిత్రులకు ఫోన్లు చేశారు. ఎస్ఎంఎస్లు పంపారు. మహిళలు ఇళ్ల ముందు రంగవల్లులు వేసి నూతన సంవత్సరానికి సుస్వాగతం పలికారు. అర్ధరాత్రి యువత సందడి చేసింది. రోడ్లమీద కొచ్చి అందరికీ విష్ చేస్తూ ఆనందం పంచుకున్నారు. విద్యాసంస్థల్లో మంగళవారం ఉదయం నుంచే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిల్, శ్రీకంఠం సర్కిల్ వంటి ప్రదేశాల్లో యువకులు బైక్‌లతో హల్చల్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా జిల్లాలో సగటున రోజుకు రూ.2 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగేవి. అయితే డిసెంబర్ 31వ తేదీ ఒక్క రోజు మాత్రమే రూ.7 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు తెలిసింది.