ప్రముఖ నటుడు రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య
లాస్ ఏంజిల్స్:ప్రముఖ నటుడు,ఆస్కార్ అవార్డు గ్రహీత రాబిన్ విలియమ్స్(63) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విలియమ్స్ సోమవారం ఆత్మహత్య చేసుకుని తుది శ్వాస విడిచాడు. ఈ విషయాన్ని నిన్న మధ్యాహ్నం పోలీసులు ధృవీకరించారు. ఉత్తర కాలిఫోర్నియా కు సమీపంలో ఉన్న టిబురోన్ లోని తన ఇంట్లో విలియమ్స్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు స్పష్టం చేశారు. అతను కొంతకాలంగా శ్వాస కోస సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో ఆ నటుడు మానసిక క్షోభకు గురయ్యేవాడని యూఎస్ మీడియా తెలిపింది. అమెరికన్ టీవీ సిరీస్ లోనూ, హాలీవుడ్ లోనూ తనకంటూ ప్రత్యేక స్థానం తెచ్చుకున్న విలియమ్స్ ఆకస్మిక మృతి యావత్తు సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
విలియమ్స్ నటించిన టీవీ షోల్లో 'మోర్క్ అండ్ మైండ్' అభిమానులు హృదయాల్లో మాత్రం చెరగని ముద్ర వేసింది. బుల్లి తెరలపై ప్రస్థానాన్ని మొదలుపెట్టిన విలియమ్స్ 1987 లో విడుదలైన 'గుడ్ మార్నింగ్ వియాత్నం', 1989లో 'డెడ్ పొయెట్స్ సొసైటీ', 1997 లో గుడ్ విల్ హంటింగ్ తదితర హాలీవుడ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 'గుడ్ విల్ హంటింగ్' చిత్రానికి గాను ఉత్తమ సహాయనటుడి కేటగిరీలో అతని ఆస్కార్ అవార్డును గెలుచుకున్నాడు.