Goods cut
-
‘గురుకుల’ అక్రమాల గుట్టు రట్టు
* పాఠశాలను తనిఖీ చేసిన అధికారులు * అక్రమంగా దాచిన సరుకుల స్వాధీనం * తప్పుదారి పట్టించిన సిబ్బంది * వాచ్‌మన్‌పై పోలీసులకు పిర్యాదు నిజాంసాగర్ : గురుకుల పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం ప్రతి నెలా అందిస్తున్న సరుకులలో కోత విధించి వాటిని పక్కదారి పట్టిస్తున్నవారి గుట్టును సోమవారం అధికారులు రట్టు చేశారు. మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లార గేట్ వద్ద గల తెలంగాణ సాంఘిక బాలికల గురుకుల పాఠశాలలో సరుకులు పక్కదారి పడుతున్నాయని వచ్చిన సమాచారం మేరకు సోమవారం ఎంపీడీఓ నాగరాజు, ఈఓపీఆర్డీ సాయిబాబా అకస్మిక తనిఖీలు చేశారు. అధికారుల రాకను గమనించిన ప్రిన్సిపాల్‌తోపాటు ఇతర సిబ్బంది వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. సరుకుల వివరాలను తెలిపేందుకు ప్రిన్సిపాల్ గోదావరి వారిని స్టాక్ రూంకు తీసుకెళ్లగా అదేసమయంలో ఇతర సిబ్బంది సమీపంలోని మరోగదిలో అక్రమంగా దాచిన చింతపండు, బియ్యం, గోధుమపిండి, పప్పుకారం, కొబ్బరి ఇతర సరుకులను దగ్గర్లోని వాచ్‌మన్ గదిలోకి మార్పించే ప్రయత్నం చేశారు. దీనిని గుర్తించిన అధికారులు వెంటనే వాచ్‌మన్ గదిని సోదా చేసి, స్నానాల గదిలో అక్రమంగా దాచిన 30 కిలోల చింతపండు, 20 కిలోల గోధుమపిండి, 40 కిలోల బియ్యం, 25 కిలోల పెసరపప్పు, 5 కిలోల కొబ్బరి, 40 ప్యాకెట్ల కారం, 30 ప్యాకెట్ల సేమియాను స్వాధీనం చేసుకున్నారు. వాచ్‌మన్‌ను పోలీసులకు అప్పగించారు. వెలుగుచూసిన అక్రమాలు అధికారుల తనిఖీలో గురుకుల పాఠశాలలోని అనేక అక్రమాలు వెలుగు చూశాయి. విద్యార్థులకు అందించే సరుకులలో కోత విధించి, అట్టి సరుకులను ప్రతి వారం ఆటోలో నింపి మార్కెట్‌కు తరలించి అమ్ముకుంటారని విద్యార్థులు తెలిపారు. రోజూ తమకు సన్న బియ్యంతోపాటు దొడ్డు బియ్యం కూడ కలిపి వండి పెడుతున్నారని చెప్పారు. ప్రతి నెలా విద్యార్థులకు ప్రభుత్వం తరపున వచ్చే డబ్బులను సైతం ఇవ్వడంలేదన్నారు. ఈ వివరాలన్నింటితో కలెక్టర్‌కు నివేదిక పంపనున్నట్లు ఎంపీడీఓ నాగరాజు తెలిపారు. -
ముందువెళ్లిన వారికే రేషన్
భీమవరం, న్యూస్‌లైన్ : రేషన్ షాపుల ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకులపైనా ప్రభుత్వం కోత విధించింది. బోగస్ కార్డులను సాకుగా చూపించి నెలవారీ కోటాలో 15 శాతం తగ్గించేసింది. ముందు వచ్చిన వారికే సరుకులు.. వెనుకవస్తే మొండి చెయ్యే.. అన్నరీతిలో ప్రస్తుత పరిస్థితి తయారైంది. రేషన్ కార్డుదారులు లబోదిబోమంటుండగా, ముందస్తు సమాచారం కూడా లేకుండా కోత విధించడంతో డీలర్లు డీలాపడ్డారు. ఈ నెల నుంచే ఈ కోతలు మొదలయ్యాయి. గత నెలతో పోలిస్తే ఈ నెల రేషన్కుగాను డిపోలకు 85శాతం సరుకులను మాత్రమే విడుదల చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఆయా జిల్లాల అధికార యంత్రాంగానికి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిర్ణీత తేదీల్లో రేషన్ దుకాణానికి ఎవరు ముందు వస్తే వారికే సరుకులు ఇవ్వనున్నారు. రేషన్ కార్డుదారులకు తాము ఏమి సమాధానం చెప్పాలంటూ డీలర్లు ఆందోళన చెందుతున్నారు. రేషన్ కార్డులను తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అడ్డదారిన రాత్రికిరాత్రి ఉత్తర్వులు జారీ చేసిందనే చర్చ సాగుతోంది. జిల్లాలో 2వేల 86 రేషన్ షాపులకుగాను 11లక్షల 20 వేల 37 రేషన్ కార్డులున్నాయి. ప్రతి నెలా సుమారు 15వేల 303 టన్నుల బియ్యాన్ని రేషన్ షాపులకు ప్రభుత్వం సరఫరా చేసేది. దీంతోపాటు ‘అమ్మహస్తం’ పథకంలో భాగంగా 9 సరుకులను కార్డుదారులకు ఒక్కో సరుకుకు చెందిన ప్యాకెట్లు 11 లక్షల 20 వేల 437 రావాల్సి ఉంది. 15 శాతం కోత కారణంగా నవంబర్ నెల కోటాకు 13,400 టన్నులు బియ్యం, ఒక్కో సరుకుకు సంబంధించిన ప్యాకెట్లు 9 లక్షల 52 వేల 371 వచ్చాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇక రేషన్ దుకాణానికి ముందెళ్ళిన వారికే సరుకు దక్కుతుంది. వెనుక వెళ్లిన వారు వెనుదిరగాల్సిందే. కోత వాస్తవమే.. డీఎస్వో చౌకడిపోల ద్వారా అందిస్తున్న సరుకుల్లో నవంబర్ నెల కోటాలో ప్రభుత్వం 15శాతం కోత విధించిన మాట వాస్తవమేనని జిల్లా పౌరసరఫరాల అధికారి(డీఎస్వో) డి.శివశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంపై ఆయనను ‘న్యూస్‌లైన్’ ఫోనులో సంప్రదిం చగా పైవిధంగా స్పందించారు. పూర్తిస్థాయిలో సరుకులు సరఫరా చేయాలని కోరుతూ జేసీ రాష్ర్త ప్రభుత్వానికి నివేదిక పంపించారని, కొద్ది రోజుల్లోనే కోత విధించిన సరుకులు కూడా కార్డుదారులకు అందుతాయని చెప్పారు.