‘గురుకుల’ అక్రమాల గుట్టు రట్టు
* పాఠశాలను తనిఖీ చేసిన అధికారులు
* అక్రమంగా దాచిన సరుకుల స్వాధీనం
* తప్పుదారి పట్టించిన సిబ్బంది
* వాచ్‌మన్‌పై పోలీసులకు పిర్యాదు
నిజాంసాగర్ : గురుకుల పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం ప్రతి నెలా అందిస్తున్న సరుకులలో కోత విధించి వాటిని పక్కదారి పట్టిస్తున్నవారి గుట్టును సోమవారం అధికారులు రట్టు చేశారు. మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లార గేట్ వద్ద గల తెలంగాణ సాంఘిక బాలికల గురుకుల పాఠశాలలో సరుకులు పక్కదారి పడుతున్నాయని వచ్చిన సమాచారం మేరకు సోమవారం ఎంపీడీఓ నాగరాజు, ఈఓపీఆర్‌డీ సాయిబాబా అకస్మిక తనిఖీలు చేశారు.
అధికారుల రాకను గమనించిన ప్రిన్సిపాల్‌తోపాటు ఇతర సిబ్బంది వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. సరుకుల వివరాలను తెలిపేందుకు ప్రిన్సిపాల్ గోదావరి వారిని స్టాక్ రూంకు తీసుకెళ్లగా అదేసమయంలో ఇతర సిబ్బంది సమీపంలోని మరోగదిలో అక్రమంగా దాచిన చింతపండు, బియ్యం, గోధుమపిండి, పప్పుకారం, కొబ్బరి ఇతర సరుకులను దగ్గర్లోని వాచ్‌మన్ గదిలోకి మార్పించే ప్రయత్నం చేశారు.
దీనిని గుర్తించిన అధికారులు వెంటనే వాచ్‌మన్ గదిని సోదా చేసి, స్నానాల గదిలో అక్రమంగా దాచిన 30 కిలోల చింతపండు, 20 కిలోల గోధుమపిండి, 40 కిలోల బియ్యం, 25 కిలోల పెసరపప్పు, 5 కిలోల కొబ్బరి, 40 ప్యాకెట్ల కారం, 30 ప్యాకెట్ల సేమియాను స్వాధీనం చేసుకున్నారు. వాచ్‌మన్‌ను పోలీసులకు అప్పగించారు.
వెలుగుచూసిన అక్రమాలు
అధికారుల తనిఖీలో గురుకుల పాఠశాలలోని అనేక అక్రమాలు వెలుగు చూశాయి. విద్యార్థులకు అందించే సరుకులలో కోత విధించి, అట్టి సరుకులను ప్రతి వారం ఆటోలో నింపి మార్కెట్‌కు తరలించి అమ్ముకుంటారని విద్యార్థులు తెలిపారు. రోజూ తమకు సన్న బియ్యంతోపాటు దొడ్డు బియ్యం కూడ కలిపి వండి పెడుతున్నారని చెప్పారు. ప్రతి నెలా విద్యార్థులకు ప్రభుత్వం తరపున వచ్చే డబ్బులను సైతం ఇవ్వడంలేదన్నారు. ఈ వివరాలన్నింటితో కలెక్టర్‌కు నివేదిక పంపనున్నట్లు ఎంపీడీఓ నాగరాజు తెలిపారు.