సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని కుషాయిగూడలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. గుడిలో చోరీకి యత్నించిన దొంగపై వాచ్‌మెన్ దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు.. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద రంగయ్య (60) అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం అర్థరాత్రి సమయంలో ఓ యువకుడు చోరీ కోసం గుడిలోకి ప్రవేశించాడు.
ఆలయంలోకి వచ్చిన దుండగుడు గర్భగుడిలోని హుండీ దగ్గరకు వెళ్లి దానిని పగులగొట్టేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన రంగయ్య వెంటనే అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అతను వాచ్‌మెన్‌పై రాళ్లతో దాడికి దిగాడు. దొంగను అడ్డుకునేందుకు వాచ్‌మెన్ కూడా దగ్గర ఉన్న కర్రతో బలంగా కొట్టాడు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో దొంగ తలకు బలంగా దెబ్బ తగలడంతో తీవ్ర గాయమై అక్కడికక్కడే మరణించాడు.
ఉదయం ఆలయానికి వచ్చిన అధికారులు, పోలీసులు మృతదేహం చూసి భయాందోళనకు గురయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. హుటహుటిన ఆలయానికి చేరుకున్న పోలీసులు మృతుడిని పరిశీలించగా.. అతని ఫోన్ దొరికింది.
ఫోన్‌లోని ఆధారాలను బట్టి దొంగతనానికి వచ్చిన యువకుడు గండం రాజు (23)గా గుర్తించారు. రాజు స్వస్థలం కామారెడ్డి జిల్లా ఆరేపల్లిగా తెలిపారు. పోలీసులు యువకుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment