నలందలో వర్సిటీలో మళ్లీ చదువులు
వర్సిటీ పునఃప్రారంభం
బీహార్షరీఫ్: ప్రపంచంలోనే తొట్టతొలి విశ్వవిద్యాల యాల్లో ఒకటిగా, పలుదేశాల విద్యార్థులను ఆకర్షించిన ప్రాచీనమైన నలందా విశ్వవిద్యాలయంలో మళ్లీ లాంఛనంగా తరగతులు ప్రారంభమయ్యాయి. దాదాపు 800 సంవత్సరాల తర్వాత బీహార్లోని రాజ్గిరిలో పునరుద్ధరించిన నూతన ప్రాగణంలో విద్యార్థుల చదువుల సందడి మొదలైంది.
విశ్వవిద్యాలయంలో చరిత్ర, పర్యావరణ అధ్యయన విభాగాలలో మొత్తం 15 మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోగా, వారిలో 9 మంది తొలిరోజున తరగతులకు హాజరయ్యారు. వారిలో జపాన్, భూటాన్ దేశాలకు చెందిన ఒక్కో విద్యార్థిసహా 9 మంది విద్యార్థులకు, ఆరుగురు అధ్యాపకులకు, సిబ్బందికి వైస్ చాన్స్లర్ గోపా సభర్వాల్ స్వయంగా స్వాగతం పలికారు.
తొమ్మిదేళ్ల కృషితో ప్రాచీన విశ్వవిద్యాలయం తిరిగి ప్రారంభమైందని, భవిష్యత్తులో ఇది బలోపేతంకాగలదని ఆశిస్తున్నామని గోపా సభర్వాల్ ఈ సందర్భంగా మీడియాకు చెప్పారు. విశ్వవిద్యాలయం మౌలిక సదుపాయాలు, అవసరాలపై సమీక్షకోసం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ నెల 14 న వర్సిటీని సందర్శిస్తారన్నారు. వివిధ కోర్సులకుగాను 35 దేశాల విద్యార్థులనుంచి తమకు 1,400 దరఖాస్తులు అందినట్టు చెప్పారు. సరైన ప్రచారంలేనందునే తక్కువ సంఖ్యలో విద్యార్థులు నమోదయ్యారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.