ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం
అనంతపురం అగ్రికల్చర్: సమ్మెలో వెళ్లిన పాపానికి ఉద్యోగాల నుంచి తొలగించి రోడ్డున పడేలా చేశారని, ఆదుకోకపోతే పురుగుల మందు తాగి చచ్చిపోతామని పశుగణాభివృద్ధి సంస్థ (డీఎల్‌డీఏ)లో పనిచేస్తున్న గోపాలమిత్రలు ఆందోళనకు దిగారు. గురువారం సాయంత్రం స్థానిక డీఎల్‌డీఏ కార్యాలయం ఎదుట తలుపుల మండలానికి చెందిన తొలగించిన 11 మంది గోపాలమిత్రలు పురుగు మందు డబ్బాలు చేతపట్టుకుని తాగి చస్తామని ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఓబయ్య, ఓబుళకృష్ణ, వెంకటరమణ, బాలరాజు, జీసీ నరసింహులు, గౌస్‌లాజం, నాగార్జున, వెంకటరమణనాయక్, విజయకుమార్, ఆంజనేయులు, ఆదినారాయణ తదితరులు విలేకరులతో మాట్లాడారు.
గతంలో సమ్మె చేసిన పాపానికి జిల్లా వ్యాప్తంగా 66 మంది గోపాలమిత్రలను తొలగించి వారి స్థానంలో కొత్తవారిని తీసుకున్నారన్నారు. పల్లెల్లో పశువులు, పాడి రైతులకు మంచి సేవలందించామని, తమ డిమాండ్ల సాధన కోసం గతంలో సమ్మె చేశామన్నారు. అంతకు మించి తమ తప్పు లేనందున అకారణంగా తొలగించారనే అంశంపై కలెక్టర్, పశుశాఖ జేడీ, డీఎల్‌డీఏ చైర్మన్, ఈవోతో పాటు పశుశాఖ డైరెక్టర్‌ను కూడా కలిసి విన్నవించామన్నారు. మరికొందరు కోర్టుకు కూడా వెళ్లారన్నారు. దీనిపై డీఎల్‌డీఏ ఈవో, పశుశాఖ జేడీ ఆ తర్వాత త్రిసభ్య కమిటీ జిల్లాకు వచ్చి తొలగించిన గోపాలమిత్రలను కలిసి విచారణ చేశారన్నారు. విచారణ కమిటీ నివేదిక రాకుండానే కొత్తవారిని విధుల్లో చేర్చుకునే యత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమకు న్యాయం జరిగేదాకా ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గోపాలమిత్రలు ఆందోళనకు దిగడంతో డీఎల్‌డీఏ అధికారులు కొత్త నియామకాలు నిలిపివేసి వారిని వెనక్కి పంపారు.