రోడ్డెక్కిన గోపాలమిత్రలు
- 67 మందిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్
- ఆత్మహత్యాయత్నం చేసిన నరసింహులును బతికించాలి
- పశుశాఖ, డీఎల్‌డీఏ కార్యాలయం ఎదుట బైఠాయింపు
అనంతపురం అగ్రికల్చర్: తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని, ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతున్న నరసింహులుకు మెరుగైన వైద్యం చేయించాలని, డీఎల్‌డీఏ ఈవో తిరుపాలరెడ్డిపై చర్యలు తీసుకోవాలనే ప్రధాన డిమాండ్‌తో స్థానిక పశుసంవర్ధకశాఖ జేడీ కార్యాలయం, డీఎల్‌డీఏ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై గోపాలమిత్రలు శనివారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా గోపాలమిత్ర అసోసియేషన్ నాయకులు వెంకటేశ్, కిష్టప్ప, పెద్దన్న, శివారెడ్డి, రామాంజనేయులు, రాజబాబు, ఓబులేసు, గురివిరెడ్డి తదితరులు మాట్లాడారు.
న్యాయం జరిగేదాకా ఆందోళన వీడేది లేదని హెచ్చరించారు. తమ డిమాండ్ల సాధనకు సమ్మె చేసినందున ఉద్యోగం నుంచి తొలగించడంతో చాలా మంది ఉపాధి లేక రోడ్డున పడ్డారన్నారు. తొలగించిన వారి స్థానంలో ఏకపక్షంగా కొత్తవారిని నియమించడం దారుణమన్నారు. ఈ వ్యవహారంపై గతంలో త్రిసభ్య కమిటీ చేసిన విచారణ నివేదిక బహిర్గం కాకుండా కొత్తవారిని నియమించడంపై మండిపడ్డారు. నరసింహులు లాంటి గోపాలమిత్రలు మరికొందరు ఉపాధి లేక, కుటుంబాన్ని పోషించుకోలేక బలన్మరణాలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆదోళన వ్యక్తం చేశారు.న్యాయం జరిగేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని నాయకులు హెచ్చరించారు.
మరోసారి ఆందోళన బాట :
ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో గోపాలమిత్రలు మరోసారి ఆందోళన బాట పట్టారు. గతేడాది అకారణంగా తొలగించిన 67 మంది గోపాలమిత్రలను విధుల్లోకి తీసుకోవాలని, అందుకు కారకులను డీఎల్‌డీఏ ఈఓ తిరుపాల్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఉద్యమానికి సిద్ధమయ్యారు. తొలగించిన గోపాలమిత్రలకు తోడుగా పనిచేస్తున్న వారు మద్దతు పలికి మూకుమ్మడిగా విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్తామని హెచ్చరికలు జారీ చేశారు.
దీంతో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డీఎల్‌డీఏ) చైర్మన్ అల్లు రాధాకృష్ణయ్య, ఈఓ డాక్టర్ ఎన్.తిరుపాలరెడ్డి ముగింటకు సమస్య వచ్చి పడింది. ఈనెల 10న తలుపుల మండలానికి చెందిన తొలగించిన 11 మంది గోపాలమిత్రలు పురుగు మందు డబ్బాలతో ఆందోళన చేశారు. నరసింహులు అనే గోపాలమిత్ర శుక్రవారం ఆత్మహత్యానికి పాల్పడి, స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో అటు గోపాలమిత్రలు, ఇటు డీఎల్‌డీఏ అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో శనివారం గోపాలమిత్రలు ఆందోళనకు దిగారు.