పగ బట్టిన దొంగ
అదేంటి దొంగ పగబట్టడమేమిటని అనుకుంటున్నారా!?.. ఏం చేస్తాం.. యథా పోలీసు తథా దొంగలా మారింది అక్కడి పరిస్థితి. ఇంతకూ విషయమేమిటంటే.. గోపాలపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో చందానగర్ సమీపంలోని ఓ ఇంట్లో ఐదు రోజుల క్రితం దొంగతనం జరిగింది. రాత్రి పూట కుటుంబ సభ్యులంతా డాబా మీద పడుకుంటే అర్ధరాత్రి దొంగ వచ్చి ఇంటి తాళాలు పగులగొట్టి రెండు బ్యాగుల సంచులు, మూడువేల రూపాయల నగదు ఎత్తుకుపోయారు. తెల్లారి కిందకు దిగి చూస్తే విషయం అర్ధమైంది. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రెండు రోజుల తర్వాత బాధిత కుటుంబ సభ్యులు రైల్వేస్టేషన్ సమీపంలో అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడి వద్ద తమ ఇంట్లో చోరీ అయిన బ్యాగులు ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లొచ్చి ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తీసుకువెళ్లారు. బాల నేరస్తుడిగా గతంలోనూ చోరీ కేసులు నమోదైన చరిత్ర అతనికి ఉండటంతో.. కాస్త కోటింగ్ ఇద్దామనుకున్నారు.
పోలీసుల ఉద్దేశాన్ని పసిగట్టిన ఆ దొంగ అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు హడావుడి చేశాడు. దీంతో ఎందుకొచ్చిన గొడవని భావించిన పోలీసులు అతన్ని ఎక్కడి నుంచి తీసుకువచ్చారో.. తిరిగి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత సదరు దొంగ తాను దొంగతనం చేసిన ఇంటికి వెళ్లి ‘నాపైనే ఫిర్యాదు చేస్తారా.. మీ సంగతి చూస్తా’.. అంటూ బెదిరింపులకు దిగాడు.
ఇదే విషయం పోలీసులకు చెబితే.. వామ్మో వాడిని మనమేం చేయలేం.. మీరు కూడా పట్టించుకోకండి అని ఉచిత సలహా ఇచ్చేశారు. దొంగను పట్టించినా ‘ఇదేం బాధ.. అటు డబ్బు పోయి.. ఇటు పట్టించిన దొంగ పగబట్టి... ఏమిటో మా పరిస్థితి’ అంటూ పాపం.. ఆ సగటు దిగువ మధ్యతరగతి కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్నారట!.