వైఎస్సార్ సీపీ నాలుగో జాబితా.. సంపూర్ణ సామాజిక న్యాయం
సాక్షి, అమరావతి: సంపూర్ణ సామాజిక న్యాయం, ప్రజాదరణే గీటు రాయిగా 8 శాసనసభ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానానికి పార్టీ సమన్వయకర్తలను నియమిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగో జాబితాను ఖరారు చేశారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ పరిష్కరిస్తూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సమర్థంగా ముందుకు తీసుకెళ్లి ప్రజల మన్ననలు అందుకొన్న నేతలకు పెద్దపీట వేశారు.
సామాజిక న్యాయంలో మరో రెండడుగులు ముందుకేశారు. గురువారం రాత్రి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ వివరాలను ప్రకటించారు. గత నెల 11న 11 శాసనసభ స్థానాలకు, ఈ నెల 2వతేదీన 24 శాసనసభ, 3 లోక్‌సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను నియమిస్తూ జాబితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే ఈ నెల 11న విడుదల చేసిన మూడో జాబితాలో 15 శాసనసభ, 6 లోక్‌సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను నియమించారు.
మొత్తం నాలుగు జాబితాలతో కలిపి 58 శాసనసభ, 10 లోక్‌సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను ప్రకటించారు. 58 మంది సమన్వయకర్తల్లో ఎస్సీలు 21 మంది, ఎస్టీలు ముగ్గురు, బీసీలు 17 మంది, మైనార్టీలు నలుగురు, అగ్రవర్ణాలకు చెందిన వారు 13 మంది ఉన్నారు. పది లోక్‌సభ స్థానాల సమన్వయకర్తల్లో బీసీలు ఆరుగురు, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ఓసీ ఒకరు చొప్పున ఉన్నారు.
సామాజిక సమీకరణాలు, స్థానిక అంశాలు..
వైనాట్ 175 లక్ష్యంతో దూసుకెళుతున్న వైఎస్సార్సీపీ వ్యూహాత్మకంగా మరో ముందడుగు వేసింది. సామాజిక సమీకరణలు, స్థానిక రాజకీయ అంశాల మేలు కలయికగా తాజాగా నాలుగో జాబితాను ప్రకటించింది. ప్రజలకు మరింత మేలు చేయడం, పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా సమన్వయకర్తలను నియమించింది. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తూ 2019 నుంచి ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్‌శాఖ మంత్రిగా ఉన్న సీనియర్ నేత కె.నారాయణ స్వామిని చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది.
2019లో చిత్తూరు ఎంపీగా గెలిచిన ఎన్.రెడ్డెప్పను జీడీ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఖరారు చేసింది. ఇక అనంతపురం జిల్లా శింగనమల అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎం.వీరాంజనేయులు, నంద్యాల జిల్లా నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్ సుధీర్ దారా, శ్రీసత్యసాయి జిల్లా మడకశిర సమన్వయకర్తగా ఈర లక్కప్పలకు తొలిసారి అవకాశం కల్పించింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నల్లగట్ల స్వామిదాస్‌ను నియమించారు.
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హోంమంత్రి తానేటి వనితను గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ప్రస్తుతం గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న తలారి వెంకట్రావును కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఖరారు చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా హనుమంతునిపాడు జెడ్పీటీసీ సభ్యుడు దద్దాల నారాయణ యాదవ్‌ను నియమించారు.
చేసిన మంచే శ్రీరామరక్షగా..
ప్రజలకు నాలుగున్నరేళ్లుగా చేసిన మంచి పనులే మనకు తోడుంటాయనే ధైర్యంతో ముఖ్యమంత్రి జగన్ అడుగులు ముందుకు వేస్తూ పార్టీ శ్రేణులను ఎన్నికల సమరానికి సన్నద్ధం చేస్తున్నారు. ప్రజలకు దగ్గరగా ఉండేవారికే టికెట్ ఇస్తున్నారు. ఆ విషయం అనేకసార్లు ఆయన ఎంపీలు, ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. తన తండ్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గత 56 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలతో సుపరిపాలన అందిస్తున్నారు. డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) ద్వారా నేరుగా రూ.2.45 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.67 లక్షల కోట్లు వెరసి మొత్తం రూ.4.12 లక్షల కోట్ల మేర ప్రజలకు ప్రయోజనం చేకూర్చారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశించినట్లుగా దళితులు, బలహీనవర్గాలు, పేద వర్గాలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేలా తోడ్పాటు అందిస్తున్నారు. శాసనమండలి చైర్మన్‌గా మోషేన్ రాజును, బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్‌ను స్పీకర్‌గా నియమించి సామాజిక సమీకరణకు పెద్ద పీట వేశారు. 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మంత్రుల్ని చేశారు. సంక్షేమ పథకాలను ఎలాంటి లంచాలు, సిఫారసులకు తావులేకుండా ప్రజలకు అందిస్తున్నారు. మహిళా సాధికారతను సాకారం చేశారు. వైఎస్సార్ మహిళల్ని లక్షాధికారుల్ని చేస్తే సీఎం జగన్ వారిని కోటీశ్వరులుగా చేస్తున్నారు. పేదల పిల్లలకు ఉన్నత వర్గాలతో సమానంగా ఇంగ్లిష్ మీడియం చదువులు అందిస్తున్నారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు ద్వారా బడుగు బలహీన వర్గాలు, దళితుల ఆత్మ గౌరవాన్ని పెంపొందించారు. ఈ క్రమంలో 175 స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా సమన్వయకర్తలను నియమిస్తున్నారు.
నాలుగో జాబితా ఇదీ
చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం
(ఎస్సీ రిజర్వుడ్): కె.నారాయణస్వామి (ఉప ముఖ్యమంత్రి)
8 శాసనసభ నియోజక వర్గాలకు సమన్వయకర్తలు వీరే..
1. జీడీ నెల్లూరు (ఎస్సీ రిజర్వ్డ్ ): ఎన్ . రెడ్డెప్ప
2.శింగనమల (ఎస్సీ రిజర్వ్డ్ ): ఎం. వీరాంజనేయులు
3. నందికొట్కూరు (ఎస్సీ రిజర్వ్డ్ ): డాక్టర్ సుధీర్ దారా
4. తిరువూరు (ఎస్సీ రిజర్వ్డ్ ): నల్లగట్ల స్వామిదాస్
5. మడకశిర (ఎస్సీ రిజర్వ్డ్ ): ఈర లక్కప్ప
6. కొవ్వూరు (ఎస్సీ రిజర్వ్డ్ ): తలారి వెంకట్రావు
7. గోపాలపురం (ఎస్సీ రిజర్వ్డ్ ): తానేటి వనిత
8. కనిగిరి: దద్దాల నారాయణ యాదవ్